US Trade Policy: ట్రంప్ వృషభ వీరంగాలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:36 AM
భారత్ ఒకప్పుడు విదేశీ వాణిజ్యానికి సుముఖంగా ఉండేది కాదు. ముఖ్యంగా దిగుమతులను వ్యతిరేకించేది. సహచర అలీనోద్యమ
భారత్ ఒకప్పుడు విదేశీ వాణిజ్యానికి సుముఖంగా ఉండేది కాదు. ముఖ్యంగా దిగుమతులను వ్యతిరేకించేది. సహచర అలీనోద్యమ దేశాలతోనైనా, తోటి వర్థమాన దేశాలతోనైనా అదే వైఖరితో వ్యవహరించేది. వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల విషయంలో అన్య దేశాలతో వ్యవహరించడంలో అత్యంత అప్రమత్తంగా ఉండేది. వాణిజ్య భారతావని తలుపులు పూర్తిగా మూసివేశాం. నాలుగు దశాబ్దాల పాటు వాటిని తిరిగి తెరువనే లేదు. పైగా ఎగుమతి దిగుమతులకు భయంకరమైన నిబంధనలు నిర్దేశించాం. అవును, ప్రతి ఎగుమతికీ, ప్రతి దిగుమతికీ లైసెన్స్‌లు, పర్మిట్‌లు తప్పనిసరి. మన దిగుమతులలో అత్యధికం, ఎగుమతులలో కొన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్ల ద్వారా విధిగా జరుగుతుండేవి. ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్’ అనే అధికారి ఒకరు మనకు ఉండేవారు. ఆయన కింద ఒక విస్తృత అధికార గణం ఉండేది. వారు దేశవ్యాప్తంగా ఉండేవారు. ఈ అధికార గణం చేసే ఏకైక పని దిగుమతులు, ఎగుమతులకు లైసెన్స్‌లు జారీ చేయడమే! అదొక లాభసాటి వ్యవహారం. ఎవరూ ఎప్పుడూ ఒక ప్రశ్న అడిగిన పాపానికి పోలేదు: ‘మంచిదే, దిగుమతులను నియంత్రించే అధికారి ఒకరు ఉండడాన్ని అర్థం చేసుకుంటున్నాం, అయితే ఎగుమతులను నియంత్రించే అధికారి ఎందుకు ఉన్నారు?’. ప్రశ్న స్పష్టమే. సమాధానమే లేదు. ఈ విధానం ఎగుమతులను పెంపొందించలేదు. ఎగుమతుల ఆధారిత తయారీ పరిశ్రమల రంగాన్ని అభివృద్ధిపరచలేదు. విదేశీ మారకద్రవ్య నిల్వలను సమృద్ధం చేయలేదు. ఇదిలా ఉండగా భారత్‌తో సమస్థాయి ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమయ్యే బహిరంగ ఆర్థిక వ్యవస్థ (ఓపెన్ ఎకానమీ)ను అభివృద్ధిపరచుకోవడానికి సంకల్పించాయి. స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుమతించి సుసంపన్నమయ్యాయి.
అనేక కారణాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ 1990–91లో సంక్షోభం అంచుకు చేరింది. ఆర్థిక సంస్కరణలను అమలుపరచడం భారత ప్రభుత్వానికి అనివార్యమయింది. వాణిజ్య, పారిశ్రామిక విధానాలలో మౌలిక మార్పులతో ఆర్థిక క్రమశిక్షణకు అగ్ర ప్రాధాన్యమివ్వడం ద్వారా భారత్ ఆ సంక్షోభం నుంచి గట్టెక్కింది. అభివృద్ధిపథంలోకి ప్రవేశించి వడివడిగా ముందుకు సాగింది. సుంకాలు తగ్గించాం (సగటు సుంకాన్ని 2013లో 12 శాతానికి తీసుకువచ్చాం), సుంకాలేతర అవరోధాలను తొలగించాం. ‘సుంకాలు, వాణిజ్య సాధారణ ఒప్పందం’ (జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్)పై సంతకం చేసి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ)లో సభ్య దేశంగా చేరాం. వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఆర్థిక వ్యవస్థ అనేది ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉండే బహిరంగ ఆర్థిక వ్యవస్థగా ఉండాలనే యథార్థాన్ని భారతీయులు అంగీకరించారని ఆత్మవిశ్వాసంతో చెప్పగలం.
దిగ్భ్రాంతికరమైన విషయమేమిటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు బహిరంగ ఆర్థిక వ్యవస్థలుగా మార్పు చెందుతుండగా స్వేచ్ఛా వాణిజ్యానికి ఆద్యులు అయిన అభివృద్ధి చెందిన దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల ‘సంరక్షణ’ విధానాలకు మళ్లాయి. ఈ విషయంలో అమెరికా పథనిర్దేశం చేసింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఆ దేశం ఈ విషయంలో మరింత ముందంజ వేసింది. తాత్కాలిక సంక్షోభాన్ని నివారించేందుకు ‘సంరక్షణ’ చర్యలు చేపట్టడాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ‘సంరక్షణవాదం’ను అధికారిక ఆర్థిక విధానంగా మార్చుకోవడాన్ని ఎలా చూడాలి? భారీ సుంకాలు విధించడమే ట్రంప్ అభిమతం. అందుకు ఆయన ఎవరికీ ఎటువంటి సంజాయిషీ ఇవ్వరు. అపారదర్శక టారిఫేతర చర్యలకు పూర్తిగా అనుకూలుడు. అంతేనా? దిగుమతులను ఆయనెంతగానో నిరుత్సాహపరుస్తున్నారు, పనిగట్టుకుని ప్రతి దేశంతో వాణిజ్య సమతౌల్యతను సాధించేందుకు ఆరాటపడుతున్నారు. అమెరికన్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను అమెరికాలోనే నెలకొల్పుకోవాలి, అమెరికాయేతర దేశాలలో వాటిని నిర్వహించకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. తన ఆకాంక్షలను తాను విధించే సుంకాలు నెరవేరుస్తాయని ట్రంప్ విశ్వసిస్తున్నారు.
