Share News

When Grief Speaks: తల్లడిల్లిన తోటి తల్లుల మాటేమిటి

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:07 AM

నాన్నా నిన్ను చివరి చూపు చూస్తానా అంటూ స్నేహలత మల్ల రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతి ఆగస్టు 8 చదివాక అన్యాయంగా నక్సల్స్ చేత చంపబడ్డ...

When Grief Speaks: తల్లడిల్లిన తోటి తల్లుల మాటేమిటి

‘నాన్నా నిన్ను చివరి చూపు చూస్తానా’ అంటూ స్నేహలత మల్ల రాసిన వ్యాసం (ఆంధ్రజ్యోతి – ఆగస్టు 8) చదివాక అన్యాయంగా నక్సల్స్ చేత చంపబడ్డ వందలాదిమంది బిడ్డల తల్లుల హృదయాలు జ్ఞప్తికి వచ్చాయి. నక్సల్స్‌కు ఏదన్నా జరిగినప్పుడు పదుల సంఖ్యలో గొంతులు ‘వసంత మేఘా’ల్లా గర్జిస్తాయి. కానీ అదే నక్సల్స్ చేతుల్లో చనిపోయిన ప్రజలు, రక్షణ దళాల సభ్యుల తరఫున ఒక్క గొంతు కూడా పెగలదు. ఇంకా తన తండ్రి సజీవంగా ఎక్కడో ఉన్నాడన్న సమాచారం తెలిసి కూడా స్నేహలత అంత మథనపడుతున్నదే! మరి సమాజంలో అందరి మధ్యా రాజ్యాంగబద్ధ, చట్టబద్ధ పాలనలో బతుకుతున్న తమ బిడ్డల్ని అకారణంగా తుపాకీ తూటాలతో కాల్చి చంపితే, ఇక తమ బిడ్డలు లేరనీ, రారనీ తెలిసిన ఆ తల్లుల బాధ ఇంకెంత తీవ్రంగా ఉంటుంది? యుద్ధంలో తన తండ్రి క్షేమాన్ని కోరుతున్న స్నేహలత ఆ వ్యాసంలో తన తండ్రి చేత చంపబడ్డ వారి విషయాన్ని మాత్రం కనీసం తలచుకోలేదు, ఆమెకు ఆ విషయంలో ఏ పశ్చాత్తాపమూ లేదు. పోనీ ఒక బిడ్డగా తన తండ్రిని తిరిగి రమ్మనో, మాతో మా కుటుంబంతో కలిసి ఉండాలనో రాస్తారేమో అనుకొని వ్యాసాన్ని ఆసాంతం చదివినా గానీ అలాంటి మాటలు కూడా ఎక్కడా కనపడలేదు. సరికదా తండ్రి తన యుద్ధంలో విజయం సాధించాలని రాశారు. అంటే ఇంకా వందలాదిమందిని పొట్టన పెట్టుకొని వందలాదిమంది తల్లులు తల్లడిల్లేలా రక్తం ఏరులై పారాలని ప్రోత్సహిస్తున్నట్టే కదా! కరడుకట్టిన మృగాలుగా క్యాంపస్ హాస్టళ్లపైనా, గ్రామాలపైనా పడి క్రూరంగా చిత్రహింసలు పెట్టి కొంతమందినీ, విచక్షణారహితంగా తుపాకులతో కాల్చి ఎంతో మందినీ చంపిన నక్సల్స్ ముఠా నాయకుడు తన తండ్రి అయినందుకు పశ్చాత్తాపం ఏ మాత్రం చూపించకపోగా, ఆమె ఇలా తన తండ్రిపై అవ్యాజమైన ప్రేమను సమాజానికి చాటి చెప్పటం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు? కనీసం తన తండ్రి నమ్మిన కాలం చెల్లిన సిద్ధాంతం నేటి ఆధునిక సమాజానికి సరిపోదని, తిరిగి జన జీవన స్రవంతిలో కలవమనీ చెపితేనన్నా బాగుండేది. అలాగాక, అదొక యుద్ధం అంటూ మళ్ళీ దానికి అందమైన పేరొకటి పెట్టి నరహంతక ముఠా నాయకులను సమాజానికి హీరోలుగా చూపించే ప్రయత్నం చేశారు.


