Share News

Digital Libraries in India: ఇ గ్రంథాలయాల ఏర్పాటు అవసరం

ABN , Publish Date - Jul 19 , 2025 | 01:58 AM

మన దేశంలో 54,854 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో ఒక్కో గ్రంథాలయంలో ..

Digital Libraries in India: ఇ గ్రంథాలయాల ఏర్పాటు అవసరం

మన దేశంలో 54,854 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో ఒక్కో గ్రంథాలయంలో పుస్తకాల సంఖ్య సగటున 5,700. అభివృద్ధి చెందిన దేశాల్లోని గ్రంథాలయాల్లో దాదాపు లక్షా 8 వేల పుస్తకాలు ఉన్నాయి! 2018 యునెస్కో ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ రిపోర్ట్ ప్రకారం.. మనదేశంలో కేవలం పన్నెండు శాతం లైబ్రరీల్లో మాత్రమే కంప్యూటర్లు ఉన్నాయి. వాటిలోనూ కొన్నింటికి మాత్రమే ఇంటర్‌నెట్ సౌకర్యం ఉంది! దేశంలో గ్రంథాలయ వ్యవస్థలో దాదాపు 12 లక్షల మంది పని చేస్తున్నారు. కానీ వీరిలో వృత్తిపరమైన అర్హతలు ఉన్నవారు కేవలం పదిశాతం మందే.


నేటి తరం పిల్లల్లో పఠనాసక్తిని పెంచడానికి నేషనల్ బుక్ ట్రస్ట్ సాయంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇటీవల ‘ఇ–పుస్తకాలయం’ను ప్రారంభించింది. దీనిలో వెయ్యి ఇ–పుస్తకాలను(పాఠ్యేతర) 22 భాషల్లో పొందుపరిచింది. ఇది మంచిదే. కానీ మనకు ఇంకా చాలా భాషలున్నాయి. ఆ భాషల పుస్తకాలనూ పొందుపరచాలి. మన దేశంలో పురాతన తాళపత్రాలను కంప్యూటరీకరించి, రేపటి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రస్తుతం ఇ–బుక్స్, ఆడియోలు, గ్రాఫిక్ నవలలు, మల్టీ మీడియా, స్థానిక కథలు, మాండలికాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి, గ్రంథాలయాల్లో వాటికి స్థానం కల్పించాలి. గ్రంథాలయాలకు ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించాలి. డార్జిలింగ్‌కు చెందిన సామాజిక సేవకురాలు ‘ఆక్వి తామి’ మహిళల్లో విద్యావ్యాప్తి కోసం మహారాష్ట్రలో మహిళా గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాల స్థాపనకు 2015లో ‘తోపుడు బండి’ సాదిక్ కూడా అలాంటి సాహసోపేత ప్రయత్నమే చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు గ్రంథాలయాలపై దృష్టి పెట్టాలి. వాటికి పూర్వ వైభవం తేవాలి.

– వి. వరదరాజు

Updated Date - Jul 19 , 2025 | 01:58 AM