Tragedy in Karur: కరూర్ పాపం ఎవరిది?
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:55 AM
నా హృదయం ముక్కలైంది, భరించలేని బాధ నిలువునా తోడేస్తోంది, ఇంతటి ఆవేదనని జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు....
‘నా హృదయం ముక్కలైంది, భరించలేని బాధ నిలువునా తోడేస్తోంది, ఇంతటి ఆవేదనని జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు..’ అంటూ తమిళ సినీనటుడు, టీవీకే పార్టీ అధినేత మంగళవారం నాటి వీడియో సందేశంలో తెగ వాపోయారు. ఉద్వేగాన్ని, బాధని బాగా దట్టించిన ఆ ప్రసంగంలో, ముఖ్యమంత్రి స్టాలిన్ మీద కూడా ఆయన విమర్శలు చేశారు. ప్రేమ పొంగిపొరలిన జనం తనను చూడటానికి వచ్చారని, సభ సురక్షితంగా చక్కగా జరిగి, ప్రజలు భద్రంగా ఉండాలని తాను కోరుకున్నానని, పోలీసుశాఖను అదే అభ్యర్థించానని, కానీ, కరూర్ ఘటనలో తమ తప్పు వీసమెత్తులేకున్నా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని అంటూ ఆ చర్యను ఆయన తప్పుబడుతున్నారు. ఒక్క కరూర్‌లోనే ఇలా ఎందుకు జరిగింది? అని ప్రశ్నించడం ద్వారా అధికారపక్షం కుట్రలే సామాన్యుల ప్రాణం పోవడానికి కారణమని చెప్పదల్చుకున్నారు. సీఎంగారూ, నాపై కక్ష తీర్చుకోవాలనుకుంటే నేరుగా నన్ను ఏదైనా చేయండి, అంతేకానీ, నా ప్రజల జోలికి వెళ్ళకండి అంటూ ప్రభుత్వ చర్యలను తప్పుబడుతున్నారు. తాను ఏ తప్పుచేయలేదనీ, తన రాజకీయ జీవితం మరింత ఉత్సాహంతో కొనసాగుతుందని కూడా ఆయన ప్రకటించాడు. ఇంతటి కష్టకాలంలో కూడా తన రాజ్యాధికార లక్ష్యాన్ని విస్మరించని విజయ్‌ను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.
ఆ దారుణం జరిగి మూడురోజులైనా రాజకీయం మరింత పండుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు, కుట్రసిద్ధాంతాలతో చెవులు చిల్లులుపడుతున్నాయి. మధ్యాహ్నం వస్తాడన్న విజయ్, అత్యంత ఆలస్యంగా, రాత్రి ఏడున్నరకు అక్కడకు చేరుకోవడం ఉద్దేశపూర్వకంగా జరిగిందంటున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో అసలు సమయాన్ని తప్పుగా ప్రచారం చేసి, జనం కిటకిటలాడేట్టు చేయాలన్న నిర్వాహకుల ఆలోచనే ఇంతమంది ప్రాణాలు తీసిందని వారి వాదన. అనుమతి తీసుకున్న పదివేలమంది కాదు, ఏకంగా పాతికవేలమంది జమగూడినా కూడా మరింత జనాన్ని పోగేయాలన్న తాపత్రయమే తప్ప, విజయ్‌పార్టీకి ప్రజల భద్రత పట్ల పట్టింపు లేకపోయిందన్నది ఎఫ్‌ఐఆర్ సారాంశం. బలప్రదర్శన లక్ష్యంతో విజయ్ తన కరూర్ రాకను జాప్యం చేయడంతో, దీని తరువాత కార్యక్రమం జరగాల్సినచోటనుంచి కూడా జనం ఇక్కడకు తరలివచ్చారని పోలీసులు అంటున్నారు. గూండాలు, పోలీసులు, అధికారపార్టీ కార్యకర్తలు కట్టకట్టుకొని కరూర్‌లో కుట్రలు పన్నారని టీవీకే హైకోర్టులో ఆరోపించింది. సభను భగ్నం చేయడానికి కొందరు చెప్పులూ రాళ్ళూ రువ్వారని, పోలీసులు లాఠీచార్జీ చేశారని, విద్యుత్ నిలిపివేశారనీ, అనేక పరిణామాలు కలగలిసి ఈ ఘటన సంభవించినందున సీబీఐ విచారణజరపాలని టీవీకే డిమాండ్ చేస్తోంది. సీఎం స్టాలిన్ కరూర్ చేరుకొనేలోగా శవపేటికలను సిద్ధం చేయాలన్న రాజకీయకుట్రలో భాగంగా శవపరీక్ష హడావుడిగా జరిపించారని కూడా టీవీకే ఆరోపిస్తోంది. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి విజయ్ పార్టీ అసత్యాలను వండివారుస్తోదని ప్రభుత్వం అంటోంది.
ఈ శవ రాజకీయాలను అటుంచితే, ఒక సినీ హీరోగా విజయ్‌కు ఉన్న ప్రజాదరణ కాదనలేనిది. ఆయన రాకకోసం అల్లాడిపోతున్న అభిమానులు ఎక్కడికక్కడ పెద్దసంఖ్యలో కూడుతూంటే, టీవీకే నాయకులు పోలీసుల నియమనిబంధనలను బేఖాతరు చేస్తూ, నియంత్రణలను ఉల్లంఘిస్తూ, వారిని అధికారపార్టీ విధేయులుగా ముద్రవేస్తున్నమాట నిజం. భారీ వాహనం లోపలినుంచి దానిపైకి వచ్చి, చేతులు ఊపి, నాలుగు రాజకీయ విమర్శలు చేయడం ఎంతో సులువైన పని. కానీ, తన కోసం గంటల తరబడి ఎండల్లో వానల్లో నిరీక్షిస్తున్న అభిమానుల భద్రత, సంక్షేమం గురించి ఆలోచించడం, పట్టించుకోవడం కష్టమైన పని. విజయ్ వచ్చిరావడంతోనే జనం ఒక్కసారిగా ఎగబడటం, మరోపక్క ఆయన వాహనానికి దారి కల్పించడంకోసం కిటకిటలాడుతున్న జనాన్ని వెనక్కునెట్టాల్సి రావడం వంటి గొలుసుకట్టు చర్యలు ఈ దుర్ఘటనకు దారితీసిన మాట వాస్తవం. రోడ్‌షోలను బలప్రదర్శనకు వాడుకోవడంతోనే ఇంతమంది బలైనారన్నది నిజం. విజయ్‌సభల్లోకి అధికారపక్షం ఖాళీ అంబులెన్స్‌లు తరలిస్తోందన్న ఆరోపణలతో సహా ఈ దురదృష్టకర సంఘటనపై నిష్పక్షపాతంగా లోతైన దర్యాప్తు జరగాలి. అధికారపక్షంమీద ఎదురుదాడి చేయడం విజయ్‌కు సులువేగానీ, తనమీద వచ్చిన ప్రతీ విమర్శకూ, తాను చేస్తున్న ప్రతివిమర్శకూ ఆధారసహితంగా ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆయన మీద ఉంది.