ఆమె తండ్రి మూడోవంతు జీవితాన్ని ఏ సమాజహితానికి అంకితం చేశారు? ఏ అభివృద్ధికి, ఏ దేశ నిర్మాణానికి త్యాగం చేశారు? వివరిస్తే బాగుండేది. సంఘ విచ్ఛిన్నకర నక్సల్ నాయకుడిని స్వాతంత్ర్య వీరులతో, దేశోద్ధారకులతో పోల్చడం నిజంగా ఆ స్వాతంత్ర్య వీరులని అవమానించడమే అవుతుంది. ఆ మాటకొస్తే శ్రీకాకుళం రైతాంగ పోరాటం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం వరకు జరిగిన కమ్యూనిస్టుల అకృత్యాలు మొదలుకొని, నక్సల్‌బరి నుంచి నేటి మావోయిస్టు ఉద్యమం వరకు జరిగిన మైదాన పోరాటాలు, అజ్ఞాత పోరాటాల చరిత్ర సమస్తం రక్తసిక్తమే! మైదాన ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాల్లో పాల్గొనే కమ్యూనిస్టు నాయకులు కొన్నిసార్లు అజ్ఞాతంలోని తమ సోదరులకు అండదండలుగా ఉంటూ వారి ఎదుగుదలకు సహకరిస్తూ రెండు రకాలుగానూ సమాజానికి తీవ్ర నష్టం చేశారు. ఈ దేశానికి, ఈ కాలానికి అనువుగాని, సరితూగని సిద్ధాంతాన్ని బలవంతంగా, క్రూరంగా ఈ దేశ ప్రజలపై రుద్దేందుకు విఫలయత్నం చేస్తూనే వచ్చారు. శ్రీకాకుళ ప్రాంతం నుంచి తెలంగాణ వరకు తెలుగు నేలపై జమీందారీ, భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గ నిర్మూలన పేరిట అమాయకుల తలలను నరికి ఉట్లపై పెట్టి, రచ్చబండపై వేలాడతీసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయటం, ప్రజా కోర్టులో శిక్షలు అంటూ నడి ఊరిలో భార్యాబిడ్డల ముందే సజీవంగా కాల్చి చంపడం, విప్లవం పేరిట సమాజ నిర్మాణం అంటూ, భూమి, భుక్తి, విముక్తి అంటూ... ఇలా లెక్కకు మిక్కిలిగా వారు సాగించిన దురాగతాలను, నరమేధాన్ని చరిత్రపుటల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఆచరణ సాధ్యం అవుతుందో లేదో తెలియని మార్క్స్ అనే గతి తార్కిక మేధావి వల్లె వేసిన మాటల్ని నిజం చేయాలన్న తపనలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని తగలబెట్టి; వందల మంది అమాయకుల్ని, దేశ రక్షణ కోసం పనిచేసే భద్రతా దళాలను కిరాతకంగా చంపుతూ; తమ దుశ్చర్య ఎంత అమానుషంగా విజయవంతం అయితే తమ సిద్ధాంతం అంత విజయవంతం అవుతుందని భావించే తండ్రినీ, దేశంపై ఆయన చేసున్న యుద్ధాన్నీ కీర్తిస్తూ రాయటం ఆ కూతురికి మాత్రమే ఆనందాన్ని మిగల్చగలదు. గోరుముద్దలు, చందమామ కథలు, అమ్మ ఒడి అంటూ ఆమె పేర్చిన పదాల కూర్పును వందలాది అమ్మలకు ఎందుకు అన్వయించరు?


తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ, ఆర్‌ఈసీలలో 70వ దశకం నుండి 90వ దశకం చివరి వరకు సాగిన నక్సల్స్ విధ్వంసకాండ, వారు సాగించిన మారణహోమం గురించి ఇప్పటికీ కథలుగా చెప్తారు. ఎంతోమంది జాతీయవాదుల్ని, ఏబీవీపీ, ఆరెస్సెస్‌ నాయకుల్ని బహిరంగంగా కాల్చి చంపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కృష్ణ వర్ధన్, సామ జగన్మోహన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, పూజారి మాణిక్యం, ఏచూరి శ్రీనివాస్, మధుసూదన్‌గౌడ్, మేరెడ్డి చంద్రారెడ్డి లాంటి ఎంతోమంది విద్యార్థి నాయకులు నక్సలైట్ల నరమేధానికి బలయ్యారు. ఆ కుటుంబాల్ని కదిలిస్తే కన్నీళ్లు ఇప్పటికీ ఏరులై పారుతాయి. పాతికేళ్ళ నవ యువకులైన తమ బిడ్డల్ని కళ్ళ ముందు బహిరంగంగా, అకారణంగా కాల్చి చంపితే ఆ తల్లుల బాధ ఎలా ఉంటుందో సాటి తల్లులకే తెలుస్తుంది. చదువుకునేందుకు వెళ్లిన కొడుకు శవంగా మారి ఇంటికి వస్తే తల్లడిల్లిన ఆ గుండెకే ఆ బాధ అర్థం అవుతుంది. అలాంటి వందలాదిమంది విద్యార్థులని, పోలీసుల్ని, అమాయకపు పౌరుల్ని మట్టుపెట్టిన నక్సల్స్ నేతపై కూతురిగా ఆమెకు ప్రేమ ఉండొచ్చు కానీ దాన్ని బహిరంగంగా వ్యక్తం చేసి, వందల మంది తల్లుల శోకాన్ని మళ్లీ తట్టిలేపటం క్రూరత్వమే అవుతుంది. అంతేగాక, రాజ్యాంగ వ్యతిరేకశక్తులకు, చట్టవిరుద్ధ భావజాలానికి వత్తాసు పలుకుతూ, కీర్తిస్తూ ఇంకా ఎంతోమంది యువతను ఆ సిద్ధాంతం వైపు ప్రేరేపించటం ఏ మాత్రం మంచి విషయం కాదు. నక్సల్స్ చేతిలో బిడ్డల్ని కోల్పోయిన తల్లులు కూడా మీలాంటి బిడ్డలే.

-డా. దొంతగాని వీరబాబు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

Updated Date - Sep 04 , 2025 | 01:07 AM