Share News

Waqf Amendment Act 2025: ఆర్తవచనం

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:03 AM

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్‌ సవరణ చట్టంపై అభ్యంతరాల వల్ల ముర్షీదాబాద్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, మత సామరస్యంపై దెబ్బతినే పరిణామాలు కనిపిస్తున్నాయి. ముస్లింల హక్కులను క్షీణింపజేస్తుందనే ఆరోపణల మధ్య, రాజకీయ పార్టీలు సంకుచిత ప్రయోజనాల కోసం పరిస్థితిని రాజకీయంగా వినియోగిస్తున్నాయి.

Waqf Amendment Act 2025: ఆర్తవచనం

మత సామరస్యాన్ని, మైనారిటీ మతస్థుల శ్రేయస్సును కోరుకుంటున్న భారత పౌరులు ఏ ప్రాంతం వారైనా, ఏ మతం వారైనా బెంగాల్‌ ఘటనలకు వ్యాకులపడుతున్నారు. వక్ఫ్‌ చట్టంపై నిరసనలు, ఆందోళనలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులు, భిన్న సామాజికవర్గాల పరస్పర దాడులతో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లా అట్టుడికిపోతోంది. గత మంగళవారం నాడు ప్రారంభమైన ఈ అరాచకకాండ ఇప్పటికీ తగ్గుముఖం పట్టలేదు. కొత్త వక్ఫ్‌ చట్టంపై ప్రజల్లో నెలకొన్న గందరగళమే ఈ అలజడికి దారి తీసిందని చెప్పవచ్చు. చట్టాన్ని తీసుకువచ్చిన జాతీయ పాలక పక్షం వారుగానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగానీ ప్రజల్లో ఆ చట్టంపై ఒక స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శ్రద్ధ చూపక పోగా పరస్పర ఆరోపణలు చేసుకోవడం పరిస్థితులు దిగజారిపోయేందుకు ఆస్కారమేర్పడింది. రాజకీయ అవకాశవాదానికి పాలనా యంత్రాంగ వైఫల్యాలు తోడవడంతో ముర్షీదాబాద్‌ జిల్లాలోను, బెంగాల్‌లోని ఇతర ప్రాంతాలలోను తీవ్ర అవాంఛనీయ పరిస్థితులు నెలకొన్నాయి.


హిందువులు ముస్లింలు ఇరువర్గాలూ ఈ ఆందోళనలు, హింసాకాండకు బాధితులవుతున్నారు. ఏ ఒక్క మత సమూహాన్ని ఈ చర్యలకు పూర్తి బాధ్యులుగా చేయడం సత్యాన్ని గౌరవించడమవదు. స్వతంత్ర భారతదేశంలో మున్నెన్నడూ లేని విధంగా ముస్లిం పౌరులు సమస్త విషయాలలోను వివక్షకు గురవుతున్న తరుణంలో ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్‌ (సవరణ) చట్టం–2025ను తీసుకువచ్చింది. పార్లమెంటు ఉభయ సభలలో ఆ బిల్లును హడావుడిగా ఆమోదింప చేసింది. రాజ్యాంగ పరిభాషలో ఉన్న ఈ సవరణ చట్టం వాస్తవంగా ముస్లింలను ఆర్థికంగా దెబ్బతీసే చట్టం; మతపరంగా వారిని అగౌరవపరిచే చట్టం అనడంలో సందేహం లేదు. ముస్లింలను అణచివేసేందుకు ఉద్దేశించిన చట్టం. మత ధర్మం ప్రకారం విశాల సమాజం శ్రేయస్సుకై దానం చేసిన ఆస్తి వక్ఫ్‌. మరి ఆ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన బోర్డులో ఆ మతానికి చెందినవారే ఉండడం న్యాయం కదా. ఇతర మతస్థులకు అందులో భాగస్వామ్యం కల్పించడంలో ఔచిత్యమేమిటి? ఆక్రమణకు గురైన వక్ఫ్‌ భూములను కబ్జాదారులకు అప్పగించేందుకు ఈ కొత్త చట్టం దోహదం చేయడం లేదూ? రాజ్యాంగ నైతికత ఏమయినట్టు? మరి మెజారిటీ మతస్థుల ఆస్తుల నిర్వహణకు కూడా ఇటువంటి నిబంధనను నిర్దేశిస్తారా? సమన్యాయాన్ని పాటించి మత స్వేచ్ఛకు తోడ్పడే చట్టం మాత్రమే భారత రాజ్యాంగ విహితమైనది.


ఒక విజ్ఞుడు అన్నట్టు ఈ దేశ చరిత్రలో ముస్లింల స్థానం పాదసూచిక ప్రాయమైనది ఎంత మాత్రం కాదు, మన సమున్నత చరిత్రకు వారు సహ రచయితలు. మరి కొత్తవక్ఫ్‌ చట్టం వారికి న్యాయం చేస్తుందా? చేయనప్పుడు అది ముస్లింలకు అన్యాయం చేయడమే కాదూ? సహమతస్థులు, తోటి పౌరులకు వాటిల్లిన అన్యాయం విశాల సమాజం శ్రేయస్సునూ దెబ్బ తీయదూ? బహుళ మతాలు వర్థిల్లుతున్న సమాజంలో ప్రభుత్వాలు చేసే చట్టాలు కేవలం అధిక సంఖ్యాక మతస్థుల అభిప్రాయాలను మాత్రమే ప్రతిబింబించినా లేదా ఇతర మతస్థుల మనోభావాలను మన్నించక, వారి ప్రయోజనాలను దెబ్బతీయడానికి ప్రయత్నించినా ఎవరికీ శ్రేయస్సు నివ్వదు. కొత్త వక్ఫ్‌ చట్టం ఇటువంటి అవాంఛనీయ పరిస్థితినే కల్పించింది. మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సంవత్సరంలో ఇటువంటి చట్టాన్ని తీసుకురావడమేమిటి? ఒకనాడు కవి తిలక్‌ బాధాతప్త హృదయంతో ప్రశ్నించినట్టు ‘ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి?’ బెంగాల్‌ అసెంబ్లీకి మరో ఏడాది కాలంలో ఎన్నికలు జరగనుండడంతో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తాపత్రయపడుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌, బెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ సంకుచిత రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఎన్నికల తరుణంలో ఈ తరహా ఆరోపణలు సహజమే అయినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వాధినేతగా రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా శాంతిభద్రతలను పరిరక్షించడమనేది ముఖ్యమంత్రి విద్్యుక్త ధర్మం. ఈ నైతిక కర్తవ్య పాలనలోనే తనకూ, భారత ప్రజాస్వామ్యానికి శుభం సమకూరుతుందనే సత్యాన్ని మమతా దీదీ మరచిపోకూడదు.

Updated Date - Apr 15 , 2025 | 05:07 AM