Share News

UN Taliban Resolution: తాలిబాన్‌ పక్షాన..

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:29 AM

అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్‌ పాలనను తప్పుబడుతూ, దాని నిరంకుశ విధానాలూ అణచివేతలూ వివక్షలూ వదులుకోవాల్సిందిగా ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టిన తీర్మానంమీద ఇటీవల సభ్యదేశాలు ఓటుచేశాయి.

UN Taliban Resolution: తాలిబాన్‌ పక్షాన..

ఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్‌ పాలనను తప్పుబడుతూ, దాని నిరంకుశ విధానాలూ అణచివేతలూ వివక్షలూ వదులుకోవాల్సిందిగా ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టిన తీర్మానంమీద ఇటీవల సభ్యదేశాలు ఓటుచేశాయి. 116దేశాలు సమర్థిస్తే, అంటే తాలిబాన్‌కు వ్యతిరేకంగా నిర్ద్వంద్వంగా నిలబడితే, 12దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉంటే, రెండు దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. అంటే, అఫ్ఘానిస్థాన్‌లో అణచివేతలూ, వివక్షలూ ఉన్నాయని ఇవి ఒప్పుకోలేదని అనుకోవాలి. మహిళల పట్ల అమానవీయంగా వ్యవహరించవద్దని, సర్వవివక్షలనూ పక్కనబెట్టి సమ్మిళితంగా వ్యవహరించాలన్న ఆ తీర్మానం వీటికి నచ్చలేదని అర్థం. ఆ రెండుదేశాలు అమెరికా, ఇజ్రాయెల్‌. ఇక, ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయిన పన్నెండుదేశాల్లో భారత్‌ కూడా ఒకటి. తాలిబాన్‌కు వ్యతిరేకంగా ఓటుచేసిన దేశాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పాకిస్థాన్‌.


వ్యూహాత్మక ఎత్తుగడగానో, స్పష్టత వద్దనుకున్నప్పుడో దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోతాయి. అయితే, ఆ ఎత్తుగడలోనూ, అస్పష్టతలోనూ ఆయాదేశాలు తమ సందేశాన్ని ఇస్తూనే ఉంటాయి. ఓటింగ్‌లో పాల్గొన్న దేశాలన్నింటిలోనూ ఓ పద్నాలుగు మినహా మిగతా నూటపదహారూ తాలిబాన్‌కు వ్యతిరేకంగా ఓటుచేసిన ఈ సందర్భంలో ఎవరెటు అన్నదే కాదు, ఎందుకు అన్నది కూడా మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సర్వప్రతినిధి సభ తీర్మానానికి పెద్ద విలువేమీ లేదనీ, ఎలాగూ అత్యధికదేశాలు తాలిబాన్‌కు వ్యతిరేకంగా ఓటేసి, భారీ మెజారిటీతో దానిని నెగ్గించాయి కదా అనుకున్నా ఏ గట్టున ఎవరున్నారన్నది ముఖ్యమే. సెప్టెంబరు 11 దాడుల తరువాత, అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా అమెరికా అతిపెద్ద, సుదీర్ఘకాల యుద్ధం చేసింది. ఇస్లామిక్‌ తీవ్రవాదానికి అడ్డాగా మారిన అఫ్ఘానిస్థాన్‌నుంచి తాలిబాన్‌లను తరిమికొట్టి, తానుమెచ్చినవారిని కూచోబెట్టింది. తన బలగాలను అక్కడే ఉంచి, సరిహద్దుల్లో కాచుకుకూచున్న తాలిబాన్‌లతో పోరాడటానికి వీలుగా అక్కడి ప్రభుత్వ సైన్యాలకు శిక్షణ ఇచ్చింది. రెండుదశాబ్దాల అనంతరం అమెరికా తన సైన్యాలను ఉపసంహరించుకొని, తాలిబాన్‌ పునరాగమానికి మార్గం సుగమం చేసింది. అమెరికా సైన్యాలు పూర్తిగా తరలకముందే తాలిబాన్‌లు దేశాన్ని సునాయాసంగా కైవసం చేసుకున్నారు. అల్లా దయవల్ల తన పొరుగుదేశం తాలిబాన్‌ల చేతిలోకి వచ్చిందంటూ పాక్‌ మాజీ పాలకుడు ఇమ్రాన్‌ఖాన్‌ ఎంతో సంతోషించారు కానీ, తాలిబాన్‌ను గుప్పిట్లో పెట్టుకొని భారత్‌ను ఆడించవచ్చునన్న పాక్‌ పాలకుల కలలు అనతికాలంలోనే కల్లలైనాయి. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అఫ్ఘాన్‌ నుంచి చాలా సమస్యలు ఎదురవుతూండటంతో తాలిబాన్‌ ఇప్పుడు దానికి శత్రువైంది.


