Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చాలి
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:14 AM
విశాఖతీరం సమీపంలోని రుషికొండ ప్యాలెస్‌ను ఎలా వినియోగించాలి?’ అనే అంశంపై ప్రజాభిప్రాయం కోరుతూ ...
‘విశాఖతీరం సమీపంలోని రుషికొండ ప్యాలెస్‌ను ఎలా వినియోగించాలి?’ అనే అంశంపై ప్రజాభిప్రాయం కోరుతూ గత ఏడాది కూటమి ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో (రూ.451.67 కోట్ల ప్రజాధనంతో) నిర్మించిన ఈ ప్యాలెస్ సంబంధిత భవనాలను ఓ మంచి ఆశయం కోసం ఉపయోగించడం సముచితం. అందుకే ఆ ప్యాలెస్‌ను విద్యార్థులకు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అక్కడ మ్యూజియంను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని విద్యార్థులెవరైనా సైన్సు మ్యూజియం చూడాలి అంటే తిరుపతి లేదా హైదరాబాద్‌కు వెళ్లాల్సిందే. తిరుపతిలోని ‘రీజనల్ సైన్స్ సెంటర్’ తప్ప రాష్ట్రంలో పెద్దగా విద్యా, వైజ్ఞానిక భవనాలేవీ లేవు. రాజమండ్రిలో స్థాపించేందుకు పాలకులు ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. అయితే, అభివృద్ధిలో వెనకబడి ఉన్న ఉత్తరాంధ్రకు అటువంటి ప్రతిపాదనలు ఏవీ లేవు. మరోవైపు ‘ఈ ప్యాలెస్‌ను లాభార్జన, వ్యాపారం కోసం కాకుండా శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక మ్యూజియంగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దాలి’ అని రాష్ట్రంలోని అనేకమంది మేధావులు, ప్రముఖులు, ప్రజలు కోరుతున్నారు. ఈ ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చడం ద్వారా... మన రాష్ట్ర, ఉత్తరాంధ్ర ఖ్యాతిని, చరిత్రను చాటి చెప్పేందుకు ఈ ప్యాలెస్ వేదికగా నిలుస్తుంది. యువత, చిన్నారులు, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సైన్సు పట్ల ఆసక్తిని, మన సంస్కృతి, కళలపై అవగాహనను పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. వందల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్యాలెస్ భవనాలు దుర్వినియోగం కాకుండా ఉంటాయి. దీన్ని భవిష్యత్తులో ప్రఖ్యాత మ్యూజయంగా తీర్చిదిద్దడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించవచ్చు. టూరిజం కూడా అభివృద్ధి అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిజంగా పారదర్శకంగా జరగాలి. ‘రుషికొండ ప్యాలెస్‌ను విద్యార్థులకు ఉపయోగపడేలా మ్యూజియంగా మార్చాలి’ అని కోరుతూ... రాష్ట్రంలోని ప్రజలు ‘rushikonda@aptdc.in’కు మెయిల్ ద్వారా తమ అభిప్రాయాన్ని పంపించాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, రుషికొండ ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చేందుకు కృషి చేయాలి.
– డా. కె. రమాప్రభ, సామాజిక కార్యకర్త, విశాఖపట్నం