యుద్ధలాభం ఆయుధ వ్యాపారులకే
ABN , Publish Date - May 27 , 2025 | 01:23 AM
పహల్గామ్ ఉగ్ర దాడి తరువాత సంభవించిన పరిణామాలు విస్తృత చర్చకు దారితీశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా స్వాధీనం చేసుకోడమే తమ ధ్యేయమన్న బీజేపీ నాయకుల సారథ్యంలో భారత్ వెనక్కి తగ్గిందనే ప్రచారం సాగింది. దీనిని తుడిచిపెట్టడానికి ఆపరేషన్ సిందూర్ విజయాన్ని..
పహల్గామ్ ఉగ్ర దాడి తరువాత సంభవించిన పరిణామాలు విస్తృత చర్చకు దారితీశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా స్వాధీనం చేసుకోడమే తమ ధ్యేయమన్న బీజేపీ నాయకుల సారథ్యంలో భారత్ వెనక్కి తగ్గిందనే ప్రచారం సాగింది. దీనిని తుడిచిపెట్టడానికి ఆపరేషన్ సిందూర్ విజయాన్ని చాటుతూ దేశమంతా ఊరేగింపులు జరిగాయి. వాస్తవంలో పూర్తిస్థాయి యుద్ధం దరిదాపులకు వెళ్లిన భారత, పాకిస్థాన్‌లు ఉన్నపళంగా ఘర్షణలను విరమించుకున్నాయి. ఇది సిమ్లా ఒప్పందం మేరకు రెండు దేశాల మధ్య చర్చల ద్వారానే జరిగిందని తాజాగా ప్రకటించుకున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చొరవతోనే యుద్ధం ఆగిందన్న సమాచారం మెరుపు వేగంతో వ్యాపించింది. అప్పుడు దానిని రెండు దేశాల పాలకులూ తక్షణమే ఖండించలేదు. యుద్ధమే జరిగితే సంభవించబోయే ఘోర పరిణామాల గురించి వివరించనక్కరలేదు. అటువంటి భయానక స్థితిని తొలగించినందుకు, భారత పాకిస్థాన్ పాలకులను ఇందుకు ఒప్పించినందుకు అమెరికా అధ్యక్షుడిని అభినందించడంలో తప్పు లేదు. అయితే ఇంతటితో యుద్ధ భాష ఆగకపోడమే ఆందోళనకరం. పరస్పరం పిప్పి, పిండి చేసుకోవాలన్న ‘మీసాల’ మెలివేత కొనసాగుతూనే ఉంది. ఇది రెండు దేశాల పాలకులు తమ ప్రజల్లో పొరుగు దేశం పట్ల ద్వేషాన్ని మరింతగా పెంచి రాజకీయంగా లాభపడడానికి పాటిస్తున్న వ్యూహమే. దీనివల్లనే శాశ్వత చర్చలకు ఆటంకం కలుగుతున్నది.
ఇక్కడే మరొక బాధాకర పరిణామం–1971లో బంగ్లాదేశ్ అవతరణకు దారితీసిన యుద్ధంలో అమెరికాను సైతం ధిక్కరించిన ఇందిరాగాంధీతో మోదీని పోల్చుతున్నారు. తూర్పు, పశ్చిమ పాకిస్థాన్ల మధ్య తలెత్తిన ఆ యుద్ధం వల్ల లక్షలాదిమంది తూర్పు పాకిస్థానీయులు మన దేశంలోకి పారిపోయి రాడంతో ఇందిరాగాంధీ భారత దళాలతో ముక్తిబాహినిని సృష్టించి బంగ్లాదేశ్ అవతరణకు తోడ్పడ్డారు. అయితే ఆ యుద్ధం వల్ల సంభవించిన మానవ శోకం చెప్పనలవి కానిది. మోదీ పాకిస్థాన్‌ను ఆ విధంగా ఓడించ లేకపోయారని అనడం యుద్ధ పిపాసనే సూచిస్తున్నది. ఇది తమ ఓటు బలాన్ని తగ్గిస్తుందని, చేరువలో ఉన్న బిహార్ ఎన్నికల్లో దెబ్బ తింటామని బీజేపీ భయపడుతున్నది. అంతేగాని పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్లకుండా నిగ్రహం పాటించినందుకు సంతోషించడం లేదు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మోదీ పాకిస్థాన్ పీచమణిచారన్న అభిప్రాయాన్నీ బలంగా నాటుతున్నారు. పాకిస్థాన్‌ను మోకాళ్ళ మీదకు తెచ్చామని ఆయన కూడా ప్రకటించారు. ఈ అవకాశం, ఈ స్వేచ్ఛ తమకు ఇచ్చినందుకు భారత దళాలు ప్రధాని మోదీకి మొక్కుతున్నాయి అనేవారూ బయలుదేరారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఇంతవరకూ జరిగిన నాలుగు యుద్ధాల్లో అసంఖ్యాకంగా సైనికులు మరణించారు. ఆయుధాలకోసం రెండు దేశాలు విశేషంగా డబ్బు తగలబెట్టాయి. భారత ఉపఖండంలో రాజకీయం ఇప్పటికీ మతోన్మాదం ప్రాతిపదికనే కొనసాగుతున్న మాట కాదనలేని సత్యం. కశ్మీర్ పరిణామాలకూ అదే ఇంధనమవుతున్నది. హిందూత్వ రాజకీయాల మత కోణం దేశ ప్రజల మధ్య సృష్టిస్తున్న విభజన గురించి వివరించనక్కరలేదు. మతపరంగానో, సరిహద్దు వివాదం పరంగానో యుద్ధం తలెత్తితే అవతలి దేశాన్ని చీల్చి చెండాడాలని, దాన్ని నామరూపాలు లేకుండా చేసేయాలని పళ్ళు పటపటా కొరకడాన్ని అటూ ఇటూ గల ప్రజలకు అలవాటు చేశారు.
