Share News

ట్రంప్‌ తెచ్చిన సుంకాల సంకటం

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:45 AM

అమెరికా నూతన సుంకాల విధానం బలవంతుడు, బలహీనుడు అనే సహేతుకత లేకుండా కొనసాగుతుండగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్ళకు గురవుతోంది. ఇది ఒక రకంగా అగ్రరాజ్యం ప్రారంభించిన...

ట్రంప్‌ తెచ్చిన  సుంకాల సంకటం

అమెరికా నూతన సుంకాల విధానం బలవంతుడు, బలహీనుడు అనే సహేతుకత లేకుండా కొనసాగుతుండగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్ళకు గురవుతోంది. ఇది ఒక రకంగా అగ్రరాజ్యం ప్రారంభించిన వాణిజ్య యుద్ధం. కొన్ని దేశాలు ప్రతీకార సుంకాలతో ఎదురుదాడి చేస్తుండగా మరికొన్ని దేశాలు అనిశ్చిత స్ధితిలో ఉన్నాయి. భారత్ మాత్రం బహిరంగ ఆవేశానికి లోనుకాకుండ వ్యూహాత్మక మౌనంతో వ్యవహరిస్తూ స్వీయ ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది.

అమెరికాలో నూతన సుంకాలు అమలులోకి వచ్చిన రోజు వ్యూహాత్మకంగా పార్లమెంటులో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా సుంకాల ప్రస్తావన బహిరంగ చర్చ కాకుండా కేంద్రం కట్టడి చేసింది. అమెరికాతో చర్చల సారాంశం ఎక్కడా వెల్లడవకుండా జాగ్రత్త పడుతున్నారు.


అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రపంచ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భారత్‌లో చమురు, వ్యవసాయ రంగాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై వాటి ప్రభావం ఉంటుంది. భారత్‌తో సహా వివిధ దేశాలతో తన వాణిజ్యలోటును భర్తీ చేసుకోవడం అమెరికా లక్ష్యం. ఇందుకు తన వద్ద ఉన్న చమురు, సహజ వాయువును భారత్‌తో సహా ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అమెరికా కసరత్తు చేస్తోంది. అగ్రరాజ్యం నుంచి చమురు దిగుమమతులను పెంచుకోవాలంటే సంప్రదాయ చమురు ఉత్పత్తి దేశాల నుంచి దిగుమతులు తగ్గించుకోవాలి. అయితే మన ప్రవాస కార్మికుల ఉపాధి, ఇతర వాణిజ్య అవసరాలు దృష్ట్యా గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవడం అంత సులువు కాదు. ఇప్పటికే భారత్‌లో తమ ఎగుమతులను పెంచుకోవడానికి గల్ఫ్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపాదిత రిఫైనరీ నిల్వ సామర్థ్యానికి మూడింతలు ఎక్కువగా తమకు చమురు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇస్తే పెట్టుబడులు పెడుతామని గల్ఫ్ దేశాలు షరతు విధిస్తున్నట్టు సమాచారం. ఇదిలావుండగా భారత చమురు విపణిలో తమకు మరింత వాటా కావాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది.


