Share News

Varakavula Narahari Raju: పద్యనాటకంలో పాలమూరు ఝరి

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:04 AM

బస్సు చక్రాలు పల్లెలకు పరిచయం లేని కాలంలో ఎడ్లబండ్లపై నాటక సమాజాన్ని తరలించి గ్రామాలకు రంగస్థలాన్ని ఆయన పరిచయం చేశారు.

Varakavula Narahari Raju: పద్యనాటకంలో పాలమూరు ఝరి

స్సు చక్రాలు పల్లెలకు పరిచయం లేని కాలంలో ఎడ్లబండ్లపై నాటక సమాజాన్ని తరలించి గ్రామాలకు రంగస్థలాన్ని ఆయన పరిచయం చేశారు. నాటకమే జీవితంగా నడయాడి హార్మోనియం మెట్లపై పద్యరాగాలను శ్వాసిస్తూ అర్ధ శతాబ్ది పాటు దక్షిణ తెలంగాణ నాటక రంగాన్ని చకచ్చకితం చేసిన సరస్వతీ వరప్రసాదుడు వరకవుల నరహరిరాజు. నాటకాలు రాయడంతో పాటు, పద్యాలకు రాగాల సొబగులద్ది, ఎందరో నటులను రంగస్థలానికి పరిచయం చేసిన ఈ నాటక కళాకారుడు జూన్ 20న తన జీవన రంగస్థలం నుండి నిష్క్రమించారు.


నరహరిరాజు 1949లో వీరభద్రరాజు, సుగుణమ్మ దంపతులకు గద్వాలలో జన్మించారు. తండ్రి 1940వ దశకంలో రాయలసీమ ప్రాంతం, అనంతపురం నుండి గద్వాలకు వలస వచ్చి అక్కడి సంస్థానాధీశుల ప్రాపకంలో హరికథ కళాకారుడిగా రాణించారు. స్వాతంత్ర్యానంతరం గద్వాల సంస్థానంలోని కవుల, కళాకారుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిన రోజుల్లో వీరభద్రరాజు మరణించారు. కుటుంబ పోషణకు అన్న సత్యనారాయణరాజు హరికథలను ప్రదర్శిస్తూ తోడుగా తమ్ముడు నరహరిరాజును తీసుకువెళ్ళేవారు. ఇలా బాల్యంలోనే హరికథా కళ పరిచయం కావడంతో నరహరిరాజు తన విద్యాభ్యాసానికి 3వ తరగతిలోనే స్వస్తి చెప్పి హరికథ కళాకారుడిగా, హార్మోనియం వాదకుడిగా రూపొందారు. రెండవ అన్న జగన్నాథరాజు ప్రధాన కథకుడిగా, నరహరిరాజు సంగీతకారుడిగా హరికథలను ప్రదర్శించి వరకవుల ద్వయంగా గుర్తింపు పొందారు. నరహరిరాజు తరగతి గదుల్లో పెద్దగా చదవకపోయినా కవుల సహవాసంతో ప్రబంధకావ్యాలను, భారత, రామాయణాలను, చదివారు. హార్మోనియం సంగీత వాద్యంలో సాధన చేశారు. సాహిత్య అభినివేశం, సరిగమల నైపుణ్యం తదనంతర కాలంలో పద్యనాటకకర్తగా, నాటక సంగీత దర్శకుడిగా రంగస్థలంపై అడుగు మోపేందుకు విశేషంగా దోహదం చేశాయి. 1977లో తొలిసారి కొడంగల్ కేంద్రంగా స్థానిక ఉద్యోగులు పాత్రధారులుగా ‘కృష్ణాంజ నేయ యుద్ధం’ నాటకాన్ని ప్రదర్శించారు. కొడంగల్‌లో కళాశాల అధ్యాపకులుగా ఉన్న కాతోజు వెంకటేశ్వర్లు, శంకర్‌గౌడ్ ఆయన వెన్నంటి నిలిచారు. ఈ ప్రదర్శన విజయవంతం కావడంతో నరహరిరాజు వెనుదిరిగి చూడలేదు. మహబూబ్‌నగర్ జిల్లా డోకూరు గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని ఎందరో ఔత్సాహికులకు పద్యనాటకాలలో శిక్షణనిచ్చి, తన సంగీత దర్శకత్వంలో పలు నాటకాలను ప్రదర్శించారు. ఆయన నిర్దేశకత్వంలో ‘మిత్ర కళానాట్యమండలి’ ప్రభవించి పాలమూరు నాటక రంగ వెలుగులకు పునాది వేసింది. భీమాచారి, వి.నారాయణ, రామలింగయ్య వంటి ఎందరినో పద్యనాటక రంగంలో ఉత్తమ శ్రేణి నటులుగా ఆయన తీర్చిదిద్దారు. ఇదే పరంపరలో వందలాది కళాకారులు ఆయన దగ్గర శిక్షణ పొంది రంగస్థలానికి పరిచయమయ్యారు.


