Share News

Google Data Center: ఉత్తరాంధ్రలో మరో సైబరాబాద్

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:26 AM

ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో నెలకొల్పబోతున్నది. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది....

Google Data Center: ఉత్తరాంధ్రలో మరో సైబరాబాద్

ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో నెలకొల్పబోతున్నది. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ప్రాజెక్టుకు గూగుల్ ఏకంగా 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.50వేల కోట్లు) వెచ్చించబోతున్నది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ఇన్వెస్ట్ ఇండియా’ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ రానున్నదని చెప్తూ వస్తున్నా, ఇప్పుడు కేంద్రం కూడా ప్రకటించడంతో, ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చినట్లు అయింది. ఇన్వెస్ట్ ఇండియా ట్వీట్ ప్రకారం ఈ డేటా సెంటర్‌కు నిరంతర కనెక్టివిటీ కోసం సముద్ర గర్భం నుంచి మూడు భారీ కేబుల్స్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడయ్యింది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విశాఖపట్నం దేశవ్యాప్తంగా ముఖ్యమైన డేటా హబ్‌లలో ఒకటిగా ఎదగనున్నది. ప్రస్తుతం ముంబై నగరం డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా ఉంది. విశాఖలో ఏర్పడనున్న కొత్త డేటా సెంటర్ దానికంటే రెట్టింపు సామర్థ్యంతో పని చేయనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖను కీలక ఐటీ హబ్‌గా మార్చాలన్న ఐటీ మంత్రి నారా లోకేశ్‌ సంకల్పానికి ఈ భారీ పెట్టుబడి పెద్ద ఊతం ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


ఇది భారతదేశంలో గూగుల్‌కి చెందిన తొలి ప్రత్యక్ష డేటా సెంటర్ ప్రాజెక్టు. అమెరికా వెలుపల గూగుల్‌కు ఉన్న అతిపెద్ద డేటా సెంటర్‌ ఇదే కానున్నది. ఈ సెంటర్ 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మితం అవుతుంది. రానున్న ఐదేళ్ళల్లో 6 గిగావాట్ సామర్థ్యానికి చేరుకోవటం ఈ డేటా సెంటర్ ముందున్న లక్ష్యం. ప్రస్తుతం సమీప భవిష్యత్తులో 1.6 గిగావాట్ పెట్టుబడులను సమీకరించేందుకు కొద్ది వాటా ముందస్తుగా ఖరారయ్యింది. గూగుల్ డేటా పంపిణీ మౌలిక నిర్మాణంలో విశాఖపట్నం కీలక కేంద్రంగా మారనున్నది. 6 బిలియన్ల పెట్టుబడి, 1 గిగావాట్‌ సామర్థ్యం, పునరుత్పాదక శక్తితో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతున్నది. అనేక ఫిర్యాదులను, ప్రతిబంధకాలను దాటుకు వచ్చిన ఈ ప్రాజెక్టు రాష్ట్రాన్ని డిజిటల్ భవిష్యత్తు వైపు త్వరితంగా మళ్ళించనున్నది. త్వరలో ప్రారంభం కానున్న కేబుల్ ఇండియా సెక్షన్ విశాఖపట్నం సెంటర్‌ను ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌కి అనుసంధానించడంలో కీలకంగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తుంది. నిర్మాణం, నిర్వహణ, ఐటీ, ఇంజనీరింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ తదితర రంగాల్లో భారీ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండడంతో, భౌగోళికంగా విశాఖపట్నం సౌకర్యవంతమైన ఐటీ & డిజిటల్ హబ్‌గా మారనున్నది. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలను చేరుకునే క్రమంలో రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ కృషి చేస్తున్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా నిలుస్తున్నది. పారిశ్రామిక వికాసంపై విశ్వాసం కలిగిస్తున్నది. రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పెట్టుబడులు బారులు తీరుతున్నాయి. ఇప్పటికే లులూ, ఒబెరాయ్‌, బ్రూక్‌ఫీల్డ్‌, సుజ్లాన్‌, గూగుల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ముందుకు రాగా, మరికొన్ని ఐటీ సంస్థలు రాష్ట్రానికి రావడానికి సిద్ధపడుతున్నాయి. టీసీఎస్‌ విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావడంతో విశాఖ ఐటీ హబ్‌గా మారనున్నది. చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో రాష్ట్రానికి ఆర్సెలర్స్ మిత్తల్, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు బారులు తీరుతున్నాయి.


సుందరమైన విశాఖనగరంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఎకో సిస్టమ్ అందుబాటులో ఉన్నది. అక్టోబరులో మిత్తల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుకు రెన్యూ సంస్థ రాయలసీమలో పనులు ప్రారంభించింది. ప్రధాని మోదీ వికసిత్ భారత్, చంద్రబాబు విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు, వ్యాపార నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత అనుకూల వాతావరణం ఉందని ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) 2025 ర్యాంకింగ్స్‌ స్పష్టం చేశాయి. ఈ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ 6.9 స్కోరుతో నాలుగో స్థానంలో ఉన్నది. తమిళనాడు 7.4 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలవగా, గుజరాత్‌ 7.3 స్కోరుతో రెండో స్థానంలో, మహారాష్ట్ర 7.1 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఏపీని వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ముందువరుసలో నిలబెట్టిందని ఈ నివేదిక తెలిపింది. ఏది ఏమైనా సవాళ్ల ముంగిట సమర్థ ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్‌కు మహర్దశ పట్టనుంది. ఐటీ, ఇంజనీరింగ్, స్కిల్ డెవలప్‌మెంట్‌ తదితర రంగాల్లో విశాఖపట్నం అభివృద్ధి చెంది ఉత్తరాంధ్రలో మరో సైబరాబాద్ నిర్మాణం కాబోతున్నది.

-కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం,

పార్లమెంట్ సభ్యులు

Updated Date - Sep 02 , 2025 | 12:26 AM