Judicial System: న్యాయాన్ని మేల్కొల్పిన జన చైతన్యం
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:39 AM
కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో కనిపిస్తున్న వాతావరణం ఏమంత ఆహ్లాదకరంగా లేదు. కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి కానీ ఆ జబ్బులకు, కాలుష్యానికీ ప్రత్యక్ష సంబంధం..
కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో కనిపిస్తున్న వాతావరణం ఏమంత ఆహ్లాదకరంగా లేదు. కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి కానీ ఆ జబ్బులకు, కాలుష్యానికీ ప్రత్యక్ష సంబంధం లేదని ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించారు. మరి రోజురోజుకూ క్షీణిస్తున్న వాతావరణ కాలుష్యానికి జవాబుదారీ ఎవరు? తీవ్ర చలిగాడ్పులను సైతం లెక్కచేయకుండా జంతర్ మంతర్, ఇండియాగేట్ వద్ద ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడం అంతకంతకూ పెరుగుతోంది. తొలుత– పెరిగిన స్కూలు ఫీజులపై ప్రజలు నిరసన తెలిపారు. ఆ తర్వాత, శునకాలను వీధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ రోడ్లకెక్కారు. పెరిగిపోతున్న కాలుష్యంపై కూడా ఆందోళనలు తీవ్రమయ్యాయి. జీతాలు, సౌకర్యాల కోసం మునిసిపల్ కార్మికులు 33 రోజుల పాటు సమ్మె చేశారు. బంగ్లాదేశ్‌లో దీప్ చంద్రదాస్ అనే హిందూ కార్మికుడిని చిత్రవధ చేసి చంపినందుకు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆరావళి పర్వత ప్రాంతాల నిర్వచనాన్ని– వందమీటర్ల ఎత్తుకు కుదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందుకు ఢిల్లీతో సహా ఉత్తర భారతమంతటా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. వీటన్నిటికీ మించి ‘ఉన్నావ్ అత్యాచార కేసు’లో శిక్షపడ్డ బీజేపీ నేత కుల్దీప్‌సింగ్ సెంగార్‌ను విడుదల చేసినందుకు యువతీ యువకులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. 2014 ఎన్నికలకు ముందు దేశ రాజధానిలో ఇటువంటి నిరసన వాతావరణమే కనపడేది. 2024 ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వాతావరణం కనిపిస్తోంది!
మన దేశంలో ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగాలు, న్యాయవ్యవస్థలు పనిచేస్తున్న తీరును అధ్యయనం చేసేందుకు ఉన్నావ్ అత్యాచార కేసు తోడ్పడుతుంది. యూపీలోని ఉన్నావ్ జిల్లాలో మఖీ గ్రామానికి చెందిన ఒక యువతి 2017 జూన్‌లో తనపై అప్పటి ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగార్, ఆయన అనుయాయులు సామూహిక అత్యాచారం చేశారని తొలుత స్థానిక పోలీసులకు, తర్వాత లక్నో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు అరణ్య రోదనే అయింది. పోలీసులు, అధికారులు, గూండాలు బెదిరిస్తున్నా వినకుండా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది. సీఎం కార్యాలయం ఆ ఫిర్యాదును మళ్లీ స్థానిక అధికారులకే పంపింది. ఘటన జరిగిన ఎన్నో నెలలకు పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా, అందులో ఎమ్మెల్యే పేరు చేర్చలేదు. బాధితురాలి తండ్రిని పోలీసులు కస్టడీలో కొట్టి చంపారు. బాధితురాలు కోర్టుకు వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీ కొట్టింది. ఘటనలో బాధితురాలు ప్రాణాలతో బయటపడగా, ఆమె పిన్ని మరణించారు. క్రింది కోర్టులో, హై కోర్టులో, సుప్రీంకోర్టులో ఆ యువతి న్యాయపోరాటం చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ఆత్మాహుతికి ప్రయత్నించింది. ప్రజల ఆందోళన ఫలితంగా ఈ కేసును సీబీఐకి నివేదించడం అనివార్యమయింది. సుప్రీంకోర్టు ఈ కేసును యూపీ నుంచి తప్పించి ఢిల్లీకి మార్చిన తర్వాతే కేసు ముందుకు కదిలింది. కుల్దీప్‌సింగ్‌కు శిక్షపడింది. జైలులో మగ్గుతున్న కుల్దీప్‌సింగ్‌ను ఆ తర్వాత కూడా ఏదోరకంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఢిల్లీ హై కోర్టులో ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులతో సహా 20 మంది న్యాయవాదులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే Public Servent కాదని, అందువల్ల ఆయనకు పోక్సో చట్టం వర్తించదనే కారణంతో కుల్దీప్‌సింగ్‌కు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం గతవారం బెయిల్ ఇచ్చింది.