భారత సైనిక దళాల మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే యుద్ధాన్ని గురించి కొద్ది రోజుల క్రితమే మంచి మాటలు చెప్పారు. యుద్ధాలు బాలీవుడ్ సినిమాలు కావన్నారు, యుద్ధాల్లో ఎంతమంది చనిపోతారో, మరెంతమంది వికలాంగులై జీవితాంతం ఎడతెగని వ్యథను అనుభవిస్తారో గుర్తు చేశారు. కురుక్షేత్రం లాంటి యుద్ధ గాథలు సినిమాల్లో, నాటకాల్లో చూడ్డానికే బాగుంటాయి. ఒకరినొకరు నరుక్కోడం, శత్రువు రొమ్ము చీల్చి రుధిరమ్ము తాగడం వాస్తవంలో ఎంతమాత్రం కోరదగినవి కావు. ఇప్పుడు సరిహద్దుల రక్షణలో కన్నార్పకుండా కాపలా కాస్తున్నవారిలో, యుద్ధాల్లో ప్రాణాలు విడుస్తున్నవారిలో అత్యధికులు పేద బహుజనులే. ఉపాధి కరువై పొట్ట కూటి కోసం సైన్యంలో చేరుతున్నవారే ఎక్కువమంది. పహల్గాం ఉగ్ర దాడి బహు హేయమైనది. ఈ ఉన్మాదులు భారత, పాకిస్థాన్‌లు చేరువ కాకుండా అన్ని తంత్రాలను ప్రయోగిస్తున్నారు. రెండు దేశాల మధ్య మతపరమైన దూరాన్ని పెంచి దాన్ని అధిగమించడానికి వీలు లేని స్థాయికి తీసుకువెడుతున్నారు. భారత వ్యతిరేక ఉగ్రశక్తులకు పాకిస్థాన్ సైన్యం అండదండలు లభిస్తున్నాయి. అది పాక్ ప్రేరిత ఉగ్రవాదమే. అయితే ఈ విషయాన్ని మనం నమ్ముతున్నంతగా మిగతా ప్రపంచం నమ్మడం లేదు. మిగతా దేశాలు భారత్, పాకిస్థాన్లను ఒకేలా చూస్తున్నాయి. ఈ విషయాన్ని భారత పాలకులు తెలుసుకోవాలి. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌ను భారత్ గట్టి దెబ్బే తీసింది. అంతటితో ఆగకుండా పాకిస్థాన్ నిజస్వరూపాన్ని తెలియజేయడానికి దేశ దేశాలకు పార్లమెంటు సభ్యుల బృందాలను పంపించడం బాగుంది. అయితే అది కూడా రాజకీయ విభేదాలకు దారి తీయడం బాధాకరం. పాకిస్థాన్‌పై బలంగా విరుచుకుపడ్డాం గాని పహల్గాం దాడి ముష్కరులను కనుక్కోడంలో జాప్యం జరుగుతున్నది. వారెవరో స్పష్టంగా తెలిస్తే బాగుంటుంది. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలని భావిస్తున్న దేశాల ప్రజలు యుద్ధోన్మాదంతో వూగిపోడం సరైనది కానే కాదు. ఇది రక్షణ ఖర్చును ఆకాశానికి చేర్చి ప్రజలను కనీస విద్య, వైద్యం కూడా దొరకని దారిద్ర్యంలో కూరుకుపోయేలా చేస్తుంది. వాస్తవానికి టెర్రరిజం సమస్య చాలా లోతైనది. ప్రపంచ పాలకులు ముఖ్యంగా అమెరికా ఇజ్రాయెల్ వంటి దేశాలు చిత్తశుద్ధితో ఆలోచిస్తే వాటి అసలైన మూలాలు కనిపిస్తాయి. భారత పాకిస్థాన్‌లకూ ఇదే వర్తిస్తుంది. టెర్రరిజం గాని, వామపక్ష ఉగ్రవాదం గాని ఊరకే ఆకాశం నుంచి ఊడిపడేవి కావు. మెజారిటీ, మైనారిటీలు హాయిగా శాంతియుత సహజీవనం చేస్తున్న చోట సెక్యులరిజం వర్ధిల్లుతున్న దేశంలో మతపరమైన మెజారిటీని మైనారిటీల మీదికి రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యమనిపించుకోదు. పాక్‌కు జీలం నది నీటిని ఆపడం గాని, ఘర్షణలకు కారణమయ్యారని భావించి వారి ఇళ్లు కూల్చి తల మీద కప్పు లేకుండా చేయడం గాని మానవీయమైన