Vidurashwatham Martyrs: మరుగునపడ్డ మరో జలియన్‌వాలాబాగ్
ABN , Publish Date - Apr 25 , 2025 | 05:54 AM
కర్ణాటక-ఆంధ్ర సరిహద్దులోని విదురాశ్వత్థంలో జరిగిన అంబేద్కరుల దురంతం, జలియన్‌వాలాబాగ్ దురంతానికి అనుగుణంగా, కాంగ్రెస్ నేతల అరెస్టులతో భయంకరమైన ఘటనగా మారింది. ఈ సంఘటనలో అనేక అమరవీరులు తమ ప్రాణాలను అర్పించారు, మరియు ఈ కృషి స్మారక చిహ్నంగా నిలిచింది
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్‌వాలాబాగ్ దురంతానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. కానీ చరిత్రకెక్కని ఇలాంటి ఓ ఉదంతమే మన కర్ణాటక–ఆంధ్ర సరిహద్దుల్లోనూ జరిగింది. అప్పటి అనంతపురం, కోలారు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ‘విదురాశ్వత్థం’ అనే గ్రామ సమీపంలో 1938 ఏప్రిల్ 25న ఈ ఉదంతం జరిగింది. 1938 ఫిబ్రవరి 19–22 తేదీల్లో గుజరాత్ ప్రాంతం, సూరత్ జిల్లాలోని హరిపురాలో జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల తీర్మానాల కారణంగానే మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఏర్పాటైంది. అప్పట్లో మైసూర్ స్టేట్‌గా పిలువబడే ఈ కన్నడ ప్రాంతం కృష్ణరాజ ఒడియార్–4 అనే సంస్థానాధీశుడి పాలనలో ఉండేది. వీరు బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా ఉండేవారు. 1938 ఏప్రిల్ రెండో వారంలో మాండ్యా జిల్లా శివపురలో మైసూరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. ‘ధ్వజ సత్యాగ్రహ’ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాంతాల్లోనూ జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని నేతలు నిర్ణయించారు. 1938, ఏప్రిల్ 9న సిద్దలింగయ్య అనే నాయకుడు జాతీయ జెండాను ఎగురవేశారు. సిద్దలింగయ్యతో పాటు పలు చోట్ల జెండా ఎగురవేసిన చాలామంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. హిందూపురం నుంచి బెంగళూరుకు వెళ్లే మార్గంలో ఈ విదురాశ్వత్థం ఉంది. ఇక్కడ కూడా జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. ఆనాటి కార్యక్రమానికి నాగయ్యరెడ్డి, తిమ్మారెడ్డి, టి.రామాచారి నాయకత్వం వహించారు. ‘ధ్వజ సత్యాగ్రహ’ కార్యక్రమాన్ని గురించి తెలుసుకుని కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని బ్రిటిష్ అధికారులు నిర్ణయించారు. 1938, ఏప్రిల్ 18 నుంచే ఈ ముందస్తు అరెస్టులు ప్రారంభమయ్యాయి.