దేశ రాజకీయాల్లో కుల్దీప్‌సింగ్ సెంగార్ లాంటి వారే అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. గ్రామప్రధాన్ నుంచి ఎదుగుతూ ఆరుసార్లకు పైగా ఎమ్మెల్యే అయిన సెంగార్‌కు సిద్ధాంతాలు అంటూ ఏమీ లేవు. తొలుత యువజన కాంగ్రెస్‌లో ఉన్నాడు. పార్టీ ఏఐసీసీ సభ్యత్వం ఇవ్వలేదన్న కోపంతో బీఎస్పీలో చేరాడు. తర్వాత ఎస్పీకి మారాడు. చివరకు బీజేపీ ఆయనను అక్కున చేర్చుకుని టికెట్ ఇచ్చింది. ఉన్నావ్‌లో మైనింగ్ మాఫియాతో పాటు అనేక అక్రమాలకు పాల్పడే సెంగార్, ఆయన బంధువులు, అనుయాయులను కాదనే ధైర్యం ఏ పార్టీకీ లేదు. ఉన్నావ్ లోక్‌సభ నుంచి ఎవరు గెలవాలన్నా సెంగార్ మద్దతు తప్పనిసరి మరి.
‘‘నా కుటుంబాన్ని మొత్తం తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన భద్రతను తొలగించారు. మళ్లీ మేము వీధుల్లోకి న్యాయం కోసం రావాల్సి వచ్చింది’’ అని హై కోర్టు తీర్పు తర్వాత బాధితురాలి తల్లి మీడియాకు రోదిస్తూ చెప్పారు. ఆమెను, ఆమె కుమార్తెను నిరసనకారులతో పాటు పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టారు. బాధితురాలు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీకి మొరపెట్టుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాను కలుసుకునే ప్రయత్నం చేశారు. దేశ రాజధానిలో మహిళా, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనితో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏమి ఆలోచించారో కానీ– రాత్రికి రాత్రే, సెలవుల్లో ఉన్న సుప్రీంకోర్టు తలుపును సీబీఐ తట్టింది. హై కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
‘ఒక ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకి రానందువల్ల అతడికి పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) వర్తించదు. అతను ఇప్పటికే ఏడు సంవత్సరాల 5 నెలల పాటు జైల్లో ఉన్నాడు. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డందుకు కఠినమైన శిక్షలు విధించే–2019లో తెచ్చిన పోక్సో చట్టానికి సవరణ చేయకముందే, సెంగార్ ఈ నేరానికి పాల్పడినందువల్ల కొత్త చట్టం ఆయనకు వర్తించదు. అంతేకాక, ఇది ఆర్టికల్ 21 ప్రకారం ఆయన జీవించే హక్కును భంగపరుస్తుంది’ అని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ‘పోక్సో చట్టంలో లేనంత మాత్రాన ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ కాకుండా పోతాడా? లైంగిక నేరాలకు పాల్పడ్డ ఒక పోలీసు కానిస్టేబుల్ లేదా పట్వారీని జీవితాంతం జైల్లో ఉంచగలిగినప్పుడు ఎమ్మెల్యేను ఎందుకు విడుదల చేయాలి?’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఆధిపత్యం చెలాయించగలిగిన, శక్తిమంతులైన వారు అత్యాచారానికి పాల్పడితే పోక్సో చట్టం పరిధిలోకి వస్తారని, ఒక 16 సంవత్సరాల లోపు అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డ సెంగార్ ఆ సమయంలో, ఆ ప్రాంతంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి అని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం వాదించారు. పోక్సో చట్టంలో పేర్కొనకపోయినప్పటికీ విస్తృతార్థంలో సెంగార్ పబ్లిక్ సర్వెంట్ అని ఆయన వాదించారు. సెంగార్ పబ్లిక్ సర్వెంట్ అని సీబీఐకి ఇంత ఆలస్యంగా ఎందుకు గుర్తుకు వచ్చిందో అని ఆయన తరఫు న్యాయవాది సిద్దార్థ దవే వ్యాఖ్యానించడానికి ప్రాధాన్యం లేకుండా పోలేదు.
