Operation Spider Web: రష్యా పెర్ల్‌హార్బర్
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:54 AM
ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్‌వెబ్ ద్వారా రష్యాలోని వాయుసేన స్థావరాలపై భారీ డ్రోన్ దాడులు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర, కృత్రిమ మేధస్సు ప్రాముఖ్యతను హైలైట్ చేస్తోంది.
నలభైకి పైగా రష్యన్ విమానాలను ఉక్రెయిన్ పేల్చివేసిన ఆ ఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సామాజిక మాధ్యమాల్లో అసలు దృశ్యాలకంటే కృత్రిమవిడియోలే అనేకరెట్లు విస్తృతంగా ప్రచారమైనాయి. ఇటీవలికాలంలో ఎన్నడూ చూడని, ఊహకు కూడా అందని ఈ కొత్తతరహా దాడి ఆధారంగా విడియోగేమ్‌లు కూడా తయారైనాయట. సరిహద్దునుంచి నాలుగువేల కిలోమీటర్ల లోపలకు చొచ్చుకుపోయి, రష్యాలోని వేర్వేరుప్రాంతాల్లో ఉన్న వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేయగలగడం ఊహకు అందనిది. డ్రోన్లను ట్రక్కుల్లో దట్టించి రష్యాలోకి రహస్యంగా చేరవేయడం, ఆ వాహనాలను వైమానికస్థావరాలకు సమీపంలో ఉంచడం, తాము కోరుకున్న సమయంలో రిమోట్‌తో వాటి పైకప్పులను ఎత్తి డ్రోన్లను గాలిలోకి వదలడం ‘ఆపరేషన్ స్పైడర్‌వెబ్’ పేరుకు తగ్గట్టుగానే ఉంది. ఉబ్బితబ్బిబ్బవుతున్న జెలెన్‌స్కీ ఏడాదిన్నర కష్టమిది అంటున్నారు. అణ్వాయుధాలను మోసుకుపోగలిగే యుద్ధవిమానాలు, బాంబర్లతో సహా, హెచ్చరిక, రక్షణ వ్యవస్థలున్న విమానాలు కూడా నాశనమైనవాటిలో ఉన్నాయని ఉక్రెయిన్ అంటోంది. ఉక్రెయిన్ గొప్పలన్నింటినీ నమ్మనక్కరలేదు కానీ, డ్రోన్లు, కృత్రిమమేథస్సు కలగలిపి సాగించిన ఈ విధ్వంసం యుద్ధం మొదలైన తరువాత రష్యాకు అతిపెద్ద దెబ్బ. బుడాపెస్ట్ ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ తన వద్ద ఉన్న ఆఖరు విడత అణ్వాయుధాలను రష్యాకు అప్పగించి ఆదివారం నాటికి 29 సంవత్సరాలైందని కొందరు గుర్తుచేసుకుంటున్నారు. రష్యన్ ప్రజలు ఈ డ్రోన్లదాడిని 1941 డిసెంబరు 7న పెర్ల్ హార్బర్‌లో అమెరికా నౌకాదళంమీద జపాన్ జరిపిన వైమానిక దాడితో పోల్చుకుంటున్నారు. యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం ఏ స్థాయికి హెచ్చిందో ఈ ఘటన చెబుతోంది. ఇటీవలే రష్యా నాలుగువందల డ్రోన్లను వినియోగించి ఉక్రెయిన్‌ను దెబ్బతీసిన నేపథ్యంలో, అంతకంటే అత్యాధునికమైన, సొంత బుర్రతో సమస్తకార్యాలనూ చక్కబెట్టగల నాలుగోవంతు డ్రోన్లతో ఉక్రెయిన్ పైచేయి సాధించడం విశేషం. తక్కువ ఖర్చుతో తయారైన చిన్నచిన్న డ్రోన్లు ఇంతటి పెను విధ్వంసాన్ని సృష్టించడం యుద్ధరీతుల్లోనూ, నీతుల్లోనూ వచ్చిన మార్పుకు ప్రబల నిదర్శనం. ఒక్కసారిగా గాల్లోకి లేచి, తూనిగల్లాగా ఎగురుతున్న బుల్లి డ్రోన్లు ఏకంగా భారీ బాంబర్లను పేల్చివేస్తున్న దృశ్యాలు డ్రోన్ టెక్నాలజీలో అమితవేగంగా జరుగుతున్న ఎదుగుదలను తెలియచెప్పడమే కకాదు, భవిష్యత్ యుద్ధాలు ఏ విధంగా జరగబోతాయో కూడా హెచ్చరిస్తున్నాయి.
