Ratan Thiyam: నవ్య నాటకబ్రహ్మ రతన్ థియాం
ABN , Publish Date - Jul 29 , 2025 | 03:09 AM
ప్రముఖ నాటక ప్రయోక్త, భారతీయ నాటకరంగ స్రష్ట అనదగ్గ దర్శకుడు పద్మశ్రీ రతన్ థియాం ఈ నెల 23న కన్నుమూశారు.
ప్రముఖ నాటక ప్రయోక్త, భారతీయ నాటకరంగ స్రష్ట అనదగ్గ దర్శకుడు పద్మశ్రీ రతన్ థియాం ఈ నెల 23న కన్నుమూశారు. రతన్ థియాంను పోలిష్ నాటక ప్రయోక్త గ్రోటోవిస్కితోను, బ్రిటిష్ నాటక దర్శకుడు పీటర్ బ్రూక్‌తోనూ పోలుస్తారు. థియాం బహుముఖ ప్రజ్ఞాశాలి. చిత్రకారుడు, రచయిత, మణిపురి నృత్యకారుడే కాక హిందూస్థానీ సంగీతంలోనూ ఆయన నిపుణుడు. థియాం 1948లో జన్మించారు. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో శిక్షణ పొందారు (అనంతర కాలంలో ఆ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశారు). థియాం యువకుడిగా ఉన్నప్పుడు క్యూబా వెళ్లి చెగువేరాలా విప్లవకారుడు అవ్వాలి అనుకున్నారట! ఆయన నాటకాల్లో విప్లవభావాలు కనిపిస్తుంటాయి. సంప్రదాయాన్ని, సమకాలీనతను రెంటినీ థియాం సమ్మిళితం చేశారు. 70, 80వ దశకాలలో వచ్చిన ‘థియేటర్ ఆఫ్ రూట్స్’ ఉద్యమం ఆ కాలపు నాటక ప్రయోక్తలను ఎంతగానో ప్రభావితం చేసింది. మీతీ భాషలో థియాం రాసిన ‘చక్రవ్యూహం’ అనే నాటకం ఆనాటి నాటకవేత్తలకు ఓ కొత్త మార్గాన్ని చూపింది. సంస్కృత నాటక రచనను కానీ, పాశ్చాత్య రచనను కానీ థియాం తన సాంస్కృతిక నేపథ్యం నుంచి కొత్తగా చూసి, దానికి తనదైన ప్రదర్శనా భాషను అందిస్తారు. ఆయన ఇంఫాల్‌లో ‘కోరస్ రిపర్టరి’ని స్థాపించారు.
ఒకసారి.. ఇబ్సెన్ రాసిన ‘వెన్ వుయ్ డెడ్ అవేకెన్’ ప్రదర్శనను భారత నాటకరంగ మహోత్సవంలో భాగంగా ఢిల్లీలోని కమాని ఆడిటోరియంలో ప్రదర్శిస్తున్నారు. ఆడిటోరియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది. నటుల సంభాషణలు అర్థం కావడం లేదు. కానీ ప్రేక్షకులు మాత్రం నిశ్శబ్దంగా, కుతూహలంగా చూస్తున్నారు. ఒక్కో సీన్‌లోని దృశ్యాలు ప్రేక్షకులను ఓ కొత్త ఊహాలోకంలోకి తీసుకెళ్తున్నాయి. చీకటిలో, నిశ్శబ్దంలో పారదర్శకమైన కాంతి– కదులుతున్న బోటు మీదనో, ఒక ఆయుధం మీదనో, ఒక నటి తలపైనో పడుతుంటే ప్రేక్షకులు కొత్త అనుభవం పొందుతున్నారు. స్టేజీ మీద పావురాల జంటలు ఎగురుతుంటాయి. ఒక సీన్‌లో నీడలాంటి సాల్వేడార్ డాలి చిత్రం, కరిగిపోతున్న గడియారం కనిపిస్తుంది. ఇలా.. థియాం నాటకాలు చూస్తుంటే పెయింటింగ్స్ జీవం పోసుకుని కదులుతున్నట్టుగా ఉంటాయి. రతన్ థియాం నాటక ప్రయోగంలో రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఒకటి– చీకటి, రెండు– నిశ్శబ్దం. ఈ రెండూ రంగస్థలంపై చాలా ముఖ్యమైనవి. ‘వెర్బల్ డ్రామా’లో చిక్కుకున్న మన నాటక పరిషత్‌లు ఆయన నాటకాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
– జి.ఆర్ శివ్వాల