India, US Relations 2025: ఆ నాటి చెలిమి ఒక కల..
ABN , Publish Date - May 31 , 2025 | 01:10 AM
2024-25లో డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య ఉన్న స్నేహం రాజకీయ, వ్యాపార, భూభౌతిక పరిస్థితుల కారణంగా సంక్లిష్టమైంది. యుద్ధ విరమణకు ట్రంప్ చేసిన మధ్యవర్తిత్వం మిగిలిన సంబంధాల్లో అస్పష్టతలను పుట్టించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 2024లో ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు : ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్లాదకరమైన వ్యక్తి, మంచి స్నేహపాత్రుడు’ అని మెచ్చుకున్నారు. ఫిబ్రవరి 2025లో వైట్ హౌజ్‌లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన మోదీ ఇలా చెప్పారు : ‘సంపద్వంతమైన భారత్ నిర్మాణానికి మా దార్శనికత ‘మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్’ (మిగా). అమెరికా, ఇండియా కలిసికట్టుగా ముందుకు సాగితే అంటే మగా ప్లస్ మిగా మెగా అవుతుంది. సంపద్వృద్ధిలో మా రెండు దేశాలు గొప్ప భాగస్వాములు’. ఇండియా ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడు ఇరువురూ వినయంలేని మొండి పాఠశాల బాలల్లా అందరినీ ఆకట్టుకున్నారు. మరి ఇప్పుడు మోదీ, ట్రంప్‌ల మధ్య వర్ధిల్లిన ఆ దోస్తీ ఏమయింది? స్నేహోల్లాసం సెలవు తీసుకుందా? సరసత సమసి పోయిందా? మే 7, 2025 నుంచి మోదీ, ట్రంప్ పరస్పరం మాట్లాడుకోవడం లేదని నాకు విశ్వసనీయంగా తెలిసింది. మనకు తెలిసిందల్లా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో మే 9 రాత్రి మోదీతో ఫోన్‌లో మంతనాలు జరిపారని, యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని ఇరువురూ ప్రధానమంత్రిని కోరారు. ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ సంభాషణల గురించి పరోక్షంగా సూచించారు. ‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చల తరువాత, భారత్, పాకిస్థాన్‌లు తక్షణమే కాల్పుల విరమణను సంపూర్ణంగా పాటించేందుకు అంగీకరించాయని ప్రకటించడానికి చాలా సంతోషిస్తున్నాను’. మే 10 సాయంత్రం 5.25 గంటలకు వెలువడిన ట్రంప్ ప్రకటన భారతీయులను వాస్తవ పరిస్థితులకు మొరటుగా జాగరూకం చేసింది. ట్రంప్ దబాయించలేదు మే 10 సాయంత్రం 3.35 గంటలకు కాల్పుల విరమణకు ఉభయ దేశాలు అంగీకరించాయి.అది ఆ సాయంత్రం 5.00 గంటల నుంచి అమలులోకి వచ్చంది. మందహాసం చేయలేని మన విదేశాంగ శాఖ కార్యదర్శి అదే సాయంత్రం 6 గంటలకు ఈ వాస్తవాలను ధ్రువీకరించారు. (తీవ్ర బెదిరింపులతో కానప్పటికీ) తమ మధ్యవర్తిత్వం కారణంగా కాల్పల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా ఎలా చెప్పుకుంటుంది, ఎందుకు చెప్పుకుంటుంది అన్న విషయాన్ని నిశితంగా శోధించడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను.
సహేతుకమైన కారణాలు అనేకమున్నాయి. నాలుగు రోజుల యుద్ధం జరిగిన తీరుతెన్నులు నిశితంగా చూడండి. మే 7న అల్గోరిథమ్ ఆధారిత యుద్ధాల యుగంలోకి భారత్ ప్రవేశించింది. ఒక్క సైనికుడూ భూసరిహద్దును కానీ, నియంత్రణరేఖను కానీ దాటలేదు. ఏ విమానమూ శత్రు వాయుతలంలోకి ప్రవేశించలేదు. ప్రధానాయుధాలు మిస్సైళ్లు, సాయుధ డ్రోన్‌లు తొట్ట తొలుత యుద్ధంలోకి ప్రవేశించిన భారత్‌కు సహజంగానే అనుకూలతలు ఉన్నాయి. మే 7–9 తేదీల మధ్య పాకిస్థాన్‌కు భారీనష్టాన్ని కలిగించింది. ఆ విజయోత్సవ వేళ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ జోక్యం చేసుకున్నారు. ‘ఆహ్లాద కరమైన స్నేహపాత్రుడు’తో మిత్రత్వాన్ని ఆయన పక్కన పెట్టేశారు. యుద్ధానికి తక్షణమే స్వస్తి చెప్పాలని గట్టిగానే బెదిరించారు ఇండియా నిరసనలను కొట్టివేశారు. సౌదీ అరేబియా, ఖతార్ పర్యటనల్లో కూడా తన మధ్యవర్తిత్వం, యుద్ధాన్ని