Share News

Air Pollution Reduction: విద్యుత్‌ వాహనాలకు కొత్త విధానం

ABN , Publish Date - May 30 , 2025 | 05:50 AM

నగరాల్లో వాహనాల విద్యుదీకరణ వల్ల వాయు కాలుష్యం తగ్గించి, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఈవీ వాహనాలు పరిసరాలపై ప్రభావాన్ని తగ్గించే జీరో ఎమిషన్ సాంకేతికతను ప్రోత్సహిస్తూ ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచాలి.

 Air Pollution Reduction: విద్యుత్‌ వాహనాలకు కొత్త విధానం

న్ని దేశాలు తమ సమస్త వాహనాలను విద్యుద్దీకరించవలసిన అవసరమున్నది. ఇందుకు మూడు కీలక కారణాలు ఉన్నాయి. అవి: మొదటిది– వాతావరణ మార్పు. రవాణా రంగం చమురు– పెట్రోల్‌, డీజిల్‌ – ను భారీ పరిమాణంలో వినియోగించుకుంటున్నది. ప్రపంచ వ్యాప్తంగా వార్షిక కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలలో రవాణా రంగం వాటా ఇంచుమించు 15 శాతంగా ఉన్నది. చమురుకు ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ను వినియోగించుకునే జీరో–ఎమిషన్‌ వెహికల్స్‌ లేదా విద్యుత్‌ వాహనా(ఈవీ)లను కాలుష్యకారక ఉద్గారాల సమస్యకు పరిష్కారంగా పరిగణిస్తున్నారు; రెండు– స్థానిక కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల స్థానంలో జీరో–ఎమిషన్‌ వాహనాలను వినియోగించుకోవాలి. ఇది మన నగరాలను కాలుష్యరహితంగా ఉంచేందుకు చాలా ముఖ్యం; మూడు– వాహనాల విద్యుద్దీకరణ వల్ల చమురు వినియోగం తగ్గిపోయి విలువైన విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఈ మూడు కారణాలు సుసంగతమైనవే. అయితే ఇవి మాత్రమే ఆవశ్యక మార్పుకు దోహదం చేయలేవు. విద్యుత్‌ వాహనాల విషయంలో మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేదాన్ని సమీక్షించుకోవాలి. తద్వారా వాహన విద్యుద్దీకరణ ఎజెండాను పటిష్ఠంగా అమలుపరచుకోవడమే కాకుండా తక్షణమే అవసరమైన ప్రయోజనాలను పొందగలుగుతాం. నగరాలలో వాహనాల విద్యుద్దీకరణ వల్ల పలు ప్రయోజనాలు సంయుక్తంగా సమకూరుతాయి. వాయు కాలుష్యం తగ్గుతుంది, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది; హరిత గృహ వాయు ఉద్గారాల నివారణతో విశేష లబ్ధి చేకూరుతుంది. 2030 సంవత్సరం నాటికి దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో 2019లో నీతి ఆయోగ్‌ అంచనా వేసింది: ఈవీల విక్రయాలు కొత్త వాణిజ్యకారుల అమ్మకాలలో 70 శాతం; ప్రైవేట్‌ కారులలో 30 శాతం, బస్సుల అమ్మకాలలో 40 శాతం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాలలో 80 శాతం మేరకు ఉండాలి.


