Share News

Trumps Nobel Hopes Clash: శాంతి కుసుమిస్తుందా

ABN , Publish Date - Oct 10 , 2025 | 03:01 AM

అమెరికా అధ్యక్షుడి నోబెల్‌ శాంతి పురస్కార కాంక్ష రెండేళ్ళయుద్ధాన్ని కొలిక్కితెస్తున్నట్టుంది. పతకం మోజులో ఆయన పాలస్తీనియన్లకు అన్యాయం చేశాడనీ...

Trumps Nobel Hopes Clash: శాంతి కుసుమిస్తుందా

అమెరికా అధ్యక్షుడి నోబెల్‌ శాంతి పురస్కార కాంక్ష రెండేళ్ళయుద్ధాన్ని కొలిక్కితెస్తున్నట్టుంది. పతకం మోజులో ఆయన పాలస్తీనియన్లకు అన్యాయం చేశాడనీ, అయినా, అరబ్‌, ముస్లిం దేశాలు కక్కలేక, మింగలేక ఆ ఇరవైసూత్రాల శాంతిపథకాన్ని పొగుడుతున్నాయని కొందరు విమర్శిస్తున్నారు. మొదట్లో దోహాలోనూ, శ్వేతసౌధంలోనూ ఒకే రీతిలో ఉన్న ఆ ప్రణాళిక ఆ తరువాత నెతన్యాహూ వైపు బాగా మొగ్గి, ట్రంప్‌ ఒత్తిళ్ళు, హెచ్చరికలు, లక్ష్మణరేఖల బలంతో బలవంతంగా పట్టాలెక్కిందని అంటున్నారు. ఎవరు చెప్పారు మనకు నష్టం జరుగుతోందని, మన సైనికులు వెనుకడుగువేయాలని, ఊసేలేని పాలస్తీనా రాజ్యాన్ని మనం ఒప్పుకుంటున్నామని? అంటూ హిబ్రూలో బెంజమెన్‌ నెతన్యాహూ తన ప్రజలకు భరోసా ఇస్తున్నారు. గాజా మీద ఏకపక్ష యుద్ధంలో వేలాదిమందిని సంహరించి, లక్షల మందిని నిరాశ్రయులను చేసి, దానిని వల్లకాడుగా మార్చినా కూడా నెతన్యాహూ సాధించలేకపోయినదానిని శాంతిప్రణాళిక పేరిట శ్వేతసౌధం ఆయనకు పళ్ళెంలో పెట్టి ఇచ్చింది. హమాస్‌ దుంపనాశనం, బందీల విడుదల తన లక్ష్యాలుగా, యుద్ధాన్ని నచ్చినంత కాలం, ట్రంప్‌ మెచ్చినంతవరకూ పొడిగిస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌ అధినేతకు యుద్ధక్షేత్రంలో దక్కనిది శ్వేతసౌధంలో చిక్కింది. బందీలను వెనక్కు తెచ్చేవరకూ వెనకడుగువేయబోనని శపథం చేసి, అంతిమంగా నిలబెట్టుకున్నాను అని నెతన్యాహూ గర్వపడుతున్నారు. మితవాదులు, మహా జాతీయవాదులు, మతదురహంకారులతో నిండిన ఆయన కూటమి ప్రభుత్వంలోని నాయకులు మాత్రం, గాజాలో ఒక్క పాలస్తీనా ప్రాణి కూడా మిగలకూడదన్న మా లక్ష్యం ఇక నెరవేరదా? అని వాపోతున్నారు.


