Share News

Shibu Soren: ఝార్ఖండ్‌ అంతరాత్మ

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:29 AM

సంతాల్‌ ప్రజలు ఏడాది పొడుగునా శ్రమిస్తూనే ఉంటారు. అయినా ఆరు ఋతువులలోనూ ప్రతి రోజూ ఆకలిదప్పులతో అలమటిస్తుంటారు

Shibu Soren: ఝార్ఖండ్‌ అంతరాత్మ

‘సంతాల్‌ ప్రజలు ఏడాది పొడుగునా శ్రమిస్తూనే ఉంటారు. అయినా ఆరు ఋతువులలోనూ ప్రతి రోజూ ఆకలిదప్పులతో అలమటిస్తుంటారు. పంట సిరులు, ప్రకృతి ఫలాలు వడ్డీ వ్యాపారుల వశమవుతున్నాయి. ఈ పరిస్థితి పోవాలి’ అని శివచరణ్‌ నిరసించాడు. ధర్మవడ్డీల అధర్మాన్ని ఎదిరించిన తండ్రి శోబరన్ సోరెన్‌ వడ్డీ వ్యాపారుల దుర్మార్గానికి బలైపోవడం పదమూడేళ్ల శివచరణ్ జీవితాన్ని నిర్ణయాత్మకంగా మార్చివేసింది. వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి తనకు ఆత్మబంధువులు అయిన ఆదివాసీలను విముక్తం చేసేందుకు బాల శివచరణ్ సంకల్పించుకున్నాడు. ఆ దృఢ నిర్ణయంతోనే ఆ బాలుడు తన జీవన ప్రస్థానంలో శిబూ సోరెన్‌గా పరిణమించాడు, దిశోం గురు (జాతి నాయకుడు)గా గౌరవాదరాలు పొందాడు. మొన్న సోమవారం నాడు శిబూ సోరెన్‌ మరణంతో ఆదివాసీల జాతీయ జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోయింది. తండ్రిని కోల్పోయిన చింత శివచరణ్‌ను అన్యాయాలకు వ్యతిరేకంగా సంఘటిత పోరుకు పురిగొల్పింది. తోటి ఆదివాసీ యువకులతో కలిసి వడ్డీ వ్యాపారులు, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. అదే సమయంలో సంతాల్‌ గిరిజనులలో సాంఘిక సంస్కరణ ఉద్యమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. సనత్‌ సంతాల్‌ సమాజ్‌ పేరిట తన ప్రజలలో మద్యపానం, మూఢనమ్మకాలు, బహు భార్యాత్వం నిర్మూలనకు ఆయన విశేష కృషి చేశారు. అయితే సామాజిక అసమానతలు, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమాలు శిబూ సోరెన్‌ను రాజకీయ రంగం వైపునకు నడిపించాయి. అవిభక్త బిహార్‌లో ఆదివాసీలు అత్యధికంగా ఉన్న జిల్లాలతో ఝార్ఖండ్‌ రాష్ట్రాన్ని సాధిస్తేనే గానీ వారి సమస్యలు పరిష్కారం కావనే నిర్ణయానికి ఆయన వచ్చారు.


స్వాతంత్ర్యానంతరం జైపాల్‌సింగ్‌ ముండా అనే విఖ్యాత హాకీ క్రీడాకారుడు ఝార్ఖండ్‌ పార్టీ నేర్పాటు చేసి ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమించారు.. ఆ దశలో జార్ఖండ్‌ భావన గిరిజనులను అన్ని విధాల దోపిడీ చేస్తున్న డీకూస్‌ (బయటివ్యక్తులు)ను వ్యతిరేకించడానికే ప్రధానంగా పరిమితమయింది. ఈ కారణంగానే జైపాల్‌సింగ్‌ తన లక్ష్య సాధనలో సఫలమవలేకపోయారు. 20వ శతాబ్దంలో జార్ఖండ్‌ ప్రాంతంలో పారిశ్రామికీకరణ విస్తరించడంతో ఆ ప్రాంత జనాభాలో వైవిధ్యం బాగా పెరిగిపోయి జార్ఖండ్‌ భావనకు మద్దతు తగ్గిపోసాగింది. ఈ తరుణంలో శిబూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బెంగాలీ మార్క్సిస్టు ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు ఎ.కె రాయ్‌, కుర్మి–మహతో నేత బినోద్‌ బిహారీ మహతోతో కలిసి ఆయన 1972లో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా నేర్పాటు చేశారు. పారిశ్రామిక కార్మికులు, అట్టడుగు కులాలవారు, ఆదివాసీలు భాగస్వాములుగా ఝార్ఖండ్‌ భావనను ఆయన పునః నిర్వచించారు. సామాజిక అసమానతలు, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ముమ్మర పోరాటాలు చేశారు. ఆదివాసీలతో పాటు ఆదివాసీయేతర ప్రజలలో కూడా ఝార్ఖండ్‌కు మద్దతును కూడగట్టారు. 1980లో లోక్‌సభకు ఎన్నికైన సోరెన్‌ ప్రధాని ఇందిరతో ఒక ఒప్పందానికి వచ్చారు. అది ఆయన రాజకీయ కార్యచరణను మార్చివేసింది. ఝార్ఖండ్‌ సాధనే లక్ష్యమైపోయింది. తదాది రెండు దశాబ్దాల పాటు పార్లమెంటులో ఝార్ఖండ్‌ ఏర్పాటు గురించి అవిరామంగా ఎలుగెత్తారు. 2000 సంవత్సరంలో ఝార్ఖండ్‌ అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. ఆయనతో విభేదించినవారు సైతం ఝార్ఖండ్ సాధకుడు శిబూ సోరెన్‌ అనే విషయమై భిన్నాభిప్రాయాన్ని ఎన్నడూ వ్యక్తం చేయలేదు.


శిబూ సోరెన్‌ ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరణించిన సమయంలో రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. స్వల్పకాలమే అయినా అనేక వివాదాల నడుమ కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. మూడుసార్లు ఝార్ఖండ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఏ ఒక్కసారి కూడా ఆయన పాలనా కాలం గరిష్ఠంగా ఆరునెలలు కూడా లేదు. సంకీర్ణ రాజకీయాల పుణ్యమది. సమర్థ పాలన కాదు, మౌలిక మార్పు సాధనే ఆయన వారసత్వం. న్యాయాన్ని స్వప్నించాలని, దాని సాధనకు సంఘటితమవాలని తన ప్రజలకు ఆయన బోధించారు. అధికారం కోసం ఆయన రాజకీయాలలోకి రాలేదు. బాల్యం నుంచి తన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను రూపుమాపే లక్ష్యం కోసమే ఆయన అధికారాన్ని ఆశించారు. అధర్మంపై ప్రతి పోరాటంలోనూ ఆయన సజీవంగా ఉంటారు– ఒక రాజకీయవేత్తగా కాదు, తాను స్వప్నించి, సాధించిన ఝార్ఖండ్‌ అంతరాత్మగా.

Updated Date - Aug 07 , 2025 | 05:29 AM