Share News

Tikkana Sculpture Politics: ఏడేళ్లు బందీగా సారస్వత మూర్తి

ABN , Publish Date - Jul 04 , 2025 | 02:05 AM

మహాభారతాన్ని ఆంధ్రీకరించిన సారస్వతమూర్తి తిక్కన. వర్ణవివక్ష కారణంగా ఆయన ఏడేళ్లుగా ఓ గదిలో బందీగా ఉంటున్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఆయన్ను విడుదల చేయలేకపోయారు.

Tikkana Sculpture Politics: ఏడేళ్లు బందీగా సారస్వత మూర్తి

హాభారతాన్ని ఆంధ్రీకరించిన సారస్వతమూర్తి తిక్కన. వర్ణవివక్ష కారణంగా ఆయన ఏడేళ్లుగా ఓ గదిలో బందీగా ఉంటున్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఆయన్ను విడుదల చేయలేకపోయారు. అసలు విషయానికొస్తే... నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో తిక్కనకవి విగ్రహం ఏర్పాటు చేయాలని 2018లో నాటి టీడీపీ ప్రభుత్వం సంకల్పించి, ఆయన కాంస్య విగ్రహాన్ని తయారు చేయించింది. కానీ ఆ విగ్రహం పసిడి రంగుకు చేరువలో ఉండడంతో ‘పసుపు ముద్ర’ అపవాదు కారణంగా ప్రతిష్ఠకు దూరమైంది.


తెలుగువారికి గర్వకారణమైన తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చివరి వరకు ప్రయత్నించి విఫలమయ్యారు. కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరే ముందు కూడా తిక్కన విగ్రహ ప్రతిష్ఠ విషయమై అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో బాలు మాట్లాడారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయాలని అభ్యర్థించారు. ప్రముఖుల అభ్యర్థనతో నాటి శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ విగ్రహ ప్రతిష్ఠకు పూనుకున్నారు. 2019లో మహోత్సవం పేరుతో తిక్కన విగ్రహ ఆవిష్కరణ, ‘తిక్కన తిరునాళ్ల’ పేరుతో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరపాలని నిర్ణయించారు. కానీ సరిగ్గా ఆ సమయంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. దాంతో తిక్కన విగ్రహాన్ని నెల్లూరు సంగీత కళాశాలలోని ఓ గదిలో ఉంచారు.


ఎన్నికల అనంతరం నాటి మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ దృష్టికి కొందరు విగ్రహ ప్రతిష్ఠ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. అప్పటి కలెక్టర్ చక్రధర్‌బాబు అదిగో ఇదిగో అంటూ మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేశారు. కలెక్టరేట్‌లో మహాత్మాగాంధీ విగ్రహం, 100 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. అదే ప్రాంగణంలో తిక్కన విగ్రహం కూడా ఏర్పాటు చేయవలసి ఉంది. విగ్రహం అందుబాటులో ఉన్నా, విగ్రహ ప్రతిష్ఠకు సాహిత్య కళాభిమానులు పట్టుబడుతున్నా.. అధికారులు పాలకులేమాత్రం స్పందించడం లేదు.


తెలుగుదేశం పార్టీ తయారు చేయించిన విగ్రహం కావడం, దానికితోడు రంగు సమస్య వెంటాడడంతో తిక్కన చీకటిలోనే బందీగా ఉండిపోయారు. రాజకీయ సుడిగుండంలో చిక్కుకుని ఉన్నారు. ఏడేళ్లుగా ఆ సారస్వత ‘మూర్తి’కి రాజకీయ రంగులు పులిమి, గదిలో బందీని చేయడం సబబు కాదు. ఈ విషయంపై వెంటనే పాలకులు, అధికారులు స్పందించాలని, కలెక్టరేట్ ప్రాంగణంలో తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చరిత్రకారులు, సాహిత్య అభిమానులు కోరుతున్నారు.

– ఈతకోట సుబ్బారావు, నెల్లూరు

Updated Date - Jul 04 , 2025 | 02:05 AM