2025 సంవత్సర నడిమికాలానికి మనం ఆ లక్ష్య పరిపూర్తికి చాలా దూరంలోనే ఉండిపోయాం. ఒక్క త్రిచక్ర వాహనాల విషయంలో మాత్రమే పురోగతి కనిపిస్తోంది. మనం శ్వాసిస్తున్న విషవాయువులకు కారణం పెద్ద వాహనాలు అన్న వాస్తవాన్ని విస్మరించలేం. ఏ ఏ రకం వాహనాలు– బస్సులు, లారీలు, కార్లు మొదలైనవి ఏ స్థాయిలో వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయనే విషయాన్ని అటుంచి, రోడ్లపై ఆయా వాహనాల సంఖ్య లెక్కకు మిక్కుటంగా ఉండడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయి వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ దృష్ట్యా వాయు కాలుష్య నియంత్రణ విధిగా కాలుష్యకారకం కాని వాహనాల వినియోగం పెరుగుదలకు, రోడ్లపై మొత్తంగా వాహనాల సంఖ్య తగ్గుదలకు దోహదం చేయాలి. ఈ శతాబ్ది తొలినాళ్లలో ఢిల్లీలో కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)తో నడిచే వాహనాలను వినియోగించడం ప్రారంభమయింది. ఏ నగరంలో అయినా బస్సులు, టాక్సీలు, ఆటో రిక్షాలు ప్రయాణం చేసిన దూరం అధికంగా ఉండడం కద్దు. ఇది ఢిల్లీలో మరీ ఎక్కువగా ఉంటుంది. వాహనాలు ప్రయాణం చేసిన దూరం ఎంత ఎక్కువగా ఉంటుందో వాటి నుంచి ఉద్గారాలు కూడా అంత అధికంగా ఉంటాయని నిపుణులు నిర్ధారించారు. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ కథ సవ్యంగా సాగలేదు. సీఎన్‌జీ వాహనాలను ప్రవేశపెట్టిన రెండు దశాబ్దాల తరువాత కూడా రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించేందుకు వీలుగా ప్రజా రవాణా వ్యవస్థను తగిన విధంగా మెరుగుపరచలేదు. దేశ రాజధాని నగరంలో ప్రతిరోజూ దాదాపు 1800 కొత్త వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వీటిలో ప్రైవేట్‌ వాహనాలు 500కు పైగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 10,000కు పైగా కొత్త ప్రైవేట్‌ కార్లు రోడ్ల మీదకు వస్తున్నాయి. ఆసేతు హిమాచలం రహదారులపై నానా రకాల వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కొత్త ఫ్లైఓవర్లు, సరికొత్త రోడ్లు ఎన్ని నిర్మించినా వాహనాల రాకపోకలకు తరచు అంతరాయమేర్పడుతూనే ఉంది. ప్రజలు ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుంటున్నారు.


వాహనాల గమన వేగం తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల పర్యవసానాలను సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌లోని నా సహచరులు సమగ్రంగా అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా రెండు ప్రదేశాల మధ్య ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందో వివరణాత్మక రికార్డు నందించే ‘గంటవారీ ప్రయాణ సమయ డేటా’ (Hourly travel time data)ను విశ్లేషించారు. ఢిల్లీలో, వాహనాల సగటు వేగం రోడ్లపై వాహనాల రద్దీ ఉదయం పూట అత్యంత రద్దీగా ఉన్న వేళల్లో వాహనాల సగటు వేగం 41 శాతం తగ్గిపోతుందని, సాయంత్రం పూట రద్ద్దీ తీవ్రంగా ఉన్న సమయంలో 56 శాతం తగ్గుతుందని వెల్లడయింది. నగరాలలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ) కాలుష్యకారక వాయువులను ఉద్గారించని వాహనాల సంఖ్య పెరుగుదలకు, రోడ్లపై రాకపోకలు సాగించే మొత్తం వాహనాల సంఖ్య తగ్గుదలకు తోడ్పడాలి. కొత్త విద్యుత్‌ వాహనాల సంఖ్యను పెంచడమే కాదు, ట్రాఫిక్‌లో వాటి మోడల్‌ వాటా (ఇతర రకాల వాహనాలతో పోలిస్తే ఈవీలు అయిన వాహనాల నిష్పత్తిని సూచిస్తుంది) ఇతోధికంగా పెరగవలసి ఉన్నది. ఇందుకు అనుగుణంగా నగరాలలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే మనం నిర్మలమైన గాలిని శ్వాసించగలుగుతాం. దైనందిన రాకపోకలపై సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోగలుగుతాం. ఆఖరుగా అసలు ప్రశ్న : భారత్‌లో గానీ, మిగతా ప్రపంచ దేశాలలో గానీ ప్రైవేట్‌ విద్యుత్‌ వాహనాల అవసరం నిజంగా ఉన్నదా?

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌,

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - May 30 , 2025 | 05:53 AM