Share News

Time to Stand Up to Trumps Bullying: ఇది ట్రంప్‌కు ఎదురు నిలబడాల్సిన సందర్భం

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:51 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారతదేశం పట్ల అనుసరిస్తున్న రూళ్లకర్ర విధానం, పిడివాదం, మొండి వైఖరి పాలకుల విషయంలో...

Time to Stand Up to Trumps Bullying: ఇది ట్రంప్‌కు ఎదురు నిలబడాల్సిన సందర్భం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారతదేశం పట్ల అనుసరిస్తున్న రూళ్లకర్ర విధానం, పిడివాదం, మొండి వైఖరి పాలకుల విషయంలో ఏమోగానీ దేశ ప్రజలందరిలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిని ఇంతగా అవమానించిన నేత బహుశా ట్రంప్‌ తప్ప ప్రపంచంలో మరొకరు కనపడరు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోవడం ఇష్టం లేక కావొచ్చు లేదా మరేదైనా కారణం కావొచ్చు– ట్రంప్‌ భారత్‌ పట్ల తన వ్యతిరేకతను బహిర్గతం చేస్తూ వస్తున్నారు. భారతీయులకు ఉద్యోగాలలో ప్రాధాన్యం ఇవ్వరాదని ఒకసారి, అసలు ఉద్యోగాలే ఇవ్వరాదని మరోసారి అమెరికన్‌ కంపెనీలను ట్రంప్‌ హెచ్చరించడం అందర్నీ విస్మయపర్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు యూదుల తర్వాత భారతీయులే దన్నుగా నిలుస్తున్నారని గణాంకాలు తెలియజెపుతున్నాయి. గత అర్ధశతాబ్ధిపైగా, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక భారతీయులు పెద్దసంఖ్యలో అమెరికాకు వెళ్లి అక్కడ నివాసం ఉంటున్నారు. అందులో చాలా మంది అమెరికా పౌరసత్వం లభించాక అక్కడి చట్టసభలకు ఎన్నికవుతూ అమెరికా ప్రజల గౌరవాభిమానాలు పొందుతున్నారు. అమెరికా సమాజంలో అంతగా మమేకం అయిన భారతీయుల పట్ల, భారతదేశం పట్ల ట్రంప్‌ చూపుతున్న వ్యతిరేకతకు ఎలాంటి హేతుబద్ధత గోచరించదు. కేవలం తొలి నుంచి రష్యాతో భారత్‌ స్నేహం సాగించడం ఒక్కటే కారణంగా కనిపిస్తోంది. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ – ఆయన ఆధ్వర్యంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన కృష్ణమీనన్‌ ఇరువురూ కమ్యూనిస్టులకు స్నేహితులని, వారిద్దరూ భారతదేశంలోను, అంతర్జాతీయంగా కొన్ని దేశాలలోను కమ్యూనిజం నిలదొక్కుకొనేందుకు సహకరించారనే పేరు ఉండేది. అందులో నిజం లేకపోలేదు. అగ్రరాజ్యాల కూటములలో ఎటూ చేరకుండా తటస్థ (అలీన) విధానం తమదని నెహ్రూ పదేపదే చెప్పేవారు. కానీ దేశ అవసరాల రీత్యా రష్యా నుంచి అనేక విధాలుగా సహకారం పొందడం వల్ల భారత్‌ పరోక్షంగా రష్యా కూటమి దేశంగానే పేరుపొందింది. అమెరికా, యూరప్‌ దేశాలతో వాణిజ్య, దౌత్య సంబంధాలు కొనసాగించినప్పటికీ అవి పరిమితంగానే సాగాయి. అందువల్ల ఏనాడూ అమెరికా భారత్‌ను మిత్రదేశంగా పరిగణించలేదు. పైగా, కశ్మీర్‌ సమస్యను కశ్మీర్‌ ప్రజల అభీష్టం మేరకు పరిష్కరించుకోవాలంటూ పాకిస్థాన్‌ వాదాన్ని అమెరికా విన్పిస్తూ వచ్చింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే పాకిస్థాన్‌ దుశ్చర్యలను ఏనాడూ అమెరికా నిర్ద్వంద్వంగా ఖండించలేదు. ఒసామా బిన్‌ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చింది పాకిస్థానేనని తెలిసినా అమెరికా మౌనంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.