అమెరికన్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను మళ్లీ స్వదేశానికి తీసుకురావాల్సిందేనని ట్రంప్ గట్టిగా వాదిస్తున్నారు. అలా ‘దేశభక్తి’ చూపని కంపెనీలు అనేక ఆంక్షల నెదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ‘ఇది చేయడం కంటే చెప్పడం తేలిక ’అని హార్వర్డ్ బిజినెస్ రివ్యూ వ్యాఖ్యానించింది, లేదు, నిరసించింది. ‘ఒక వస్తువును ఉత్పత్తి చేయడంలో అనేక ప్రక్రియలు ఉంటాయని, వాటన్నిటినీ ఒకే కంపెనీ చేయగలగడం సాంకేతికతలు సంక్లిష్టమైపోయిన ప్రస్తుత కాలంలో అసాధ్యమని, అందుకు అవసరమైన నైపుణ్యాలను ఒకే ఒక్క ప్రదేశంలో సమీకరించడం అంతకంటే అసాధ్యమని’ ఆ పత్రిక నిష్కర్షగా చెప్పింది. 21వ శతాబ్ది వస్తూత్పత్తి కార్యకలాపాల సంక్లిష్టతలపై ట్రంప్‌కు ప్రాథమిక అవగాహన కూడా లేదని, ఆయన కాలానికి అనుగుణమైన అధునాతన ఆలోచనలు ఉన్న వ్యక్తి కానేకాదని’ అర్థశాస్త్ర విజ్ఞుడు ఒకరు విమర్శించారు. తన లక్ష్యాల సాధనకు సుంకాలను ఆయుధాలుగా ట్రంప్ ఉపయోగించుకుంటున్నారు. తనతో ఏకీభవించి తన షరతులకు అంగీకరించిన ఆస్ట్రేలియా, ఇండోనేసియా, జపాన్, దక్షిణ కొరియా ప్రయోజనాలకు అనుకూలంగాను, తనతో విభేదించిన కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, బ్రెజిల్ ప్రయోజనాలకు ప్రతికూలంగాను ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు జరిమానాతో సహా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. ట్రంప్ సుంకాలపై ఆవశ్యక చర్యలు చేపడతామని న్యూఢిల్లీ ప్రతిస్పందించింది.
భారత్ లోబడదు, మోకరిల్లదు అనేది స్పష్టం. ధిక్కరించాల్సిన అవసరం కూడా భారత్‌కు లేదు చర్చల ప్రక్రియ ఎంత సుదీర్ఘమూ, బాధాకరమైనా సుంకాలపై సంప్రతింపులకు మనం మన సుముఖతను స్పష్టంగా ప్రకటించాలి. ట్రంప్ తన సుంకాల విధానంపై పునరాలోచన చేసేలా ఆర్థిక సూత్రాలు ఆయనను బలవంతం చేస్తాయి, సందేహం లేదు. అమెరికా ప్రజలు నిత్యం వినియోగించుకునే వందలాది వస్తువులు, సేవలపై అధిక సుంకాలతో ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుంది. అమెరికన్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను స్వదేశానికి తీసుకురావడంలో తాత్సారం చేస్తాయి. అమెరికాలో ఉద్యోగాలు పెరగవు. అనివార్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగిస్తుంది. 2026లో కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికలు ట్రంప్ దురహంకారానికి మంగళం పాడే అవకాశం ఎంతైనా ఉన్నది.
ఏ దేశమైనా మరొక దేశానికి లోబడినా, మోకరిల్లినా, అనుగ్రహానికి ప్రాకులాడినా ఆ దేశం అనివార్యంగా మట్టికరుస్తుంది, సందేహం లేదు. విదేశీ సంబంధాలలో మొదటి పాఠమిది. డోనాల్డ్ ట్రంప్‌తో దోస్తీ చేయడంలో నరేంద్ర మోదీ ఈ కఠోర రాజనీతిని మరచిపోయారు. అదృష్టవశాత్తు ట్రంప్ తెంపరితనాన్ని మోదీ ప్రతిఘటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇది నాకూ, ప్రతి భారతీయునికీ చాలా సంతోషకరమైన పరిణామం. భారత్ కొండలా నిలబడుతుంది, తన ప్రయోజనాలను కాపాడుకుంటుందని వాషింగ్టన్‌కు ఎటువంటి శషబిషలకు తావు లేకుండా న్యూఢిల్లీ స్పష్టం చేయాలి. భారత్ అన్నిటా న్యాయబద్ధంగా ఉంటుంది, న్యాయమైన వాణిజ్యాన్నే చేస్తుంది. పరస్పర లాభదాయకమైన వాణిజ్యానికై సంప్రదింపులు జరిపేందుకు, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సంసిద్ధంగా ఉన్నామని అమెరికాకు తెలియజేయాలి. ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కోవలసివచ్చినా భారత్ సదా సదరు బాటలోనే సుస్థిరంగా ముందుకు సాగుతుంది. ఇది ప్రతి భారతీయుని మాట, ప్రధాని మోదీ అనుసరించే బాట.
-పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)