ప్రకటిత కాల్పుల విరమణ ఒప్పందం కడవరకూ నిలిచి, అన్ని దశలూ పూర్తిచేసుకోవడం ప్రధానం. బందీల అప్పగింతలు, సైనికుల వెనుకడుగుల లెక్కలు రాసుకున్నదానికి అనుగుణంగా సాగినప్పుడే ట్రంప్‌ను ప్రపంచ దేశాధినేతలు కీర్తిస్తున్న ఈ సందర్భానికి అర్థం ఉంటుంది. ఒప్పందం కుదిరిందన్న ప్రకటనతో అటు ఇజ్రాయెల్‌లోనూ, ఇటు గాజాలోనూ వెల్లువెత్తిన హర్షాతిరేకాలు ఇక శాశ్వతంగా నిలవాలి. అనేకసార్లు ఒప్పందాలకు మోకాలడ్డిన నెతన్యాహూను ఇటీవల ఖతార్‌ మీద చేసిన దాడి ఈమారు ఆత్మరక్షణలో పడవేసింది. శాంతిచర్చలు ముందంజలో ఉండగా, కీలకమైన హమాస్‌ నేతలను మట్టుబెట్టడం ద్వారా నెతన్యాహూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన తన యుద్ధకాంక్షను మరోమారు వెళ్ళగక్కడం కంటే, మధ్య ఆసియాలో తనకు అత్యంత కీలకమైన, అతి మిత్రదేశమైన ఖతార్‌లోకి ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు చొరబడి బాంబులు కురిపించిన ఆ ఘటనను అమెరికా అధ్యక్షుడు వెనకేసుకురావడం అరబ్‌దేశాలను నిర్ఘాంతపరిచింది. దోహాపై దాడిని నెతన్యాహూ తనకు చెప్పే చేశాడని ఒకసారి, తన ప్రమేయంలేదని మరోసారి, అయినా తప్పేనని వ్యాఖ్యానించి ట్రంప్‌ కూడా పరువుపోగొట్టుకున్నారు. రక్షణకవచంగా ఉంటానన్న అమెరికా అలా భక్షకుడి పక్షాన నిలిచి తమకు ధోకా ఇచ్చినందుకు అరబ్‌దేశాలు ఆగ్రహించడమే కాక, అవన్నీ బలంగా జట్టుకట్టడం మొదలైంది. దీంతో, అప్పటివరకూ తలెగరేస్తూవచ్చిన నెతన్యాహూ మెడలువంచి శ్వేతసౌధం నుంచే ఖతార్‌ అధినేతకు ఫోన్‌లో సారీ చెప్పించడం ద్వారా ట్రంప్‌ కొంత ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ప్రత్యేక ఆదేశాలతో ఖతార్‌ భద్రతకు మరింత కట్టుబడ్డారు. అరబ్‌ దేశాలు చేజారిపోతూ, మరోపక్క పాలస్తీనా రాజ్యాన్నీ, ఇరుగుపొరుగు సిద్ధాంతాన్ని ఐరోపా అధినేతలంతా బలంగా ముందుకు తోస్తున్న తరుణంలో సమయం మించిపోతున్న సంగతి ట్రంప్‌ గ్రహించినట్టు ఉంది. తాను అధికారంలోకి రాగానే ఒక్క టెలిఫోన్‌ కాల్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మెడలు వంచగలననీ, ఒక్కరోజులో ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగలననీ భ్రమసిన ట్రంప్‌ను అసహనం ముంచెత్తుతోంది. ఏడుయుద్ధాలు ఆపినా, బరాక్‌ ఒబామాను ప్రశంసించిన మాదిరిగా మిగతా ప్రపంచం తనను కీర్తించనందుకు ఆగ్రహం కలుగుతోంది. తనకు నోబెల్‌ రాకపోతే అమెరికాకే అవమానమని వారం క్రితం కూడా హెచ్చరించిన ట్రంప్‌, రాజ్యవిస్తరణ లక్ష్యంతో రగిలిపోతున్న నెతన్యాహూను నియంత్రించి, ఒప్పందాన్ని తుదివరకూ నిలబెట్టి, యుద్ధాన్ని ముగించాలి.

Updated Date - Oct 10 , 2025 | 03:01 AM