Share News

Vacant Teaching Posts in Universities: వర్సిటీల్లో ఆచార్యుల నియామకాలు జరిగేనా

ABN , Publish Date - Sep 03 , 2025 | 05:39 AM

విద్యార్థులు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత అధికార పార్టీ అధ్యాపకుల నియామకంపై ఇదిగో...

Vacant Teaching Posts in Universities: వర్సిటీల్లో ఆచార్యుల నియామకాలు జరిగేనా

విద్యార్థులు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత అధికార పార్టీ అధ్యాపకుల నియామకంపై ఇదిగో, అదిగో అనుడే తప్ప రెండేళ్లు గడిచినా స్పష్టమైన ప్రకటన చేయలేకపోయింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన యూజీసీ నిబంధనలను కాదని కొత్త నిబంధనల పేరుతో కాలయాపన చేస్తూ వస్తోంది. నిబంధనలు ఏవైనా... అధ్యాపకుల నియామకాలు జరగకపోతే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వెంటిలేటర్ పైకి వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలలో 2,828 పోస్టులు ఉండగా, వాటిలో 1,869 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓయూలో–845, కేయూలో–298, జేఎన్టీయూలో– 232, ఆర్జీయూకెటీ–128, మహాత్మాగాంధీ–35, పాలమూరు–73, తెలంగాణ–73, శాతవాహన–45, బీఆర్ అంబేడ్కర్–48, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్–31, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో–61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 78 శాతం అధ్యాపకులు లేకుండానే విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి. సత్వరమే నిర్దిష్టమైన క్యాలెండర్‌ను ప్రకటించి ఆచార్యుల నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 200, 100 ఖాళీలంటూ తప్పుడు లెక్కలతో కాకుండా, వాస్తవంగా ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలి. అప్పుడే ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయి. మిగతా విశ్వవిద్యాలయాలు తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటాయి. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకాలతో పాటు కనీస మౌలిక వసతుల కల్పనపైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నిర్మించిన వసతి గృహలు, భోజనశాలల స్థానంలో కొత్తవి నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతికత ప్రపంచాన్నే శాసిస్తున్న ప్రస్తుత ప్రపంచంలో పరిశోధనలకు గాను అవసరమైన లాబోరేటరీలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కనీసం వెయ్యి కోట్ల నిధులను కేటాయించాలి. అప్పడే తెలంగాణ సమాజం, విద్యార్థి లోకం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశంసిస్తుంది.

– జీవన్ ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు

Updated Date - Sep 03 , 2025 | 05:40 AM