Share News

Red Salute to Suravaram: సురవరా.. సకల జనవరా...

ABN , Publish Date - Aug 26 , 2025 | 04:49 AM

ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా ఉంటుంది కానీ, దేశ దేశాల పీడితులకు మాత్రం ఎర్ర జెండానే ఈ దేశపు ఎర్రజెండా సురవరం

Red Salute to Suravaram: సురవరా.. సకల జనవరా...

ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా ఉంటుంది

కానీ, దేశ దేశాల పీడితులకు మాత్రం ఎర్ర జెండానే!

ఈ దేశపు ఎర్రజెండా సురవరం


సురవరం ప్రతాపరెడ్డి అంటే

గోలకొండ, ఆంధ్రుల సాంఘిక చరిత్ర

సురవరం సుధాకర్ రెడ్డి అంటే

ఎగరేసిన ఎర్రజెండా చరిత్ర


ఎట్టి చాకిరీపై తిరగబడుతున్నప్పుడు

ప్రాణం పోసుకున్నాడు

దేశానికి ఏ స్వాతంత్రం లేనప్పుడు

కళ్ళు తెరిచినోడు


మాకింకా స్వాతంత్రం రాలేదని

కలబడుతున్నోళ్ళ పక్కన నిలబడి

కన్నుమూసే దాకా కలబడ్డోడు

వీర తెలంగాణ పోరు కళ్ళజూసి

తన చూపును విముక్తిదిశగా మళ్ళించినవాడు


సురవరం

నీ స్వరంలో వున్నదేమో భాస్వరం

నువ్వు గొంతెత్తి మాట్లాడుతుంటే

యుద్ధ శతఘ్నులు పేలినట్లు ఉండేది


మా బుగ్గలను ఎరుపెక్కించిన

సురవరా, సకల పీడిత జనవరా


నోరులేనోళ్లకు శ్వాసవై

నిలువలేనోళ్లకు అండవై

మా విముక్తి దేశానికి స్వాతంత్రం అని

కంచు కంఠం పగిలేలా వినిపించిన

సురవరం నువ్వు లేవంటే

గుండె కలుక్కుమంటుండే


సురవరానికి ఎర్ర ఎర్రని లాల్ సలాం

తనను తాను పీడిత దేశానికే

అంకితం చేసుకున్నోడికి అరుణారుణ సలాం

– జూలూరు గౌరీశంకర్

Updated Date - Aug 26 , 2025 | 04:49 AM