అమెరికా వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇవ్వబోనన్న హామీకి కట్టుబడివున్నంతకాలం తాలిబాన్‌తో ట్రంప్‌కు సమస్య ఉండదు. అఫ్ఘాన్‌లో వదిలిపోయిన ఆయుధాలను కూడా వెనక్కు ఇమ్మని అమెరికా గట్టిగా అడగడం లేదు. ఇరాన్‌తో ఘర్షణలు పెరుగుతున్న తరుణంలో, రాబోయే రోజుల్లో చైనాతో కయ్యం తప్పనిస్థితిలో అఫ్ఘానిస్థాన్‌ మరింత అవసరం. కాబూల్‌కు ఉత్తరదిక్కున ఉన్న అతిపెద్ద, అతికీలకమైన బగ్రామ్‌ ఎయిర్‌బేస్‌ను అమెరికాకు ఇచ్చేందుకు తాలిబాన్‌ ఒప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జో బైడెన్‌ విధించిన ఆంక్షలను కూడా సడలించి తాలిబాన్‌లతో సయోధ్య పెంచుకుంటున్న ట్రంప్‌ ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలోనే తాలిబాన్లను వెనకేసుకొచ్చారు.


ముప్పయేళ్ళక్రితం అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్‌ అడుగుపెట్టింది మొదలు, దానిని అమెరికా తరిమికొట్టేవరకూ భారత్‌ చాలా సమస్యలూ ఉగ్రదాడులు ఎదుర్కొంది. అప్ఘాన్‌లో తాలిబాన్‌ వ్యతిరేక కూటమివైపు నిలబడింది కూడా. నాలుగేళ్ళక్రితం మలిరాకడలో తాలిబాన్‌ భారత్‌ వ్యతిరేకవైఖరిని పూర్తిగా వదులుకుంది. అఫ్ఘానిస్థాన్‌నుంచి భారత్‌మీద ఈగవాలనివ్వబోమని హామీ ఇచ్చింది. భారత్‌ సాయాన్నీ, పెట్టుబడులనూ కోరింది. అఫ్ఘాన్‌ పూర్వవిద్యార్థి ఒకరిని దౌత్యవ్యవహర్తగా గుర్తించడంతో మొదలై భారత అధికారులూ, మంత్రుల పర్యటనలతో సంబంధాలు మరింత బలపడ్డాయి. ఒకప్పుడు పాక్‌పక్కన ఉండి, భారతవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన తాలిబాన్‌ ఇటీవలి పహల్గాం ఉగ్రదాడిని నిర్ద్వద్వంగా ఖండించడం గతంలో ఏమాత్రం ఊహకు అందనిది. పాకిస్థాన్‌ శత్రువు మనకు మిత్రుడు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ, మన వ్యూహాత్మక, దౌత్య ప్రయోజనాలకోసం తాలిబాన్‌ దుశ్చర్యలను గుడ్డిగా సమర్థించాల్సిన అవసరమేమీ లేదు. పరిస్థితులు ఎల్లవేళలా ఒకేరీతిలో, అనుకూలంగానే ఉంటాయన్న నమ్మకమేమీ లేదు.

Updated Date - Jul 12 , 2025 | 12:29 AM