Peace Agreement: ఉక్రెయిన్ యుద్ధగతి
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:10 AM
: డోనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్–రష్యా యుద్ధం గురించి విమర్శలు చేస్తూ, శాంతి ఒప్పందానికి క్రిమియా ఇవ్వాలని ఉక్రెయిన్‌కు ఉద్దేశించినట్లు చెప్తున్నారు. ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ రష్యా పర్యటనలో యుద్ధం ఆగే అవకాశాలపై చర్చిస్తున్నారు
ఎన్నడూలేనిది అమెరికా అధ్యక్షుడికి రష్యా పాలకుడిమీద మాచెడ్డ కోపం వచ్చింది. ఇకచాలు, యుద్ధాన్ని ఆపేయ్ పుతిన్ అంటున్నారు డోనాల్డ్ ట్రంప్. పన్నెండుమందిని హతమార్చి, డెబ్బయ్‌మందిని తీవ్రంగా గాయపరిచిన రష్యా దాడి ట్రంప్‌ను కదిలించిందట. గాజాలో యుద్ధం ఆగి, ఆహారం చేరుతోందన్న సంతోషం ఎంతోకాలం నిలవనీయకుండానే, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ మళ్ళీ మారణకాండ మొదలుపెట్టినా ట్రంప్‌కు ఈ బాధకలగలేదు. ఇప్పుడు అక్కడ యథేచ్ఛగా ఊచకోతలు సాగిస్తూ ఒక్క పాలస్తీనియన్ కూడా మిగలకుండా ఇజ్రాయెల్ తరిమికొట్టేవరకూ, బహుశా దానిని మానవరహిత ప్రాంతంగా మార్చి రిసార్టు తయారీకి అప్పగించేంతవరకూ ట్రంప్‌కు గాజా గుర్తుకురాదేమో. ఉక్రెయిన్ విషయంలో మాత్రం తాను అనుకున్నట్టుగా జరగడం లేదని ట్రంప్‌కు చిరాకుగా ఉంది. అరుదైన, విలువైన ఖనిజాలు అప్పగిస్తామని ఉక్రెయిన్–రష్యా పోటాపోటీగా భారీ ఆఫర్ ఇచ్చి కూడా చాలారోజులైంది. వేగంగా ఒప్పందానికి రాకపోతే మధ్యవర్తిత్వాన్ని మధ్యలోనే వదిలేస్తామని అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు అదేపనిగా హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ప్రత్యేకదూత స్టీవ్ విట్కాఫ్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉంటూ, పుతిన్ సహా కీలకనేతలతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో, యుద్ధం కొలిక్కివస్తుందని అంటున్నారు.
ట్రంప్ ప్రత్యేకదూత మాస్కోలో కాలూనినక్షణాల్లోనే రష్యా మిలటరీ జనరల్ హత్య జరిగింది. ఉక్రెయిన్ యుద్ధంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న ఈ అధికారి కారుబాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఇదేవిధంగా ఒక జనరల్ హత్య జరిగినప్పుడు రష్యా దానిని ఉక్రెయిన్ ఖాతాలో వేసి, శపథాలు చేసింది. ఈ మారు ఉగ్రవాదుల దుశ్చర్య అని మాత్రమే ప్రకటించి ఊరుకుంది. గత ఏడాది జూలైలో కీవ్‌లోని అతిపెద్ద పిల్లల ఆస్పత్రిని నేలమట్టం చేసి, ముప్పైఐదుమందిని హతమార్చిన తరహాలోనే గురువారం తెల్లవారుజామువరకూ నూటయాభై డ్రోన్లు, డెబ్బై మిసైళ్ళతో రష్యా ఉక్రెయిన్‌మీద భారీ దాడిజరిపిన విషయం తెలిసిందే. ఈ దాడి జరగడానికి ఒకరోజుముందు శాంతిచర్చలకు మోకాలడ్డుతున్నది జెలెన్‌స్కీయేనంటూ తప్పుబట్టిన ట్రంప్, ఈ దాడి అనంతరం విధిలేక పుతిన్‌ను కూడా ఓ మాట అనకతప్పలేదు.
క్రిమియా రష్యా చేతుల్లోకి పోయి పదేళ్ళయిన తరువాత కూడా దానిని గుర్తించకూడదంటే ఎలా అన్నది ట్రంప్ ప్రశ్న. మరో నాలుగేళ్ళ తరువాత, అంటే, 2018లో మీ ప్రభుత్వమే ‘క్రిమియా డిక్లరేషన్’లో దానిని దురాక్రమణగా అభివర్ణించి, క్రిమియాను రష్యా అంతర్భాగంగా గుర్తించేది లేదని ప్రకటించి, ఇప్పుడు మాటమారుస్తున్నారెందుకని జెలెన్‌స్కీ ప్రశ్న. ట్రంప్ శాంతి ప్రతిపాదనలో భాగంగా క్రిమియాను రష్యాకు వదులుకోవడానికి జెలెన్‌స్కీ అంగీకరించడం లేదు. యుద్ధం ఆగకపోయినా పర్వాలేదు కానీ, మా రాజ్యాంగానికీ, ఆత్మగౌరవానికీ, క్రిమియాలో ఉన్న తోటి ఉక్రేనియన్లకు మేము ద్రోహం చేయలేమని అక్కడి ౧ప్రజలు అంటున్నారు. శాంతి కావాలో, మరో మూడేళ్ళపాటు యుద్ధాన్ని కొనసాగనిచ్చి మొత్తం దేశాన్నే కోల్పోతారో ఆయనే తేల్చుకోవాలని అని ట్రంప్ మరోమారు జెలెన్‌స్కీని రెచ్చగొట్టారు కూడా.
దక్షిణ ఉక్రెయిన్‌లో నల్లసముద్రం వెంబడివున్న క్రిమియా వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం కావడంతో రష్యా ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. శాంతి ఒప్పందానికి క్రిమియా ప్రధాన అంశం కావడంతో, జెలెన్‌స్కీ మెడలు వంచేందుకు ట్రంప్ శతథాప్రయత్నిస్తున్నారు. టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన మనసులో ఉన్నదంతా చెప్పేశారు. ఉక్రెయిన్ నాటోలో చేరదనీ, యూరోపియన్ యూనియన్ సభ్యత్వంతో సరిపెట్టుకుంటుందని తేల్చేశారు. అంతేకాదు, ఈ మూడేళ్ళయుద్ధకాలంలో ఉక్రెయిన్ కోల్పోయిన భూభాగాలమీద రష్యా ఆధిపత్యాన్ని గుర్తించేందుకు కూడా ట్రంప్ సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. క్రిమియా యుద్ధంతో ముడిపడిన ఆంక్షలను రష్యామీద ఎత్తివేయడం, ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి అన్ని విధాల సాయపడడం ఇత్యాదివి ఉన్నాయి. ట్రంప్ ప్రతిపాదిత ఒప్పందం తనకు అనుకూలంగా ఉంటున్నందున రష్యా ఇప్పటికే జైకొట్టింది. జెలెన్‌స్కీని కూడా దారికి తేగలిగితే యుద్ధం ఆగడంతోపాటు, రెండుదేశాల్లోనూ కీలకవనరులు అమెరికా దక్కించుకోవచ్చు.