Urgent Need to Protect Migrant Workers: వలస కార్మికుల ఓటుహక్కు ప్రాముఖ్యత
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:47 AM
బిహార్‌లో నిర్వహిస్తోన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. సమీప భవిష్యత్తులోనే..
బిహార్‌లో నిర్వహిస్తోన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. సమీప భవిష్యత్తులోనే దేశవ్యాప్తంగా జరగనున్న ఈ సవరణ ప్రక్రియ, తమ తమ మాతృస్థలాలను వీడి ఉపాధికై వలసబాట పట్టిన లక్షలాది భారతీయులపై తప్పక ప్రభావం చూపుతుంది. అశేష ప్రశ్నలకు తావిచ్చిన బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తమ ఓటు హక్కును కోల్పోయిన వారిలో అత్యధికులు జీవనోపాధికై ఇతర ప్రాంతాలకు వెళ్ళినవారే. స్వరాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి అవకాశాలు అరకొరగా ఉండడం అనివార్యంగా ఉపాధి వలసలకు దారితీస్తోంది. ఇలా బతుకుతెరువు అన్వేషించుకుంటూ వెళ్లేవారు పేదలు, నిరక్షరాస్యులే అన్నది ఎవరూ కొట్టివేయలేని వాస్తవం. కోవిడ్ సంక్షోభ కాలంలో ప్రత్యేకంగా నడిపిన రైళ్ళ ద్వారా తమ స్వస్థలాలకు తిరిగి వచ్చిన వారి నుంచి మాత్రమే దేశంలో వలస కార్మికుల వివరాలు (అత్యంత స్వల్పంగానే అయినప్పటికీ) అధికారవర్గాలకు తెలిశాయి. ఇంతకు మించి, ఆ వలస పక్షుల గురించి మరే సమాచారం లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా వలస కార్మికులను గుర్తించి ఒక అంచనాకు రావడం ఏమంత సులువు కాదు.
పేదవాడికి మిగిలి ఉన్న ఏకైక ఆస్తి ఓటు హక్కు. అయితే అది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. మరణించిన లేదా శాశ్వతంగా స్వస్థలాన్ని వదిలి వెళ్ళిపోయిన వారు లేదా చొరబాటుదారులు ఓటర్లుగా ఉండకూడదు. ఈ విషయంలో ఎవరికీ మరో అభిప్రాయం లేదు. కన్న ఊరులో బతుకు భారం కావడంతో తాత్కాలికంగా పరాయి ప్రదేశానికి పొట్టకూటికై వెళ్ళిన వారి ఓటుహక్కును తొలగించడం న్యాయమేనా? బతకడానికి బయటకు వెళ్ళినవారిని ఏ విధంగా, ఏ ప్రాతిపదికన గుర్తించాలో చట్టబద్ధమైన నిర్దిష్ట మార్గదర్శకాలు లేవు. ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950’ లోని నిబంధన 20లో ‘సాధారణ నివాసి’ (ఆర్డినర్లీ రెసిడెంట్) నిర్వచనం సైతం స్పష్టంగా లేదు. ఉపాధి వలసల విషయానికి వస్తే, బిహార్ రాష్ట్రంలో ముఖ్యంగా అంతర్జాతీయ వలసలలో అగ్రగామిగా ఉన్న జిల్లా గోపాల్ గంజ్. తాజాగా అత్యధిక ఓటర్లు గల్లంతయింది కూడా ఈ జిల్లాలోనే కావడం గమనార్హం. మూడు లక్షల పది వేలకు పైగా ఓట్లను తొలగించడంతో జిల్లాలో ఓట్ల సంఖ్య 15 శాతం తగ్గింది. రాష్ట్రీయ జనతా దళ్ అగ్రనాయకుడు లాలూప్రసాద్ యాదవ్ స్వంత జిల్లా అయిన గోపాల్‌గంజ్‌లో ఆరుగురు శాసనసభ్యులు ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు రాష్ట్రీయ జనతాదళ్, భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యు) పక్షాన ఇద్దరు చొప్పున సమాన ప్రాతినిధ్యం కలిగి ఉన్నాయి. గల్ఫ్ దేశాలలో పనిచేసే బిహారీ ప్రవాసులలో అత్యధికులు గోపాల్ గంజ్ జిల్లావారే. ఎడారి వలసల విషయానికి వస్తే తెలుగునాట తూర్పు గోదావరి లేదా నిజామాబాద్ తరహాలో గోపాల్ గంజ్ కూడా ప్రభావిత జిల్లా. గోపాల్‌గంజ్‌తో పాటు బిహార్‌లోని ఇతర జిల్లాల్లో కూడా దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కార్మికులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ఈ కారణాన రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ‘పలయన్ రోకో నౌక్రీ దో’ (వలసలు ఆపండి, ఉద్యోగం ఇవ్వండి) అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వగా వలస వెళ్ళిన బిహారీలను జనతాదళ్ (యు) బిహార్ దివస్ ఉత్సవాలలో భాగంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వలస కార్మికుల సమస్యల పరిష్కారానికై ధర్నా చేశారు.
మిర్యాలగూడ రైస్ మిల్లుల్లో, హైదరాబాద్ భవన నిర్మాణ రంగంలో పనిచేసే బిహారీ కూలీలు ఓటు వేయడానికి తమ స్వంత రాష్ట్రానికి వెళ్ళకపోవచ్చు. అదే విధంగా బెంగళూరు లేదా దుబాయిలో పనిచేసే తెలుగు ప్రవాసులు తమ స్వస్థలాలకు రాకపోవచ్చు. అంత మాత్రాన ఆ శ్రమ జీవుల ఓటు హక్కును తీసివేయడం సమంజసం కాదు. దురదృష్టవశాత్తు భారతావనిలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా సాధారణ చర్యలు కూడా అసాధారణంగా పరిగణితమవుతున్నాయి. ఇందుకు సహేతుక కారణాలు ఉన్నాయి. ప్రజా జీవితంతో ముడివడి ఉన్న అంశాలలో సంస్కరణల అవసరముంది. అయితే అందుకు ముందుగా, ఇప్పటి వరకు వాటితో ఎదురవుతున్న దుష్పరిణామాల విషయమై విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రతిపాదిత సంస్కరణల ఆశ్యకతను వివరించడం పాలకుల విజ్ఞతాయుత కర్తవ్యం. ఇంతకంటే ముఖ్యం నిబద్ధత, నిజాయితీ. ఇవి లేకపోవడంతోనే అసలు సమస్య.
-మొహమ్మద్ ఇర్ఫాన్ (ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)