యుద్ధంలో ఉన్న రెండుపక్షాలు ఇంత సునాయాసంగా పరస్పరం నష్టపరచుకొనే, రెచ్చగొట్టుకొనే వీలున్నప్పుడు యుద్ధాలను ఆపడం కూడా కష్టమే. వారం క్రితం మిసైళ్ళు, డ్రోన్లతో రష్యా సాగించిన విధ్వంసం అమెరికా అధ్యక్షుడికి అమితాగ్రహం కలిగించింది. ఒకపక్క చర్చలు జరుగుతూంటే, కాల్పుల విరమణకు సిద్ధపడకుండా ఇప్పటివరకూ యుద్ధంలో వాడని అతిశక్తిమంతమైన మారణాయుధాలతో సామాన్యులను సైతం పుతిన్ చంపినందుకు ట్రంప్‌కు కోపం వచ్చింది. రష్యాను తానే రక్షిస్తున్నానని, తానేగనుక లేకపోతే ఈ పాటికి రష్యాకు తీవ్రమైన చెడు జరిగి, ప్రపంచపటం నుంచి చెరిగిపోయేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. పుతిన్ నిప్పుతో చెలగాటమాడుతున్నాడన్నట్టుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో రష్యా పెద్దలకు మూడో ప్రపంచయుద్ధం హెచ్చరిక కూడా కనిపించింది. వారం నాటి ఆ దాడి శాంతి చర్చలను ప్రభావితం చేస్తుందని అనుకుంటే, మలివిడత చర్చలకు కూచోబోతున్న కొద్దిగంటలముందు జరిగిన ఇప్పటిదాడి వాటి వైఫల్యానికి కారణం కావడం అత్యంత సహజం. తుర్కియే కేంద్రంగా రెండోవిడత చర్చలు కనీసం గంటకూడా సాగకుండా ముగిసిపోయాయి. ఈ చర్చల్లో కాల్పుల విరమణ గురించి పలుమార్లు ఉక్రెయిన్ ఒత్తిడిచేసినా రష్యా లొంగలేదట. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆపరేషన్ స్పైడర్ వెబ్ తీవ్రమైన అవమానాన్ని మిగిల్చింది. ఏడాదిన్నరగా సాగుతున్న ప్రణాళికను రష్యన్ ఇంటలిజెన్స్ విభాగం పసిగట్టలేకపోవడం పెద్ద వైఫల్యం. ఉక్రెయిన్ మీద మరింత తీవ్రంగా కక్షసాధించాలన్న ఒత్తిడి పుతిన్‌మీద పెరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, రాబోయే కాలంలో ఈ ప్రతీకార దాడుల స్థాయి, విస్తృతి ఊహకు అందదు. కాలం గడుస్తున్నకొద్దీ యుద్ధం కట్టుతప్పి ఇరుపక్షాలనూ ఎదురెదురుగా కూర్చోబెట్టగలిగే అవకాశమే లేకపోవచ్చు. రెండోవిడత చర్చలు విఫలమైన నేపథ్యంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ఓ ప్రతిపాదన చేశారు. సాధ్యమైనంత త్వరలో, కనీసం ఈ నెలాఖరులోగా, రష్యా, ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షులు నేరుగా చర్చల్లో కూర్చోవాలన్న ఆ ఆలోచనకు ముగ్గురూ సరేనంటే తప్ప, చర్చల్లో ప్రగతి అసాధ్యం.