Vishwakarma Community: విశ్వకర్మలకు చేయూతనందించాలి
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:58 AM
మట్టిని నమ్ముకున్న రైతులెందరో నష్టాల బారినపడ్డప్పుడు పురుగుల మందునే పరమాన్నంగా చేసుకుని, ఆ మట్టిమీదే ప్రాణాలు వదిలినట్లుగా...
మట్టిని నమ్ముకున్న రైతులెందరో నష్టాల బారినపడ్డప్పుడు పురుగుల మందునే పరమాన్నంగా చేసుకుని, ఆ మట్టిమీదే ప్రాణాలు వదిలినట్లుగా... చేసే వృత్తి కూడు పెట్టలేకపోతోందనే ఆవేదనతో, పూటగడవక విశ్వకర్మలు కూడా నిప్పుల కుంపట్లలో తమ అసువులను ఆవిరి చేసుకుంటున్నారు. ఈ వాక్యాలు రాయడానికి నేనేమీ చేయి తిరిగిన రచయితను కాదు కానీ, విశ్వకర్మల జీవితాల్ని లోతుగా చదివినవాణ్ణి. విశ్వకర్మలకు చెందిన పంచకులాల వారు తరతరాలుగా తమ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారు. కానీ చేతినిండా పని లేకపోవడంతో, ప్రభుత్వం నుంచి సరైన చేయూత లేకపోవడంతో.. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గడచిన నాలుగు దశాబ్దాల్లో ఇలా ప్రాణాలు తీసుకున్న విశ్వకర్మలెందరో.
అనేక పోరాటాల అనంతరం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విశ్వకర్మల కార్పొరేషన్లు పెట్టారు. కానీ ప్రభుత్వాలు వాటికి నిధులు కేటాయించడంలో అశ్రద్ధ చూపుతున్నాయి. కార్పొరేషన్లకు తగినన్ని నిధులు కేటాయిస్తే, వస్తుత్పత్తి ద్వారా ఆ నిధులకు ఐదు రెట్లు ప్రభుత్వాలకు ఆదాయం అందించడానికి మా విశ్వకర్మలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు సమృద్ధిగా నిధులు కేటాయించాలి. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని వడ్రంగులకు ఫెడరేషన్లు వేయాలి. నోడల్ అధికారితో పాటు ఆ సంఘం నాయకులు సంయుక్తంగా అవసరమైన వస్తుత్పత్తి పనులకు రూపకల్పన చేస్తారు. ఆ జాబితాను ప్రభుత్వం పరిశీలిస్తుంది. గృహ సంబంధ, ప్రభుత్వం నిర్మించబోయే పేదల ఇండ్లకు కావాల్సిన చెక్క పనులన్నీ కాంట్రాక్ట్ ద్వారా ఆ ఫెడరేషన్లకే ఇవ్వాలి. ఇతర ఇనుము సంబంధిత పనులనూ విశ్వకర్మలకే అప్పగించాలి. ఎన్నో తరాలుగా కంచాలు, బిందెలు, గునపాలు, కత్తులు వంటి పనిముట్లు చేసి విశ్వకర్మలు నాగరికతలో భాగమయ్యారు. వారందరికీ చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహం కల్పించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సులభంగా వస్తువులను తయారు చేయడానికి ఈ పంచకులాల వారికి ప్రభుత్వం అవసరమైన శిక్షణనివ్వాలి. మా విశ్వకర్మ కులాలను ప్రోత్సహిస్తే వస్తుత్పత్తిలో ఇక్కడే మినీ చైనాను సృష్టించవచ్చు. ఆలయాల్లో చెవులు కుట్టించడం, వివాహ సందర్భాల్లో పలు కార్యక్రమాలకు విశ్వబ్రాహ్మణులను ప్రభుత్వం అధికారికంగా నియమించాలి. వారికి దేవస్థానాల నిధులతోనే జీతభత్యాలు చెల్లించాలి. బ్యాంకుల్లో గోల్డ్ అప్రైజర్స్‌గా స్వర్ణకారులను నియమించాలి. విశ్వకర్మల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. తద్వారా వస్తుత్పత్తికి ప్రోత్సాహం అందించినట్లవుతుంది. అది రాష్ట్ర సంపదగా, దేశ సంపదగా మారుతుంది. నూతన మార్పులకు శ్రీకారం చుట్టిన చంద్రన్న ప్రభుత్వం మా విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపాలి.
-గోడి నర్సింహాచారి రాష్ట్ర కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ బీసీ సాధికారిక కమిటీ