Revolutionary Leader: సుధాకర దుర్గం
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:38 AM
పాలమూరు నడిగడ్డన ఇసుక ఎడారిలో పరిమళించిన మందారం..
పాలమూరు నడిగడ్డన
ఇసుక ఎడారిలో పరిమళించిన మందారం
గుక్కెడు నీళ్ళులేని నేల
ప్రజా గొంతై ప్రతిధ్వనించిన మాటల మహానది
ప్రతాపరెడ్డి సాహిత్యపు గోలకొండ
సుధాకర్ రెడ్డి కమ్యూనిస్టు దుర్గం
బాల్యంలోఆకాశపు నక్షత్రాలమధ్య
ఎంతమందిలున్నా చందమామలా ఆయననే చూసేది వెతికి వెతికి చూపిచ్చేది మా ఊరి పెద్దలు
వేదికలపై మా కలల రెక్కల్ని విప్పారు
మతోన్మాద ఫాసిస్ట్ విధానాలపై చలి మంటల విసుర్లు
సత్య ప్రపంచానికి సమిధయి ఎదురీదిన
మా చేగువేరా! మా ఫిడెల్ కాస్ట్రో!
అందుకోలేనంత ఎత్తులో మీ ప్రభ
వడగళ్ల సవ్వడిలా
అగ్నిజ్వాలలా ఉవ్వెత్తున ప్రసంగాలు
మహాకావ్యాలు చదివినంత సంతృప్తి
యువత గుండెల్లో విప్లవ నవతను ఆవిష్కరించారు
ప్రగతిశీల భావాల వేకువై
మీరు నడిచిన తొవ్వ ఆచరణీయం
రాచరికాల అరాచకాలు భూస్వామ్య క్రౌర్యాలెన్ని
ముసిరినా తలదించని ఎవరెస్టు
నవభారత నిర్మాణానికి సత్యాగ్రహమై విప్లవించావు
కమ్యూనిజమే అజేయమని అగ్నికణమై రగిలావు
ఎర్రజెండానే అంతిమ పతాకమని సగర్వమై సాగావు
మహా నేత
విప్లవ యోధుడా! అరుణతార!!
మీ నిష్క్రమణ తీరని దుఃఖమైనా
మీ తాత్వికత ప్రాపంచిక దృక్పథం
రక్తప్రసారమై ప్రజ్వలిస్తున్నది
కార్మిక కర్షక తాడిత పీడిత హక్కులకు
ప్రజా చైతన్యపు బావుటై ఆదరించి ఆచరించిన మార్గదర్శి
దారి చూపే మైలురాయే కాదు
తెగించి పోరాడే వారసత్వాన్ని నింపిన స్ఫూర్తి
సూర్యుడంత వెలుగు చంద్రుడంత వెన్నెల
– వనపట్ల సుబ్బయ్య