పరిస్థితులను బట్టి కోర్టుల వైఖరి కూడా మారుతుందనడానికి సెంగార్ విషయంలో– సుప్రీంకోర్టు సెలవు రోజుల్లో కూడా జోక్యం చేసుకోవడమే నిదర్శనం. ఇదే సెలవు రోజుల్లో సుప్రీంకోర్టు ఆరావళి పర్వతాల విషయంలో కూడా తన తీర్పును తానే నిలిపివేసింది. కేవలం 100 మీటర్లు, అంతకుమించి ఎత్తు ఉన్న పర్వతాలనే ఆరావళి పర్వత శ్రేణిలో భాగమని భావించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనను సుప్రీంకోర్టు గత నవంబర్ 20న ఆమోదించింది. దీనివల్ల రాజస్థాన్, గుజరాత్, హరియాణా, ఢిల్లీలోని ఆరావళి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాలు జరిపేందుకు ఆస్కారం కలిగింది. ఒక్క రాజస్థాన్‌లోనే 12,081 ఆరావళి పర్వతాల్లో కేవలం 1,048 పర్వతాలే వంద మీటర్ల కంటే ఎత్తులో ఉన్నందువల్ల మిగతా పర్వతాలను మైనింగ్ కంపెనీలు తవ్వుకోవడానికి ఆస్కారం కలిగింది. శాస్త్రీయ అంచనాల తర్వాతే ఆరావళి పర్వతాల శ్రేణి ఏమిటో తేల్చాలని కోర్టు తాజా తీర్పులో చెప్పింది. లోతైన విశ్లేషణ లేకుండా మైనింగ్‌ను అనుమతిస్తే, మొత్తం పర్యావరణ సమతుల్యతే దెబ్బతింటుందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. మళ్లీ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రంగంలోకి దిగి పర్యావరణ మంత్రిత్వశాఖ తరఫున తన వాదనలు మార్చి, గతంలో కోర్టు తమ వాదనలను ఆమోదించడమే అపోహలకు దారితీసిందని తెలిపారు.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయకముందు జస్టిస్ గవాయ్ నెల రోజుల క్రితం ఇచ్చిన తీర్పును అదే కోర్టు నిలిపివేయడానికి, అదే సొలిసిటర్ జనరల్ తన వైఖరి మార్చుకోవడానికి కారణమేమిటి? మైనింగ్ కంపెనీలకు, కార్పొరేట్లకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రచారం రావడం, ఇప్పటికే కాలుష్యంతో ఊపిరాడక సతమతమవుతున్న ప్రజలు మైనింగ్ వల్ల మరింత ఉక్కిరి బిక్కిరై మృత్యుకోరల్లో చిక్కుకుంటారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం ఇందుకు కారణమా? విచిత్రమేమంటే రాజస్థాన్, గుజరాత్‌లో అదానీ తదితరులు నిర్మిస్తున్న సోలార్ కంపెనీల ప్రాజెక్టుల వల్ల గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే అరుదైన పక్షిజాతి అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇదే సుప్రీంకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ ఇటీవలే చరిత్రాత్మక తీర్పునిచ్చారు. పర్యావరణం విషయంలో ఒకే కోర్టులో వేర్వేరు తీర్పులు రావడం ఏ ప్రభావాన్ని సూచిస్తోంది? సెంగార్ విషయంలో ప్రభుత్వ వైఖరి కోర్టుకూ కోర్టుకూ మధ్య ఎందుకు మారిపోయింది? ఎన్నికల గెలుపుతో సంబంధం లేకుండా ఒక్కోసారి ప్రభుత్వాలకు ప్రజల నుంచి వేడి తగిలి మేల్కోవడం మంచి పరిణామమే. ఎందుకంటే ప్రభుత్వ వైఖరిని బట్టి కోర్టులు నడుస్తాయని రోజు రోజుకూ రుజువవుతోంది.
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)