Angel Chakma: నేను భారతీయుడినే
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:23 AM
ఈశాన్య రాష్ట్రం త్రిపురకు చెందిన విద్యార్థి ఏంజెల్ చక్మాని విద్వేషపూరిత వ్యాఖ్యలతో వేధించి, దారుణంగా కొట్టిచంపిన ఘటన అత్యంత విషాదకరమైనది.
ఈశాన్య రాష్ట్రం త్రిపురకు చెందిన విద్యార్థి ఏంజెల్ చక్మాని విద్వేషపూరిత వ్యాఖ్యలతో వేధించి, దారుణంగా కొట్టిచంపిన ఘటన అత్యంత విషాదకరమైనది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఎంబీఏ ఆఖరు సంవత్సరంలో ఉన్న ఈ పాతికేళ్ళ యువకుడిని చైనీస్, చింకీ, మోమో అంటూ కొందరు స్థానికులు అవహేళన చేస్తూ మనసు గాయపరచడమే కాక, అవమానాన్ని ప్రశ్నించినందుకు, తాను భారతీయుడినేనని అన్నందుకూ ఈ యువకుడు ఏకంగా ప్రాణాలే పోగొట్టుకోవలసి వచ్చింది. మూకదాడిలో మెడవిరిగిపోయి, వెన్నెముక పూర్తిగా దెబ్బతిని, శరీరంలోని పలుచోట్ల తీవ్రమైన గాయాలతో పదిహేడురోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు అతడు. మిగతాదేశం తమను అనుమానంగా, అవమానంగా చూస్తున్నదన్న ఈశాన్యవాసుల వాదనకు ఊతాన్నిచ్చే, వేదనను మరింత పెంచే దారుణఘటన ఇది.
అంతటి కష్టంలోనూ ఈ యువకుడి తండ్రి బాధ్యతగా మాట్లాడాడు. ఒక బీఎస్‌ఎఫ్ జవానుగా శత్రువులు దేశంలోకి చొరబడకుండా సరిహద్దులను కాశాను కానీ, లోపలివారినుంచి కుమారుడిని రక్షించుకోలేకపోయానని బాధపడ్డాడు. తన పిల్లలు ఇద్దరినీ చైనీస్ మోమో అంటూ కొందరు అదేపనిగా వేధిస్తున్నా, మిగతా విద్యార్థులు అభ్యంతరం చెప్పకపోవడం, అడ్డుపడకపోవడం మీద కూడా ఈ తండ్రి ఆవేదన చెందుతున్నాడు. చదువు, ఉద్యోగాలకోసం ఈశాన్య రాష్ట్రాల నుంచి వివిధ నగరాలకు తరలివస్తున్నవారిని అవమానించవద్దనీ, మనమంతా భారతీయులమని హితవుచెప్పాడు. ఇంతటి ఘోరమైన ఘటన వెనుక ఏ విధమైన వివక్షలూ లేవంటూ దబాయించి, చక్మా విద్యార్థుల సంఘం రంగంలోకి దిగితే కానీ, ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఉత్తరాఖండ్ పోలీసులు సిద్ధపడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాడిజరిగిన వెంటనే స్పందించని వివిధ పార్టీల నాయకులంతా కుర్రవాడి మరణం తరువాత, ఈశాన్యమంతా మండిపడుతూంటే మాటమాత్రంగా బాధ వెలిబుచ్చుతున్నారు. ఉత్తరాఖండ్ పాలకుడు పుష్కర్‌సింగ్ ధామీ ఏంజెల్ చక్మా కుటుంబాన్ని టెలిఫోన్‌లో పరామర్శిస్తున్న విడియోను మాధ్యమాల్లో ప్రచారంలో పెట్టి, పరామర్శను ఒక ప్రజాకర్షణ కార్యక్రమంగా మార్చేశారు.
కొందరు ఉన్మాదుల చేతిలో విపరీతంగా దెబ్బలుతింటూ, నేను భారతీయుడినే, నన్ను నమ్మండి అంటూ ఈ ఏంజెల్ ప్రాణాలు విడిచాడు. విద్వేషం అన్నది రాత్రికిరాత్రే మొదలుకాదు, దానిని కొన్నేళ్ళుగా ఈ దేశయువతకు నూరిపోస్తున్న ఫలితమే ఇటువంటి ఘటనలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించినందుకు, ఆయన దీనిని రాజకీయం చేస్తున్నారన్న అధికారపక్షం అంటోంది. అన్ని ఘటనల వెనుక నాయకులు ప్రమేయం ఉండకపోవచ్చును కానీ, తమ ప్రయోజనాలకోసం పలురకాల విద్వేషాలను పాలకులే ప్రోత్సహిస్తున్నప్పుడు, ఉన్మాదులకు అది ఊతంగా ఉపకరిస్తుంది. హింసకు పాల్పడేవారికి పోలీసులన్నా, చట్టాలన్నా భయం లేకుండా పోతుంది. తాము ఎవరినైనా వేధించవచ్చు, దాడిచేయవచ్చు, ప్రశ్నిస్తే హత్యచేయవచ్చునన్న నమ్మకం ఏర్పడుతుంది. కులం, మతం, జాతి, ప్రాంతం ఇత్యాదివి ఆధారంగా ఎదుటివారిని చంపేయవచ్చు, వారి ఆస్తులు తగలబెట్టవచ్చునన్న నమ్మకం చుట్టూవాతావరణం, వ్యవస్థల పనితీరునుంచే వస్తుంది. ఒకవేళ తప్పిజారి జైలుకు పోవలసివచ్చినా వెనక్కు వచ్చేస్తామన్న నమ్మకం వారిని మరింత ముందుకు నడిపిస్తుంది. ఉన్మాదులకు వీరతిలకాలు దిద్ది, ఊరేగించే, ఆరాధించే ఆచారం కొనసాగుతున్నప్పుడు, వారు సోషల్ మీడియాలో హీరోలుగా చెలామణీ అవుతూ, ఆ మాటలు, చర్యలు, చేష్టలు ఇతరులకు స్ఫూర్తినిస్తున్నప్పుడు విరుగుడు కష్టం. సామూహిక అత్యాచారాలకు పాల్పడినవారికీ ఘనసన్మానాలు, భారీ ర్యాలీలు జరుగుతున్న దేశంలో మూకదాడులకు పాల్పడినవారు మాత్రం ఎందుకు భయపడతారు? బంగ్లాదేశీయులన్న ఆరోపణతో మరో మతానికి చెందినవారిని కొట్టిచంపేసిన ఘటనలు ఇటీవలే రెండు జరిగాయి. చైనావాడు అన్న ఆరోపణతో ఉజ్వలభవిష్యత్తు ఉన్న ఒక భారతీయ యువకుడు ఇప్పుడు ఒక మూకదాడికి బలైపోయాడు. విచక్షణలన్నీ అంతరించిపోయి, వివక్షలు గడ్డకడుతున్న ఈ పాడుకాలం త్వరితంగా గతించిపోవాలని కోరుకుందాం. విషాలు, విద్వేషాలతో కలుషితమైన ఈ వాతావరణానికి వేగంగా విరుగుడు వేయాల్సిందే.