Share News

Vande Mataram Debate: చరిత్రను విస్మరించిన వందేమాతరం వివాదం!

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:00 AM

భారత స్వాతంత్ర్యోద్యమ చారిత్రక చిహ్నమైన బంకించంద్ర ఛటర్జీ ‘వందేమాతరం’ గీతం విరచితమై 150 సంవత్సరాలైన సందర్భంగా కొనసాగుతున్న వివాదం నిరర్థకమైనది. చరిత్రను విస్మరించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. 1937లో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్‌ విజయం సాధించి వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాల నేర్పాటు చేసింది....

Vande Mataram Debate: చరిత్రను విస్మరించిన వందేమాతరం వివాదం!

భారత స్వాతంత్ర్యోద్యమ చారిత్రక చిహ్నమైన బంకించంద్ర ఛటర్జీ ‘వందేమాతరం’ గీతం విరచితమై 150 సంవత్సరాలైన సందర్భంగా కొనసాగుతున్న వివాదం నిరర్థకమైనది. చరిత్రను విస్మరించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. 1937లో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్‌ విజయం సాధించి వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాల నేర్పాటు చేసింది. అయితే బెంగాల్‌లో ముస్లిం లీగ్‌ నాయకుడు ఎ.కె.ఫజ్లుల్‌ హక్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంలో చేర్చుకునేందుకు ఫజ్లుల్‌ హక్‌ సుముఖత చూపినా అందుకు కాంగ్రెస్‌ అంగీకరించలేదు. కాంగ్రేసేతర ప్రభుత్వం నెలకొనడంతో బెంగాల్‌లో హిందూ–ముస్లిం వర్గాల మధ్య రాజకీయంగానూ, సామాజికంగానూ విభేదాలు తీవ్రమయ్యాయి. జాతిని దైవిక మాతృమూర్తిగా వ్యక్తీకరించిన వందేమాతరం గీతంలోని హిందూ ప్రతీకవాదం, దుర్గామాత ప్రస్తుతికి వ్యతిరేకంగా ముస్లిం నాయకులు ఆందోళన చేస్తున్న రోజులవి. వందేమాతరంను జాతీయగీతంగా స్వీకరించకూడదనేది ముస్లింల డిమాండ్‌. దేశవ్యాప్తంగా మత సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశమున్నందున ఈ వివాదంలో జోక్యం చేసుకోవడం జాతీయ కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వానికి అనివార్యమయింది.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను సంప్రదించింది. వందేమాతరం గీతంలోని మొదటి రెండు చరణాలను జాతీయగీతంగా ఆలపించవచ్చని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్‌ విశ్వసించే అహింసా సిద్ధాంతం, లౌకికవాద విలువలకు వందేమాతరం గీతం పూర్తిగా విరుద్ధమైనందున National Anthemగా స్వీకరించేందుకు అది యోగ్యమైనది కాదని కృష్ణ కృపలానీ (రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, ఠాగూర్‌ స్వంత మనుమడు) అక్టోబర్‌ 1937 ‘విశ్వభారతి న్యూస్‌’లో రాసిన ఒక వ్యాసంలో వాదించారు. 1896లోనే వందేమాతరం గీతానికి స్వరరచన చేసిన రవీంద్రుడు తన 70వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆ గీతంపై ఆలోచనాత్మక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ‘వందేమాతరం’ బదులుగా ‘Vande Vratanam’ (వందే వ్రతనం) ను పాటించాలని అంటే మాతృభూమికి, మానవాళికి సేవ చేసే ‘ప్రతిజ్ఞ’కు నిబద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వందేమాతరంలో దుర్గామాతను స్తుతించే శ్లోకాలు ఉన్నందున ముస్లింలు ఆ గీతాన్ని జాతీయగీతంగా అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో ఆ గీతం ఒక విడదీయరాని భాగంగా ఉన్నందున వందేమాతరం National Anthem అయ్యేందుకు అర్హమైనది అని సదాచార హిందువులు, ముఖ్యంగా స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నవారు విశ్వసించారు. బంకించంద్ర గేయంపై తన అభిప్రాయం చెప్పాలని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌‌ను సుభాష్‌ చంద్రబోస్‌ వ్యక్తిగతంగా కోరారు. ‘సాహిత్య రచన అయిన ‘ఆనందమఠ్‌’ నవలలో వందే మాతరం ఉండడం సముచితమేనని, అయితే దానిని జాతీయగీతంగా స్వీకరించడం సరికాదని రవీంద్రుడు స్పష్టం చేశారు. ‘‘వందేమాతరంలోని ప్రధానభాగం దుర్గామాతను ప్రస్తుతించే స్తోత్రాలు.