కాగా, సోవియెట్‌ యూనియన్‌ పతనంతో అనివార్యంగా భారత్‌ అమెరికా వైపు జరిగింది. అదే సమయంలో దేశ ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో మొదలైన ఆర్థిక సంస్కరణలు నూతన ఆర్థిక విధానానికి దారితీశాయి. స్వేచ్ఛా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థల అనుసంధానం పేరుతో అమెరికా విధానాలను గుడ్డిగా అనుసరించడం అప్పుడే ప్రారంభం అయ్యింది. ఆ క్రమంలోనే పబ్లిక్‌ రంగ సంస్థల ప్రైవేటీకరణ, సబ్సిడీలలో కోత, ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం వంటి షరతులకు తలొగ్గి ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి అమెరికా కనుసన్నలలో నడిచే ద్రవ్య సంస్థల నుంచి భారీగా రుణాలను స్వీకరించడం మొదలైంది. చివరకు అమెరికా జపించే ‘ఏ సేవ కూడా ఉచితంగా ఇవ్వరాదు’ అనే మంత్రం భారత్‌లో మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్‌ 1990వ దశకం నుంచి అమెరికా వెంట నడిచింది. అయితే 1998లో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రోఖ్రాన్‌–2 అణు పరీక్షలు నిర్వహించినపుడు దేశంపై అమెరికా ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. అమెరికా మిత్రదేశాలు కూడా కొన్ని భారత్‌పై ఆంక్షలు విధించాయి. కానీ నాటి ప్రధాని వాజపేయి అందుకు ముందుగానే సిద్ధపడ్డారు. ‘‘భారత్‌ను అణ్వాయుధ దేశంగా చేయడానికి కొన్ని త్యాగాలు చేయక తప్పదు. శత్రువుల నుంచి మమ్మల్ని మేం రక్షించుకోవడానికి ఇది అవసరం. అందువల్ల ఎవరి ఆంక్షలను లెక్కచేయం’’ అని స్పష్టంగా భారత్‌ వైఖరి తెలియజెప్పారు. వాజపేయి అనుసరించిన దృఢ వైఖరి కారణంగా అమెరికా అనతికాలంలోనే తను విధించిన ఆర్థిక ఆంక్షల్ని ఎత్తివేసి దౌత్య, వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకొంది.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆప్తమిత్రుడనే ప్రచారం ఎంతోకాలంగా ఉంది. కానీ, ‘‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’’ అనే ఓ ముతక సామెత మాదిరిగా ట్రంప్‌ వ్యవహార శైలి కొనసాగుతున్నది. భారత్‌ ఓ విఫల ఆర్థిక వ్యవస్థ అని ట్రంప్‌ నోరుపారేసుకున్నా ఆయన వ్యాఖ్యలను నేరుగా ఏ భారతీయ రాజకీయవేత్త ఖండించకపోవడం ఆశ్చర్యమే. పైగా, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ అయితే ‘ట్రంప్‌ చెప్పింది నిజమే కదా!’ అన్నారు. ట్రంప్‌ ప్రకటనను రాజకీయాలకు అతీతంగా ఖండించే ఉదారత ప్రతిపక్షాలకు లోపించడం దురదృష్టకరం. ఈ విషయాన్ని పక్కన పెడితే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా అమెరికా భారత్‌పై 25శాతం అదనపు సుంకాలు విధించడం అసమంజసమే కాదు, బ్లాక్‌మెయిలింగ్‌ కూడా! ఇందుకు బదులుగా భారత్‌ కూడా ప్రతీకార సుంకాలు విధించాలంటూ కొందరు ప్రతిపాదన చేస్తున్నారు. దానివల్ల భారత్‌కు జరిగే ఆర్థిక నష్టం భర్తీ అవుతుందన్నది వారి అభిప్రాయం. నిజానికి, ఈ అంశాన్ని కేవలం ఆర్థిక కోణం నుంచి మాత్రమే చూడటం సరికాదు. ఇది దేశ సార్వభౌమత్వానికి, దేశ స్వతంత్ర స్వేచ్ఛా వాణిజ్యపు ప్రయోజనాలకు సంబంధించిన అంశం. ఇందులో తలదూర్చే సాహసం చేయడం ట్రంప్‌ తలపొగరు తప్ప మరొకటి కాదు.


దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అమెరికాతో కయ్యానికి కాలు దువ్వరాదని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అది నిజమే కావొచ్చు. కానీ, దేశాన్ని అవమానిస్తుంటే, దేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకొంటుంటే, భారత్‌ మౌనంగా ఉండిపోవాలా? కేవలం ప్రతీకార సుంకాలను విధించి ఊరుకోవాలా? ట్రంప్‌ చేస్తున్న విమర్శలకు ఆయన పేరు ఎత్తకుండా అన్యాపదేశంగా సమాధానాలు ఇస్తే గాయపడిన భారతీయుల మనోభావాలకు సాంత్వన చేకూరుతుందా? అంతేకాదు, అదానీ ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే ట్రంప్‌ను పల్లెత్తుమాట అనడం లేదనే అప్రతిష్ఠను మోదీ మూటకట్టుకోవాల్సి వస్తోంది. అగ్రరాజ్యాల పిడివాదం, దురంహకారాల వల్ల ప్రపంచం డీ–గ్లోబలైజేషన్‌ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదొక అనివార్య పరిణామంగా మారవచ్చు. పూర్తిగా సాధ్యం కాకున్నా ఏ దేశానికి ఆ దేశం ఇతరులపై ఆధారపడటం తగ్గించి స్వదేశీ ఉత్పత్తులు, స్వదేశీ పరిజ్ఞానంపై దృష్టిపెట్టొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రస్తుతం అదే చెబుతున్నారు. ఆ దిశగా దేశం పయనిస్తే మంచిదే. కానీ, అప్పటివరకూ దేశ ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని, అంతర్జాతీయ వాణిజ్య దౌత్య వ్యవహారాలతో స్వతంత్ర విధానాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానిదే. అమెరికాతో భవిష్యత్‌ సంబంధ బాంధవ్యాల అంశంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పక్షాల సలహాలు, సూచనలు స్వీకరించాలి. ఓ స్పష్టమైన విధానాన్ని అనుసరించాలి. ముఖ్యంగా ట్రంప్‌ బెదిరింపులకు, ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగబోమని, ఆర్థిక దాస్యానికి సిద్ధంగా లేమన్న హెచ్చరిక నేరుగానే అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పాలి.

-సి. రామచంద్రయ్య శాసనమండలి సభ్యులు

Updated Date - Aug 13 , 2025 | 04:51 AM