పనులు కావు. కక్ష కక్షనే ఇస్తుంది. ఉగ్రవాదానికి అది కూడా దారి తీస్తుంది. మన దేశంలో అధిక సంఖ్యాకుల మతస్వామ్యం వంటిదే రాజ్యమేలుతున్నది. వక్ఫ్ బిల్లులో మోదీ ప్రభుత్వం తేదలిచిన మార్పులను సెక్యులర్ రాజ్యాంగ రక్షకురాలైన సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రశ్నించడమే ఇందుకు నిదర్శనం. ఉగ్రవాదం క్రూరమృగం కంటే ప్రమాదకరమైనది. దాని నిజమైన మూలాలు తెలుసుకొని వాటిని నిర్మూలించినంతవరకూ పేట్రేగుతూనే ఉంటుంది. బలమైన శత్రువు నేరుగా బరి మీదికి వస్తాడు. తగిన బలం లేనివాడు దొంగదెబ్బ తీస్తాడు. హమాస్ ఒకసారి తమపై దాడి చేసిందని ఇజ్రాయెల్ గాజాలో ఇప్పటివరకు దాదాపు అరవై వేలమందిని హతమార్చింది. వారిలో ముక్కుపచ్చలారని పసి పిల్లలు, మహిళలే అధికులు. అయినా హమాస్ కాకపోతే మరో ఉగ్రవాద సంస్థ పుడుతూ ఉండడానికే ఆస్కారం ఎక్కువ. యుద్ధాలు అత్యంత ఖరీదైన ఆధునిక ఆయుధాల కొనుగోలును పెంచుతున్నాయి. దాని వల్ల కోట్లాది ప్రజలు బలవుతున్నారు. అమెరికన్ ఆయుధ కంపెనీల ఆదాయం ఆకాశానికి అంటుతున్నది. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా వల్ల 2024లో అమెరికన్ లాక్ హీడ్ కంపెనీ లాభాలు 14శాతం పెరిగాయి. ట్రంప్ పర్యటనలో అమెరికా నుంచి 152 బిలియన్ డాలర్ల ఆయుధాల కొనుగోలుకు సౌదీ అరేబియా ఒప్పందం కుదుర్చుకున్నది.
ఈ కొనుగోలును 600బిలియన్ డాలర్ల వరకూ తీసుకుపోడానికి ఒప్పందం కుదిరింది. భారతదేశం కూడా ఈ ఉచ్చులో చిక్కుకున్నది. ప్రధాని మోదీ అమెరికా ఆయుధ మార్కెట్లో చక్కర్లు కొడుతున్నారు. 2020 నుంచి 2025 వరకు భారతదేశం రక్షణ కోసం 350 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. పాకిస్థాన్ మిలిటరీ దేశం అని యెత్తి చూపే మనం ఎంత శాంతి కాముకులమో దీనిని బట్టి తెలుస్తున్నది. ఇంత చేసీ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తొలగించగలిగామా, లేదు. 2020 నుంచి కశ్మీర్‌లో టెర్రరిజం నిరాఘాటంగా సాగిపోతున్నది. వందలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. టూరిజం దారుణంగా దెబ్బ తిని లక్షలాది మంది ఉద్యోగాలు కొల్పోతున్నారు. ఆపిల్ వ్యాపారం మూతబడిపోతున్నది. గతంలోకి వెడితే 2015 డిసెంబర్‌లో ఆఫ్ఘానిస్తాన్ పర్యటన నుంచి తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ ఊహించని విధంగా లాహోర్‌లో దిగి అప్పటి పాక్ అధినేత నవాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. నవాజ్ మనుమరాలి పెళ్ళికి హాజరయ్యారు. మళ్ళీ అటువంటి సన్నివేశాలను చూడలేమా, రెండు దేశాల మధ్య అతి చేరువ వ్యాపారం తిరిగి వర్ధిల్లదా, ఆయుధాల కొనుగోలుతో దేశాలకు దేశాలు ఆకలి అవిద్య జబ్బుతో, మందుల కరవుతో ఆత్మహత్య మార్గం పట్టడం ఆగదా, శాంతి పుంజం ప్రసరించదా?
గార శ్రీరామమూర్తి
సీనియర్ జర్నలిస్ట్
ఇవి కూడా చూడండి
నక్సలైట్లపై సీజ్ ఫైర్ ప్రకటించాలి