Share News

Immigration Agenda: వలసలపై కక్ష

ABN , Publish Date - Jun 18 , 2025 | 02:20 AM

అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగనంతమంది అక్రమవలసదారులను దేశంనుంచి వెళ్ళగొడతానని ఎన్నికలప్రచారంలో తన ఓటర్లకు హామీ ఇచ్చారు డోనాల్డ్‌ ట్రంప్‌. అందుకు అనుగుణంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదమవుతున్నాయి.

Immigration Agenda: వలసలపై కక్ష

మెరికా చరిత్రలో కనీవినీ ఎరుగనంతమంది అక్రమవలసదారులను దేశంనుంచి వెళ్ళగొడతానని ఎన్నికలప్రచారంలో తన ఓటర్లకు హామీ ఇచ్చారు డోనాల్డ్‌ ట్రంప్‌. అందుకు అనుగుణంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదమవుతున్నాయి. ఒకవైపు కవాతు, మరోవైపు అణచివేత, మధ్యలో పుట్టినరోజు అంటూ ఒక పత్రిక మొన్న శనివారం నాడు అమెరికాలో నెలకొన్న పరిస్థితిని చక్కగా అభివర్ణించింది. ఆర్మీ 250వ వార్షికోత్సవం, ట్రంప్‌ పుట్టినరోజు కూడా ఆనాడే కావడంతో అమెరికా వ్యాప్తంగా భారీ నిరసనలతో ‘నో కింగ్స్‌’ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకుపోవాలని నిరసనకారులు నిర్ణయించడంతో, ఊహించినట్టుగానే ప్రదర్శనలు హింసాయుతంగా మారాయి. యాభై రాష్ట్రాల్లోని రెండువేల పైచిలుకు ప్రాంతాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో లక్షలాదిమంది పాల్గొన్నారు. వీధులు, పార్కులు, బహిరంగస్థలాలు అన్ని చోట్లా జనం నిండిపోయారని, మహానగరాల నుంచి చిన్నపట్టణాల వరకూ జనం ర్యాలీలు నిర్వహించి, అద్భుతమైన నినాదాలతో ట్రంప్‌ నిరంకుశత్వాన్ని చీల్చిచెండాడారని వార్తలు వచ్చాయి. నిరంకుశత్వం కూడదన్న హెచ్చరికతో పాటు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని, తమ వలసహక్కులను కాపాడుకుంటామని వారంతా ప్రతిజ్ఞలు చేశారు. ఆ ఒక్కరోజే ఒక కోటి ఇరవైలక్షల మంది నిరసనల్లో పాల్గొనడంతో ట్రంప్‌ దిగొచ్చేవరకూ ఈ తరహా ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని నో కింగ్స్‌ కొయిలిషన్‌ నిర్వాహకులు ఉత్సాహంగా ప్రకటించారు. ట్రంప్‌ సహజంగానే ఈ తిరుగుబాటును సహించలేకపోయారు. తలెగరేసినవారినందరినీ కటకటాల్లోకి తోసేయాలనీ, ట్రంప్‌ మస్ట్‌ గో అన్న ప్రతీ వ్యక్తినీ దేశం నుంచి గెంటేయాలని ఆయన సంకల్పించారు. ఈ భారీ నిరసన ప్రదర్శన జరిగిన మర్నాడే అమెరికా అధ్యక్షుడు తన ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు విస్పష్టమైన ఆదేశాలు జారీచేస్తూ, విపక్షంమీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోడ్లమీదకు వచ్చి, తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన, తన విధానాలను ప్రశ్నించినవారంతా డెమోక్రాటిక్‌ పార్టీ ఓటర్లనీ, కోట్లాదిమంది అక్రమవలసదారులను వెనకేసుకొస్తూ ఆ పార్టీ అమెరికా రాజకీయాల్లో బతుకునెట్టుకొస్తోందని ట్రంప్‌ విమర్శించారు. నికార్సయిన అమెరికన్ల కష్టార్జితాన్ని కొల్లగొడుతూ, శ్రమకు వెరవని అమెరికన్ల ఉద్యోగాలను తన్నుకుపోతూ, ప్రభుత్వ సంక్షేమ నిధులను పూర్తిగా స్వాహాచేస్తున్న విదేశీశక్తులంటూ తీవ్రంగా శపించారాయన. వారిని ఏరివేస్తున్నందుకు, అమెరికాను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు జల్లెడపడుతున్నందుకు అసలు సిసలు అమెరికన్లు ఆనందిస్తున్నారని, జేజేలు పలుకుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.


తదనుగుణంగా ఆయన ఇప్పుడు డెమెక్రాట్ల ఏలుబడిలో ఉన్న న్యూయార్క్‌ తదితర నగరాల నుంచి అక్రమవలసదారుల ఏరివేతకు అగ్రప్రాధాన్యం ప్రకటించారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ ఏంజెలెస్‌ నగరంలో ఈ మధ్యన ఎదురైన ప్రతిఘటన వలసదారులకు ఒక కొత్త ఉత్తేజాన్నిస్తే, ట్రంప్‌కు ఆయుధంగా ఉపకరించిన విషయం తెలిసిందే. ఆరున్నర దశాబ్దాల తరువాత ఆ రాష్ట్రం అనుమతి లేకుండా కేంద్ర బలగాలను అక్కడకు పంపి, డెమోక్రాటిక్‌ పార్టీని ఆయన రెచ్చగొట్టారు. ఆ నిర్ణయాన్ని ప్రశ్నించిన గవర్నర్‌ను జైల్లోకి నెడతానని, నిధులు ఆపేస్తానని హెచ్చరించారు. కాలిఫోర్నియానుంచి ఫెడరల్‌ గవర్నమెంట్‌కు వెళ్ళే నిధులను నేను ఆపేస్తానంటూ ఆ రాష్ట్ర గవర్నర్‌ దీటుగా సమాధానం ఇచ్చారు. ఈ అత్యంత ధనిక రాష్ట్రంలో వలసలు కూడా అధికంగానే ఉండటంతో అధ్యక్షుడికీ విపక్షాలకూ మధ్య యుద్ధానికి ఇది కేంద్రస్థానమైంది. అత్యాధునిక ఆయుధాలతో ఫెడరల్‌ సైన్యాలు లాస్‌ ఏంజెలెస్‌ నగరంలో తిరుగుతున్న దృశ్యాలను దేశమంతటా చూడాలని ట్రంప్‌ కోరిక. విదేశీచొరబాటుశక్తుల నుంచి తన ప్రజలను కాపాడటానికి న్యాయస్థానాల్లో పోరాడుతానని, ఎన్ని చట్టాలనైనా ఉల్లంఘిస్తానని ఆయన ప్రకటిస్తున్నారు. పూర్వ అధ్యక్షులు ఎన్నడూ వాడని చట్టాలను సైతం వెలికితీసి తన రాజకీయ ప్రయోజనాల కోసం అస్త్రాలుగా మలచడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు ఇత్యాది విలువలమీద నమ్మకం లేదు కనుక, అక్రమవలసదారుల ఏరివేత కార్యక్రమాన్ని ఎంత నిరంకుశంగానైనా అమలు చేయగలడు. ఎంతమందిని ఏరివేశామన్నకంటే, ఆ ప్రక్రియ తన ఓటుబ్యాంకును ఎంత పెంచిందనేది ఆయనకు ముఖ్యం.

Updated Date - Jun 18 , 2025 | 02:25 AM