ఈ విషయమై ఎటువంటి చర్చ అవసరం లేదు. బంకించంద్ర ఛటర్జీ ఆ గీతంలో మాతృభూమిని ఒక హిందూ దేవతగా ఆరాధించాడు. ఎంత దేశభక్తుడయిన ముస్లిం కూడా మాతృభూమిని ఒక హిందూదేవతగా ఆరాధిస్తాడని భావించలేము. ఈ ఏడాది దుర్గాపూజ సందర్భంగా పలు పత్రికల ప్రత్యేక సంచికలు వందేమాతరం చరణాలను ఉటంకించాయి. ఆ గీతాన్ని దుర్గామాత స్తుతిస్తోత్రంగా సదరు పత్రికల సంపాదకులు భావిస్తున్నారనేందుకు అదే నిదర్శనం. ‘ఆనందమఠ్‌’ సాహిత్య రచన గనుక అందులో వందేమాతరం గీతం ఉండడం సముచితమే అయినప్పటికీ సకల మతాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు లాంటి ప్రదేశంలో దాన్ని ఆలాపించడం సరికాదు. అందుకు సర్వజనామోదం ఉండదు’ అని సుభాష్‌ బోస్‌కు రాసిన లేఖలో ఠాగూర్‌ పేర్కొన్నారు. సుభాష్‌ బోస్‌ ఈ వివాదంపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వందే మాతరంపై ఆయన మౌనం ఆ గీతం మద్దతుదారులను నిరాశపరిచింది.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 1937లో కలకత్తాలో సమావేశమయింది. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆచార్య జేబీ కృపలానీ మొదలైన వారందరూ ఆ సమావేశంలో పాల్గొన్నారు. వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే కాంగ్రెస్‌ సమావేశాలలో ఆలాపించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఆ గీతంపై ముస్లిం దృక్కోణాన్ని కాంగ్రెస్ అంగీకరించిదని ఆ నిర్ణయం స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌ నిర్ణయం బెంగాల్‌ హిందువులకు ఆశాభంగం కలిగించిందని శరత్‌ బోస్ (సుభాష్‌ అన్నయ్య) అన్నారు. మహారాష్ట్రలో సైతం కాంగ్రెస్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. National Anthemను ఎంపిక చేసేందుకు మౌలానా ఆజాద్‌, నెహ్రూ, సుభాష్‌, ఆచార్య నరేంద్రదేవ్‌లతో కాంగ్రెస్‌ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఆ కమిటీకి సలహాదారుడు. సుభాష్‌ బోస్‌కు రవీంద్రుడు రాసిన ఒక వ్యక్తిగత లేఖలో వ్యక్తం చేసిన భావాలను ఉటంకిస్తూ జాతీయగీతంపై ఆయన ఇచ్చిన సలహాపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఒక ప్రకటనను విడుదల చేసింది. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని జాతీయవాద పత్రికలు విమర్శించాయి. అయితే సుభాస్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ‍కాంగ్రెస్‌ నుంచి వెలివేత తరువాత కూడా సుభాష్‌ బోస్‌ తన తొలి వైఖరికే నిబద్ధమయ్యారు. కాంగ్రెస్‌ జాతీయ సంస్థ అని, అన్ని మతాల వారి మనోభావాలను అది గౌరవించవలసి ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. 1938లో బంకించంద్ర ఛటర్జీ శత జయంత్యుత్సవాల సందర్భంగా వందేమాతరం వివాదాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ గీతం మొత్తాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలనే డిమాండ్‌ గట్టిగా వచ్చింది. అయితే సుభాష్‌ బోస్‌ ఈ డిమాండ్‌కు మద్దతునివ్వలేదు. కాంగ్రెస్‌ నిర్ణయమే ప్రభావశీలంగా ఉండిపోయింది.


