Share News

American Job Market: అయోమయం.. అమెరికన్ జాబ్ మార్కెట్!

ABN , Publish Date - Oct 04 , 2025 | 05:23 AM

ఇతర దేశాలకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు అమెరికాలో వివిధ సంస్థల ప్రాజెక్టులను చేపడుతుంటాయి. ఆ కంపెనీల ప్రణాళికలను బట్టి నియామకాలు...

American Job Market: అయోమయం.. అమెరికన్ జాబ్ మార్కెట్!

ఇతర దేశాలకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు అమెరికాలో వివిధ సంస్థల ప్రాజెక్టులను చేపడుతుంటాయి. ఆ కంపెనీల ప్రణాళికలను బట్టి నియామకాలు, తొలగింపులు చేపడతాయి. అప్పటిదాకా ఆ ప్రాజెక్టుల్లో ఉండే అమెరికా పౌరులు కూడా కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అమెరికాలోని ఐటీ రంగం మీద విదేశీ టెక్ కంపెనీల గుత్తాధిపత్యం, దరిమిలా అమెరికన్ యువత అవకాశాలు కోల్పోతూ ఉండటం ట్రంప్‌నకు ఆగ్రహం కలిగించినట్లు ప్రచారం అవుతోంది. ఆయన తాజా నిర్ణయాల్లో అమెరికాయేతర కంపెనీల మీద ప్రతీకారేచ్ఛ గోచరించడానికి కారణం ఇదే. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచి ఇవాళ్టి దాకా స్థిరంగా ఉన్న సమస్య అమెరికాలోని జాబ్ మార్కెట్! నిజానికి ఈ సమస్య రోజురోజుకూ కొండలా పెరిగిపోతున్నది. సాధారణంగా జాబ్ మార్కెట్ అంటే– కొత్తవారికి దక్కే ఉద్యోగావకాశాల గురించేనని అనుకుంటాం. కానీ ఇప్పుడు అమెరికాలో సీనియర్లకు కూడా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వారి మెడపై కూడా కత్తి వేలాడుతోంది. పెద్ద కంపెనీలు ఎంతో కాలంగా సంస్థలోనే కొనసాగుతున్న, కీలక స్థానాలకు చేరుకున్న ఉద్యోగులను కూడా నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ఇరవై–పాతికేళ్ల అనుభవం ఉన్నవారు కూడా హఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొన్ని సంస్థల్లో డైరక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ల స్థాయికి చేరుకున్న వారి పరిస్థితి కూడా కుదురుగా లేదు. ఏ క్షణాన్నయినా ఉద్యోగం పోవచ్చునన్న భయం ప్రతి ఒక్కరినీ వెన్నాడుతోంది. ఒక సీనియర్‌ను ఉద్యోగం నుంచి తప్పిస్తే, అదే వేతనానికి ముగ్గురు నలుగురు ఫ్రెషర్స్‌ను తీసుకోవచ్చుననే సంస్థల ఆలోచనా సరళి, పర్యవేక్షక స్థాయి ఉద్యోగాల అవసరం అంతకంతకూ తగ్గుతుండడం ఇందుకు మరోకారణం.


ఉద్యోగాలు కోల్పోతున్న సీనియర్లకు కొత్త ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. ఒక ఉద్యోగంలో సీనియారిటీ గడించడం అంటే– అక్కడ అవసరమైన మూస పనికి అలవాటు పడి ఉండటం. అలాంటి వారికి ఉద్యోగం పోయి జాబ్ ప్రొఫైల్ మారితే అందుకు తగినట్టు ఎడ్జస్ట్‌ కావటం సులువు కాదు. ఐటీ రంగంలో రోజురోజుకూ మారే సాంకేతికతకు అప్‌డేట్ కానివారికి మళ్ళీ ఉద్యోగం దొరకడం మరీ కష్టం అవుతున్నది. చాలా కాలం కిందటే అమెరికాలో స్థిరపడిన వారి పరిస్థితి దయనీయం. వారు ఉద్యోగం పోగానే ఖాళీగా ఉండలేక ఏదైనా వ్యాపారంలోకి ప్రవేశించి అక్కడ అనుభవం లేక చేతులు కాల్చుకుంటున్నారు. అమెరికాలో వ్యాపారాల పరిస్థితి సైతం సజావుగా లేకపోవడం మరో సమస్య. సాధారణంగా ఐటీ ఉద్యోగులు తరచుగా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారుతూ ఉంటారు. ఇలా మారడం వలన త్వరత్వరగా వేతనాల మెట్లు ఎక్కుతూ వెళ్లవచ్చునని భావిస్తారు. ఈ పోకడను జాబ్ హాపింగ్ (Job hopping) అంటారు. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఎవ్వరూ ఈ ఆలోచనను దరిదాపులకు రానివ్వటం లేదు. ఉన్న ఉద్యోగం వదిలేస్తే మరొకటి దొరకబుచ్చుకోవడం సాధ్యం కాదనే భయం వారిని నిలువరిస్తున్నది. ఉద్యోగాలు ఇప్పించే కన్సల్టెన్సీల స్థితి కూడా కష్టంగా ఉన్నది. పేరోల్స్ రన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.