నేరుగా ఒక్క అమెరికా ఎగుమతులపైనే కాకుండ అమెరికా సుంకాల వలన ప్రభావితమయ్యే ఇతర దేశాలకు జరిగే భారతీయ ఎగుమతులపై కూడా సుంకాల తాకిడి ఉంటుంది. ఇది ఎంత అనేది ఇప్పుడే కచ్చితంగా అంచనా వేయడం కష్టం. భారత వ్యవసాయ రంగంపై 26 శాతం పన్నులు విధింపును అమెరికా తాత్కలికంగా వాయిదా వేసుకున్నది. దీనివల్ల పరస్పర చర్చలకు దారి సుగమమయింది. అమెరికాతో బుజ్జగింపు చర్యలలో భాగంగా కొన్ని రంగాలను కాపాడుకోవడానికి మరికొన్నింటిని అనివార్యంగా బలిపీఠం ఎక్కించవల్సి వస్తుంది. అమెరికా మద్యం లేదా మోటర్ సైకిళ్ళు మొదలైన విలాస వస్తువులపై సుంకాలు తగ్గించడం వల్ల సామాన్యులకు సమస్య ఉండదు. అయితే కీలకమైన ఆహార ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయిక ఉత్పత్తుల విక్రయ రంగంలో అడుగుపెట్టడానికి అమెరికా దశాబ్దాలుగా కలలు కంటోంది. భారతీయ విపణిలో ప్రవేశానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. సువిశాల భారతీయ వ్యవసాయక రంగంపై అమెరికా ఏనాటి నుంచో కన్నేసి ఉన్నది. అయితే పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలన్నీ కీలకమైన వ్యవసాయరంగం, దాని అనుబంధ మత్స్య, కోళ్ళ పరిశ్రమ రంగాలను కాపాడుకుంటూ వస్తున్నాయి. అమెరికా వ్యవసాయిక ఉత్పత్తులపై మనం 39 నుండి 65 శాతం సుంకాలు విధిస్తుండగా అదే అమెరికా మన దేశ దిగుమతులపై 4–5 శాతం మాత్రమే సుంకాలు విధిస్తోంది. ఇప్పుడు పరిస్ధితి మార్పు తథ్యమనిపిస్తోంది. దౌత్యపరమైన ఇచ్చిపుచ్చుకునే విధానంలో కొన్నిసార్లు మినహాయింపులు ఇవ్వడం జరుగుతోంది. భారీ భూకమతాలు, జన్యుమార్పిడితో అధిక దిగుబడులు సాధించే అమెరికాతో, వాతావరణాన్ని విశ్వసించి వ్యవసాయం చేస్తూ జీవనోపాధి కల్పించే ఇతర దేశాలు పోటీపడడం అంత సులువు ఏమీ కాదు. కీలకమైన వ్యవసాయ రంగంలో రైతులను విస్మరించి కార్పొరేటీకరణ కేంద్రీకృత వ్యవసాయ విధానం అమలు చేయాలని చూస్తే జరిగేదేమిటి? ప్రస్తుతం బియ్యం పరిస్ధితిని చూస్తే అర్థమవుతుంది. పండించే రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అలాగని అధిక ధరలు, తరుచుగా మారుతున్న వంగడాల వలన వినియోగదారులకు ఇబ్బంది ఎదురవుతోంది. పౌల్ట్రీ రంగంలోనూ అమెరికా అగ్రగామే. దాని ధాటికి ఇతర దేశాలు తట్టుకోవడం కష్టం. భారతీయ పౌల్ట్రీ రంగంలో అమెరికా అడుగు పెట్టకుండా ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చాల కాలంగా కృషి చేసి అమెరికాను నిలువరించగలిగారు. అయినా చివరకు అమెరికా కోడి కాళ్ళ దిగుమతులను అడ్డుకోలేకపోయారు. భారతీయ కోళ్ళ పరిశ్రమలో దేశంలోని అగ్ర రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉందనే విషయాన్ని విస్మరించరాదు.


కోడి కాళ్ళు కాకుండ మొత్తం కోడిని భారత్‌కు ఎగుమతి చేయడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో అమెరికా సఫలీకృతమైతే భారతీయ పౌల్ట్రీ రంగం మనుగడ కష్టమవుతుంది. ఇప్పుడు సుంకాల చర్చలలో అమెరికాను చల్లబర్చడానికి పౌల్ట్రీ రంగంలో అగ్రరాజ్యాన్ని తక్కువ సుంకాలతో అనుమతించే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల విషయానికి వస్తే, రొయ్యలు అగ్రగామి. వీటిపై అమెరికా హెచ్చించిన సుంకాలు తాత్కలికంగా వాయిదా వేసింది కానీ పూర్తిగా రద్దు చేయలేదు. మన దేశం నుంచి అమెరికాతో పాటు విదేశాలకు రొయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉంది. అమెరికా సుంకాలతో ఆంధ్ర రొయ్యల సేద్యంపై ప్రతికూల ప్రభావం పడే ఆవకాశాలున్నాయి. మరో మూడు నెలలు కాదు కానీ ఒక సంవత్సరం తర్వాత ట్రంప్ సుంకాల ప్రభావం ఒక్కొక్కటిగా భారత్‌తో పాటు యావత్తు ప్రపంచానికి తెలిసి వస్తుంది. అయితే అప్పటికి చాలా నష్టం సంభవించడం ఖాయం.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి:

Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..

MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

Updated Date - Apr 16 , 2025 | 05:45 AM