Trump Warns Putin: ట్రంప్ కొత్త ఎత్తు..
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:08 AM
మరో యాభైరోజుల్లోగా ఉక్రెయిన్‌మీద దాడులు ఆపనిపక్షంలో భారీ సుంకాలతో ఊపిరాడనివ్వబోనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మహా గట్టిగా హెచ్చరించారు.
మరో యాభైరోజుల్లోగా ఉక్రెయిన్‌మీద దాడులు ఆపనిపక్షంలో భారీ సుంకాలతో ఊపిరాడనివ్వబోనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మహా గట్టిగా హెచ్చరించారు. మరో నెలన్నరపాటు ఎంచక్కా ఉక్రెయిన్‌ను బాదేసుకోవచ్చునని పుతిన్‌కు ట్రంప్ అవకాశమిచ్చారంటూ కొందరు దీనిని నిర్వచిస్తున్నారు. గడువు తరువాత రష్యాకు ఏమి జరగబోతున్నదో అటుంచితే, ఈ వేసవి నెలలను చక్కగా వాడుకొని భయానక దాడులతో పుతిన్ కోరుకుంటున్న ఉక్రెయిన్ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికే ట్రంప్ ఈ అవకాశం ఇచ్చారని వారి వాదన.
గడువులోగా రష్యా తన యుద్ధాన్ని ఆపనిపక్షంలో మహా అయితే ఐదువందలశాతం సుంకాలతో రష్యాను ట్రంప్ శిక్షిస్తారంతే. రష్యానుంచి దిగుమతులు చేసుకొనే దేశాలు కూడా ట్రంప్ ఆగ్రహానికి అంతే స్థాయిలో బలికావాల్సి రావచ్చు. అంతవరకూ ఉక్రెయిన్ పౌరుల మీద యధేచ్ఛగా దాడులు చేసుకోవచ్చునని ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రష్యాకు అనిపిస్తున్నది. మాకే హెచ్చరికలు చేస్తావా అంటూ రష్యా పెద్దలు ఆగ్రహాన్ని నటిస్తున్నా, లోలోపల సంతోషిస్తున్నారట. ట్రంప్ తలుచుకుంటే ఈ హెచ్చరికలు చేసిన క్షణం నుంచే ఆంక్షలు అమలుచేయవచ్చును, సుంకాలు వెయ్యిరెట్లు విధించవచ్చును. కానీ, ఉక్రెయిన్‌కు మూడుదిక్కుల్లో ఉన్న కీలకప్రాంతాలు కొన్నింటిని రష్యా గెలుచుకొనేందుకు ఈ గడువు ఉపకరిస్తుంది. ఇప్పటికే రష్యామీద అత్యధికస్థాయి ఆంక్షలున్నందున, ట్రంప్ కొత్తగా దాని పీకనొక్కేదేమీ ఉండదు. ఆంక్షలతో రష్యాను దారికితేవడం అసాధ్యమన్నది కూడా ఇప్పటికే రుజువైంది. ఎన్ని ఆంక్షలున్నా చక్కగా చమురు అమ్ముకొని బతుకుతోంది, యుద్ధం బలంగా సాగిస్తోంది. ఒకవేళ ఈ యాభైరోజుల గడువులోగా పుతిన్ అనుకున్నది చేయలేనిపక్షంలో, దానిని సడలించడానికీ, పెంచడానికీ ట్రంప్ సిద్ధంగా ఉంటారని గిట్టనివాళ్ళ వాదన.
గడువు సంగతి అటుంచితే, పేట్రియాటిక్ వ్యవస్థ సహా అధునాతన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందివ్వాలన్న ట్రంప్ నిర్ణయం మాస్కోను ఇబ్బందుల్లో పడవేసేదే. రోజూ రాజధాని సహా ఉక్రెయిన్ నగరాలను దాడులతో దడదడలాడిస్తున్న రష్యాకు ఇకపై అది సులభం కాబోదు. ట్రంప్ నిజంగా శాంతిని కోరుకోవడం లేదని, పైకి అలా మాట్లాడుతూ, యుద్ధాన్ని కొనసాగించదల్చుకున్నాడని రష్యా నాయకులు ఘాటుగా విమర్శలు చేస్తున్నది అందుకే. ఉక్రెయిన్‌కు నిరవధికంగా ఆయుధాలు అందిస్తే, ఎట్టకేలకు మాస్కో దిగివస్తుందన్న భ్రమతో మూడున్నరేళ్ళు బైడెన్ వ్యవహరించారని, ఇప్పుడు ట్రంప్ కూడా అదేబాటలో నడుస్తున్నాడని రష్యా నాయకుల విమర్శ. కానీ, రోజూ వందలాది మిసైల్, డ్రోన్‌దాడులను ఎందుర్కొంటున్న ఉక్రెయిన్‌కు క్షిపణి రక్షణవ్యవస్థలు అందినందువల్ల కాస్త ఊపిరితీసుకోగలుగుతుంది. మూడువందల కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలిగే మిసైళ్ళ వాడకానికి కూడా ట్రంప్ అనుమతించినపక్షంలో రష్యా సైనిక స్థావరాలకు, ఆయుధాగారాలకు భారీ నష్టాలు జరగవచ్చు.
ఇప్పుడు దాదాపు పదిబిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను నాటో దేశాలకు విక్రయించి, ఉక్రెయిన్‌కు అందించడం ద్వారా ట్రంప్ తన చేతికి మట్టి అంటకుండా జాగ్రత్తపడ్డారు. నేరుగా ఆయుధాలు అమ్మకుండా, రాబోయే నోబెల్‌కు ఇలా అడ్డం లేకుండా చూసుకుంటున్నారన్న ఆక్షేపణలను అటుంచితే, ఒకపక్క రష్యాకు నెలన్నర గడువు ఇవ్వడం, మరోపక్క పాశ్చాత్య దేశాలతో ఆయుధ వ్యాపారం చేసి ఖజానాను నింపుకోవడం ద్వారా ట్రంప్ కొత్త వ్యూహానికి దారులు తెరిచారు. యుద్ధానికి కారకుడివి నువ్వేనంటూ గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిని తీవ్రంగా తప్పుబట్టి, ఓవల్ ఆఫీసులో కూడా ఘోరంగా అవమానించిన ట్రంప్ పుతిన్ విషయంలో మాత్రం స్పష్టమైన సానుకూలతతో వ్యవహరిస్తూ వచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన ఇరవైనాలుగుగంటల్లోనే ఈ యుద్ధాన్ని ఆపేయగలనని నమ్మిన ట్రంప్‌కు పుతిన్ ఎంతకూ లొంగిరావడం లేదు. కనీసం అరడజను సార్లు గట్టి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇది ట్రంప్‌కు అవమానాన్ని కలిగించివుండవచ్చు. ఇప్పుడు ఉద్రిక్తతలను పెంచి, ఉపశమనాన్ని సాధించగలనని ఆయన నమ్ముతున్నట్టు ఉంది. ఈ ఎత్తుగడ ఫలిస్తే నోబెల్‌శాంతి దక్కవచ్చునన్న ఆశ ఆయనలో ఉన్నా కూడా తప్పులేదు.