Perugu Ramakrishna: దిగులులేని దేహం
ABN , Publish Date - May 26 , 2025 | 04:53 AM
సమూహంలోనే ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవించే మనసు, ఆత్మీయత కోసం చిన్న చిన్న జీవిత సంబంధాల మధ్య అల్లుకున్న జీవితం. అమ్మగారి స్మృతులతో ఒంటరిగా గడిచిన క్షణాలు, భవిష్యత్తులో మానవ సంబంధాల విలువను గుర్తుచేస్తుంది.
సమూహంలోంచి తెగిపడ్డ విశ్రాంత జీవితం అప్పుడప్పుడు భయపెడుతుంది నీటిలోంచి బయటపడ్డ రంగు చేపలా మనసు కలవరపడుతుంది రోజు సాగదీయబడ్డట్టు అనిపిస్తుంది గంటలు యుగాలైనట్టు దొర్లుతున్నాయి అంత ఇంట్లో అంతటా ఖాళీతనం...
అమ్మ గుర్తుకొచ్చింది బ్రతుకు తెరువుల పోరాటంలో ఉదయాన్ని కారియర్ గిన్నెల్లో సర్దుకుని మేమందరం తలా ఒక దిక్కు వెళ్ళాక- అన్ని రోజులు, అన్ని నెలలు, అన్నేళ్లు, ఒంటరితనం మోస్తూ గది గోడలు చూస్తూ అనంత శూన్యంతో సంభాషిస్తూ ఎలా గడిపిందో అనిపిస్తుంది..?
అందుకే కాబోలు, అప్పట్లో మాకంటే సీరియల్ పాత్రలే ఆమెకు తోడుగా, దగ్గరగా వుండేవి.. మేడమీద నుంచొని, రోడ్డు మీదెళ్లే బాటసారులతో బంధుత్వం కలుపుకునేది. ఇంటిముందు అరుగు మీద సాయంత్రానికి స్నేహితులతో ఒక ప్రపంచాన్ని సృష్టించుకునేది.. కాలాన్ని గుణిస్తూ ఎదురుచూపుల్తో సంధ్యవేళకు మాకోసం కిటికీ దగ్గర తైలవర్ణ చిత్రమయ్యేది
మొక్కల్ని నీళ్లతో పలకరించేది పెంపుడు కుక్కకి పెరుగన్నం ప్రేమ పంచేది పాడే పిట్టకు గింజలేసి స్వాగతించేది ఇంటి ముందరి మహావృక్షం కొమ్మలు, రెమ్మలు, ఆకులన్నీ ఆమెకు సుపరిచితమే.. మనుషులు కనిపించని సమయాల్లో ప్రకృతితో మమేకమయ్యేది ఇష్టంగా పుస్తక ప్రయాణం చేసేది భక్తి రంగరిస్తూ వత్తులు చుట్టేది
రేపటి వారసత్వానికి కళాత్మకంగా లేసులల్లేది రేపటి మనిషికి మానవ సంబంధాలు మృగ్యం అని ముందుగానే పసిగట్టేది రాబోయే రోజుల్లో సమూహంలో ఉన్నా మనిషి ఒంటరే అనే హెచ్చరిక చేసేది..
ఇప్పుడిక అచ్చం అమ్మలా జీవమున్న లోకం ఒకటి ఏర్పరచుకోవాలి ఖాళీతనాన్ని పారదోలి ఒక పనిలోంచి మరో పనిలోకి తరలింపే విశ్రాంతిగా భావించాలి దిగులులేని దేహంగా మారిపోవాలి!
-పెరుగు రామకృష్ణ
98492 30443