నరహరిరాజు ఒకే పద్యానికి వివిధ రాగాలను సృష్టించడంలో సిద్ధహస్తులు. కళాకారుల స్వర సామర్థ్యానికి తగ్గట్టుగా రాగాలను కూర్చి భావ ప్రాధాన్యం తగ్గకుండా సంగీతాన్ని అందించేవారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ టౌన్ హాలులో ‘కృష్ణాంజనేయ యుద్ధం’ నాటకాన్ని ప్రయోగాత్మకంగా అందించి తనదైన ముద్ర వేశారు. కాతోజు వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో శంకర్‌గౌడ్ కృష్ణుడిగా, విరివింటి పరశురాం ఆంజనేయుడుగా నటిస్తే హృద్యమైన పద్యాలతో, అభినయ ప్రధానంగా సాగిన ఈ నాటకంలో నరహరిరాజు తన సంగీత విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే బలిజేపల్లి లక్ష్మీకాంతం వ్రాసిన ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం ఆయన సంగీత దర్శకత్వంలో నాలుగు దశాబ్దాలపాటు వందలాది ప్రదర్శనలకు నోచుకున్నది. ఇది అతిశయోక్తి కాదు. గయోపాఖ్యానం, శ్రీకృష్ణతులాభారం, శ్రీకృష్ణరాయబారం, చింతామణి, బాలనాగమ్మ, మధుసేవ వంటి పలు ప్రసిద్ధ నాటకాలనూ ఆయన ప్రదర్శించారు. మహబూబ్‌నగర్‌ వేదికగా 2000లో జనతా సేవా సమితి సంస్థను స్థాపించి, నాటక రంగంలో తన వారసుడిగా కుమారుడు దూర్వాసరాజును ‘విప్రనారాయణ’ నాటకం ద్వారా పరిచయం చేసి నూటయాభైకి పైగా ప్రదర్శనలిప్పించారు.


1985లో వచనంలో ఉన్న ‘బొబ్బిలియుద్ధం’ నాటకానికి నరహరిరాజు తొలిసారి పద్యాలు రాసి రచయితగా నాటక రంగానికి పరిచయమయ్యారు. తన సృజనకు మరింత పదునుపెట్టి తర్వాత కాలంలో ‘స్వామి వివేకానంద’, ‘భద్రాద్రి రామదాసు చరితం’, ‘వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’, ‘అన్నమయ్య’, ‘ఏకాదశి మహాత్మ్యం’, ‘మహాకవి కాళిదాసు’, ‘సత్యాగ్రాహి’ వంటి 15కు పైగా పద్య, సాంఘిక నాటకాలు వ్రాసి నాటకకర్తగా గుర్తింపు పొందారు. అదేవిధంగా స్నేహసుధ, ప్రసన్నభారతి, కరుణాభారతి వంటి 10కి పైగా పద్యకావ్యాలను రచించారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి పూర్వమే తెలంగాణ మాండలికంలో వ్రాసిన ‘జర్రా ఇనుకోండ్రి మా నాయనా’ పద్య కవిత్వం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నాటకకర్తగా, సంగీత దర్శకుడిగా నరహరిరాజు అర్ధశతాబ్దం పాటు తెలుగునాట అనేక వేదికలపై పద్యనాటకాలను ప్రదర్శించి నాటక రంగంలో తన కీర్తి పుటను సుస్థిరం చేసుకున్నారు. నాటక రంగానికి అందించిన సేవలకు గాను 2015లో తెలుగు విశ్వవిద్యాలయం, ‘కీర్తి పురస్కారం’తో నరహరిరాజును సత్కరించింది. 1986లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘కళానీరాజన’ పురస్కారం, జె.పి.ఎన్.సి. వారి ప్రతిభా నగదు పురస్కారం, ఇతర కళాసంస్థల సత్కారాలను ఆయన అందుకున్నారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో పద్యనాటకానికి ప్రాణం పోసిన ఘనత నరహరిరాజుకు దక్కుతుంది. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఆయన మునివేళ్ళు హార్మోనియం మెట్లపై నాట్యం చేస్తుంటే రంగస్థలం హోరెత్తిపోయేది. అలాంటి ప్రతిభామూర్తి లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు పద్య నాటకం, నాటక రంగం ఓ పెద్ద దిక్కును కోల్పోయింది.

-డా. జే. విజయకుమార్ జీ అధ్యక్షులు,

తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్

Updated Date - Jul 16 , 2025 | 01:04 AM