ఎన్నారైలకు సంబంధించినంత వరకు, అమెరికాలో ఉద్యోగ సంక్షోభం ఈ దేశానికే పరిమితం కాబోదు. ఎన్నారై తెలుగువారి సంఖ్య అమెరికాలో గణనీయంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా పడుతుంది. ట్రంప్ విధించిన సుంకాలు, ఆయన పరిపాలన తీరు భారతదేశం నుంచి జరిగే అన్ని రకాల ఎగుమతులపై ప్రభావం చూపించడం సహజం. వజ్రాలు, వస్త్రాలు, ఫార్మా, ఆంధ్రప్రదేశ్ విషయంలో రొయ్యల ఎగుమతులపై సుంకాల ప్రభావం కనిపిస్తూనే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా– అమెరికన్‌ జాబ్ మార్కెట్ దెబ్బతినడం వల్ల ఎన్నారైల నిధుల వరద ఇండియాకి తగ్గి రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొనే ప్రమాదం అధికం. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తమ మిగులు ఆర్జనతో స్వంత రాష్ట్రాల్లో ఆస్తుల కొనుగోలుకు మొగ్గు చూపుతారు. ఎక్కువమంది హైదరాబాదులో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొని తల్లిదండ్రులను అక్కడ ఉంచాలని అనుకుంటారు. అలాగే తాము ఏడాదిలో ఒకసారి వచ్చి గడపడానికి హైదరాబాదు గేటెడ్ కమ్యూనిటీలను ఎంచుకుంటారు. ఆ మాటకొస్తే ఎన్నారై కొనుగోలుదారుల్ని లక్ష్యంగా పెట్టుకునే వెలిసిన వెంచర్లు హైదరాబాదు శివార్లలో అనేకం. ఇప్పుడు ఎన్నారైలు అమెరికా జాబ్‌ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా స్వదేశంలో పెట్టుబడులకు ధైర్యం చేయలేకపోతున్నారు. వీసా ఫీజుల పెంపు వంటి నిర్ణయాల వల్ల భారతీయ సంస్థలకు కొత్తగా భారీ ఎదురుదెబ్బ తగిలిందని అనుకోనక్కరలేదు. కోవిడ్‌ అనంతర పరిణామాల నుంచి అమెరికన్‌ మార్కెట్‌ పెద్దగా కోలుకున్నది లేదు. పాతవారి తొలగింపులు, కొత్తవారికి ఉద్యోగాలు లేని స్థితి ఇప్పటికే ఉంది. అయితే, ఇప్పటివరకూ పెద్ద కంపెనీలు తమకు ప్రాజెక్టులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఉద్యోగుల వెతుకులాట అవసరం లేకుండా, ముందుగానే హెచ్‌1బి వీసాలు ప్రాసెస్‌ చేయించి సిద్ధంగా ఉంచుకొనేవి. వీసా ఫీజుల పెంపు నిర్ణయం ఈ పద్ధతిని దెబ్బతీస్తోంది. వీసా, వేతనం, లాటరీ మధ్య లింకుపెట్టిన ట్రంప్‌ చర్యలు చిన్న కంపెనీలకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారిపోతూండటం కూడా ఈ రంగంలో అనిశ్చితికి, గందరగోళానికి కారణమవుతోంది. ప్రశాంతత ఎప్పటికి సాధ్యమో చెప్పలేని స్థితి.

-కృష్ణమోహన్ దాసరి పాత్రికేయుడు, డల్లాస్

Updated Date - Oct 04 , 2025 | 06:23 AM