నిలిపివేయకపోతే ఇంకెంత మాత్రం వాణిజ్యం చేయబోమని హెచ్చరించడం వల్లే కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యమయిందని ఆయన పదే పదే ప్రకటించారు. ట్రంప్ ఏమి చెప్పుతున్నప్పటికీ క్రమేపీ నెమ్మదిగా సత్యం స్పష్టమవుతూ వస్తోంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య నాలుగు రోజుల సాయుధ సంఘర్షణల్లో ట్రంప్ జోక్యం వెనుక ఆయన కుటుంబ వాణిజ్య ప్రయోజనాలే ప్రధాన ప్రేరణగా ఉన్నాయన్నదే ఆ సత్యం. ట్రంప్ కుటుంబ క్రిప్టో కరెన్సీ కంపెనీ ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్సియల్’ (డబ్ల్యుఎల్‌ఎఫ్) పాకిస్థాన్‌తో సంప్రతింపులు జరిపింది. పహల్గాం ఉగ్ర ఘాతుకం చోటుచేసుకుని నాలుగు రోజులు కూడా గడవక ముందే ఏప్రిల్ 26న డబ్ల్యుఎల్‌ఎఫ్ ప్రతినిధులు పాక్ ప్రధానమంత్రి, సైనిక దళాల ప్రధానాధికారితో చర్చలు జరిపి పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మే మొదటివారంలో సాయుధ సంఘర్షణలు ప్రారంభమై తీవ్రమవడంతో ఈ వివాదంలో జోక్యం చేసుకోకూడదన్న తన తొలి వైఖరిని ట్రంప్ విడనాడారు. మే 7 తరువాత ఉధృతంగా ప్రారంభమైన మధ్యవర్తిత్వ కార్యకలాపాలు ట్రంప్ చెప్పినట్లు ఆయన నిర్ణయాత్మక ప్రమేయంతో ముగిసాయి. డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య దోస్తీ ఉన్నప్పటికీ అమెరికా ప్రభుత్వం భారతీయ అక్రమ వలసకారులను చేతులకు బేడీలు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి స్వదేశానికి తిరిగి పంపించివేసింది.
ఈ అవమానకరమైన చర్య పట్ల అసమ్మతి తెలుపుతూ ప్రధాని మోదీ ఒక్క మాటైనా మాట్లాడారా? లేదు. భారత్ నుంచి దిగుమతులపై ట్రంప్ భారీ సుంకాలు విధించారు. ప్రధానమంత్రి రవ్వంత మాటతోనైనా ఆక్షేపించారా? లేదు, లేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి రుణం విషయంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా అమెరికా ఓటు వేసింది.న్యూఢిల్లీ ఏమి చేసింది? ఏమీ లేదు. భారతీయులతో సహా విదేశీ విద్యార్థులు అందరినీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించారు. భారత్ ప్రతిస్పందన మౌనమే కాదూ? అమెరికాలోని భారతీయ విద్యార్థులు వీసాల రద్దు ముప్పునెదుర్కొంటున్నారు. భారత ప్రభుత్వం వారికి బాసటగా మాట్లాడిందా? లేదు. విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశారు. నిరసనగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ట్రంప్–మోదీ దోస్తీ ఏమయింది? అంతా గందరగోళంలోకి జారిపోయింది. భారత ప్రధానమంత్రి ఇంకెంత మాత్రం అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడితో వ్యవహరించడం లేదు. పాకిస్థాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న వందల కోట్ల డాలర్ల డబ్ల్యుఎల్‌ఎఫ్‌కి యజమానిగా ఉన్న ఒక కుటుంబ పెద్దతో ప్రధాని మోదీ బేరాలు ఆడుతున్నారు. స్వప్రయోజనాలకు తన సర్వాధికారాలు, ఆర్థిక వనరులను వినియోగించేందుకు ఏ మాత్రం సంకోచించని POTUS (ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్)తో భారత ప్రధానమంత్రి వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు సమస్త భారతీయులు ముక్తకంఠంతో మద్దతు తెలిపారు. కటువైన మాటలతో పాకిస్థాన్‌కు తీవ్రహెచ్చరికలు చేసిన ప్రధాని మోదీ ట్రంప్ మహాశయుడి దౌత్య రాజకీయానికి నిజంగానే అమిత కలవరపాటుకు గురయ్యారు. పాకిస్థాన్ ఇంకెంత మాత్రం తేలిగ్గా లొంగిపోయే శక్తి కాదు. దానికి చైనా సైనిక మద్దతు, అమెరికా దౌత్య మద్దతు ఉన్నది. ఇండియా ఇప్పుడు తన సైనిక వ్యూహాన్ని సరికొత్తగా రూపకల్పన చేసుకోవాలి. అంతే కాదు తన అమెరికా విధానాన్ని కూడా మళ్లీ కొత్తగా రూపొందించుకోవాలి. ఇవి మూలమట్టుగా జరగాలి.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)