జన గణ మన గీతం భారతజాతిని సమ్మిళిత దృక్పథంతో దర్శించింది; ఆసేతు హిమాచలం వర్ధిల్లుతోన్న భౌగోళిక (ప్రాంతాలు, పర్వతాలు, నదులు) బహుళత్వాన్ని సూచిస్తుంది; బహుళ మత సంప్రదాయాలు, సంస్కృతుల మహత్వాన్ని వ్యక్తం చేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ జాతీయ సమైక్యతా భావాన్ని ప్రోత్సహించే సామర్థ్యమున్నందునే రవీంద్రుని విరచితమైన ‘జన గణ మన’ను ‘నేషనల్‌ ఏంథెమ్‌’గా కాంగ్రెస్‌ ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని మౌలానా ఆజాద్‌, ఇతర జాతీయవాద ముస్లింలు బలపరిచారు. బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ‘జన గణ మన’ గీతాల్లో దేన్ని నేషనల్‌ ఏంథెమ్‌గా స్వీకరించాలనే వివాదం హిందువులు, ముస్లింలకూ సంతృప్తికరంగా, సుహృద్భావంతో పరిష్కృతమయింది. దుర్గామాత ప్రస్తావన లేని, వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను సమస్త భారతదేశానికి సమ్మతమైన ‘నేషనల్‌ సాంగ్‌’ రూపంలో అంగీకరించారు. కవిగా, దార్శనికుడుగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు ఉన్న మహోన్నత గౌరవ ప్రతిష్ఠలు, ఆయన తార్కిక, నిష్పాక్షిక వైఖరి అందుకు విశేషంగా దోహదం చేశాయి. సుభాష్‌ బోస్‌ ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ (భారత జాతీయ సైన్యం) ఈ రెండింటినీ అదే హోదాలో స్వీకరించింది.

1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ‘National Anthem’ అవసరాన్ని గుర్తించారు. ఐక్యరాజ్యసమితిలో ‘జన గణ మన’ను భారతదేశ జాతీయగీతంగా ఆలాపించారు. 1948 ఆగస్టు 25న పార్లమెంటులో నెహ్రూ ఇలా అన్నారు: ‘వందేమాతరం, జన గణ మన గీతాలలో దేనిని జాతీయగీతంగా స్వీకరించాలనే విషయమై అనవసర వాద ప్రతివాదాలు జరుగుతుండడం దురదృష్టకర విషయం. వందేమాతరం నిస్సందేహంగా భారతదేశ ఉత్కృష్ట చారిత్రక సంప్రదాయ గీతం. స్వాతంత్ర్యోద్యమచరిత్రలో వందేమాతర గీతానికి ఉన్న స్థానం దేనికీ లేదు. దాని చారిత్రక ప్రాధాన్యాన్ని ఎవరూ త్రోసిపుచ్చలేరు. వలసపాలనకు వ్యతిరేకంగా భారత ప్రజలను ఏకం చేయడంలో అది నిర్వర్తించిన పాత్ర అనుపమేయమైనది. అయితే స్వాతంత్ర్య పోరాట పరాకాష్ఠ అయిన స్వతంత్ర భారతదేశ ఆవిర్భావాన్ని, జాతి నిర్మాణంలో తదుపరి దశను ఆ గీతం సూచించదు’. రాజ్యాంగసభలో ‘జన గణ మన’ను ‘National Anthem’గా నెహ్రూ ప్రకటించడాన్ని అందరూ హర్షామోదాలతో స్వాగతించారు. జన గణ మన గీత చరణాలలోని సమున్నత భావాలను, ఆ గీత స్వరరచనను ప్రశంసిస్తూ, దాన్ని నేషనల్‌ యాంథెమ్‌గా స్వీకరించినందుకు అభినందిస్తూ భారత ప్రభుత్వానికి సందేశాలు అందాయి. తాము విన్న చాలా జాతీయ గీతాల కంటే జన గణ మన సాహిత్యం, సంగీతం ఉత్కృష్టంగా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు. రాజ్యాంగ సభ 1950 జనవరి 24న నేషనల్‌ ఏంథెమ్‌గా జన గణ మనను అధికారికంగా స్వీకరించింది. ఆ సందర్భంగా రాజ్యాంగసభ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ ఇలా వ్యాఖ్యానించారు: ‘జన గణ మన’గా సుప్రసిద్ధమైన సాహిత్య చరణాలు, స్వరరచన భారతదేశ ‘National Anthem’. భవిష్యత్తులో సందర్భం వచ్చినప్పుడు దానిలో మార్పులు చేసే అధికారం భారతప్రభుత్వానికి ఉన్నది. భారత స్వాతంత్ర్య సమరంలో చరిత్రాత్మక పాత్ర వహించిన బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గీతానికి కూడా జన గణ మనతో సమానహోదా ఉంటుంది’. రాజేన్‌ బాబు ఇంకా ఇలా విశదీకరించారు: ‘జన గణ మనకు National Anthemగా రాజ్యాంగ అనుమతి లేదు. ఆ గీతాన్ని అలా గౌరవించడం భారత ప్రజల సమ్మతి ఉన్న ఒక సంప్రదాయం’. ఆ పరిపాటిని భారతదేశం పరిపూర్ణంగా అనుసరిస్తోంది.

-సుబ్రత ముఖర్జీ

ఢిల్లీ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు

Updated Date - Dec 02 , 2025 | 04:00 AM