పోలీసుల చర్యలతో ఏప్రిల్ 22, 24 తేదీల్లో జెండాల ఎగురవేతను వాయిదా వేసినా, ఏప్రిల్ 25 నుంచి యథావిధిగా ఆ కార్యక్రమం కొనసాగింది. జెండాలను ఎగురవేసిన కల్లూరు సుబ్బారావు, నారాయణస్వామి, శ్రీనివాసరావు, సూరన్నలను పోలీసులు అరెస్టు చేశారు. విదురాశ్వత్థం ఆలయ ఉత్సవాల్లో భాగంగా రథోత్సవంతో పాటు పశువుల సంత జరుగుతుండడంతో అప్పటికే వందలాదిగా జనాలు అక్కడ ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టుతో జనం ఉద్వేగం చెంది, పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. నాటి డిప్యూటీ డీఎస్పీ ఏ.ఎస్ ఖల్లి నేతృత్వంలో మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి ఐదున్నర గంటల వరకూ జనాలపై లాఠీచార్జి చేయడంతో పాటు, 96 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దురంతంలో సుమారు వందమంది చనిపోయి ఉంటారని అంచనా. కానీ కేవలం పదిమందిలోపే మరణించి ఉంటారని నాటి ఆ ప్రాంత సంస్థానాధీశుడు కృష్ణరాజ ఒడియార్ ప్రకటించారు. చనిపోయిన వారిలో ఇడుగురు భీమయ్య, చౌళూరు నరసప్ప, గజ్జన్నగారి నరసప్ప, హనుమంతప్ప, రాయకొండనహల్లి మల్లయ్య, నామా అశ్వత్థనారాయణ శెట్టి, నరసప్ప, మరులూరు గౌరమ్మ వంటి వారున్నారు. వారిలో గౌరమ్మ తొమ్మిది నెలల గర్భవతి! ఈ ప్రాంతానికి దగ్గర్లోని తెలుగు ప్రాంతమైన చౌళూరు నుంచి సూలగిత్తి సంజీవప్ప, సూలగిత్తి నరసప్ప, కారేడుపల్లి నాగమల్లారెడ్డి, కురుబ మల్లేశప్ప వంటి వారు ఈ కాల్పుల్లో నేలకొరిగారు. ఈ అమరవీరుల స్మారకంగా 1947 ఆగస్టు 15న చౌళూరు గ్రామ ప్రజలు స్మారక చిహ్నం నిర్మించుకున్నారు. నేటికీ ఈ స్మారక చిహ్నాలు చౌళూరు గ్రామంలో పదిలంగా ఉండటమే కాదు, స్ఫూర్తిని వెదజల్లుతున్నాయి.
2009లో ఆ అమరవీరుల వివరాలతో స్మారక మందిరమైన ‘వీరసౌధ’నూ గ్రామస్తులు నిర్మించుకున్నారు. ఈ ఘటనలో ప్రాణాలర్పించిన వారి గురించి నాడు జాతీయ స్థాయిలో సంచలనమయ్యింది. ఈ ఘటనపై నివేదిక రూపొందించాలని సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆచార్య జే.బీ కృపలానీలను గాంధీజీ కోరారు. మైసూర్ సంస్థానానికి, సర్ మీర్జా ఇస్మాయిల్ దివాన్‌కు గాంధీజీ ఈ ఘటన గురించి ఉత్తరం రాశారు. తత్ఫలితంగా 1939 మేలో సర్దార్ పటేల్, సర్ మీర్జా ఇస్మాయిల్ మధ్య ఒక ఒడంబడిక జరిగింది. దాన్ని ‘పటేల్– మీర్జా పాక్ట్’ అంటారు. దీని ప్రకారం జెండా ఎగురవేయడంపై నిషేధాన్ని ఎత్తివేశారు. అలాగే వారి సంస్థానంలో కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్వహణలో సంస్కరణలను ప్రతిపాదిస్తూ ఏర్పాటు చేసిన కమిటీలో ఏడుగురు కాంగ్రెస్ పార్టీ సభ్యులు అంతర్భాగమయ్యారు. మహాత్మాగాంధీ 1939లో చిక్కబల్లాపూర్ సమీపంలోని నందికొండలలో విడిది చేసినప్పుడు ఈ విదురాశ్వత్థ ఘటన గురించి ప్రత్యేకంగా చర్చించారు. అలాగే 1939లో మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ రెండో సమావేశం విదురాశ్వత్థంలోనే జరగడం విశేషం. నిజానికి ఈ ఘటన గురించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేదు. జనబాహుళ్యంలోకి రాకపోవడంతో ఇది మరుగున పడిపోయింది. కానీ స్థానికులు మాత్రం మృతి చెందినవారి జ్ఞాపకార్థం 1973 సంవత్సరంలో స్థానికంగా ఓ స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ దురంతానికి సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడానికి గౌరీబిదనూరు నేషనల్ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేసిన బి. గంగాధరమూర్తి కృషి ఎంతో ఉంది. వీరే తొలిసారి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి, 2011 డిసెంబర్‌లో ‘కర్ణాటకద జలియన్ వాలాబాగ్ విదురాశ్వత్థ’ పేరుతో ఓ పుస్తకాన్ని వెలువరించారు. ఈ రచన కన్నడ, ఇంగ్లీషు భాషల్లో ప్రచురితమైంది.
డా. నాగసూరి వేణుగోపాల్