Share News

Kumbham Madhusudhan Reddy: గ్రామీణ విద్యార్థుల ఆత్మబంధువు

ABN , Publish Date - Jul 25 , 2025 | 02:00 AM

ఆరు దశాబ్దాల పాటు అటు యూనివర్సిటీల్లోనూ, ఇటు ఇంట్లోనూ నిత్యం విదార్థులకు, ఉద్యమకారులకు పాఠాలు బోధించి..

Kumbham Madhusudhan Reddy: గ్రామీణ విద్యార్థుల ఆత్మబంధువు

రు దశాబ్దాల పాటు అటు యూనివర్సిటీల్లోనూ, ఇటు ఇంట్లోనూ నిత్యం విదార్థులకు, ఉద్యమకారులకు పాఠాలు బోధించి, జ్ఞానాన్ని ఎరుక చేసి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సైద్ధాంతిక పునాదిని కల్పించిన ప్రజాపక్ష ఆచార్యులు కుంభం మధుసూదన్‌రెడ్డి. 90 ఏండ్ల వయసులో జూలై 22న కన్ను మూసిండు. అందరికీ సదా అందుబాటులో ఉండేవాడు కాబట్టి, ఆయన్ని ‘కారిడార్‌ ప్రొఫెసర్‌’గా పిలిచేవారు. రాజనీతిశాస్త్ర ఆచార్యులుగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఎంతోమంది శిష్యులను వైస్‌ఛాన్సలర్లుగా, ఉద్యమకారులుగా, రాజకీయ నాయకులుగా, సివిల్‌ సర్వెంట్లుగా, అడ్వకేట్లుగా తీర్చిదిద్దిన మేధోసంపన్నుడు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్ట్స్‌ కళాశాలలో అడుగుపెట్టిన వారికి మొదటి ఆదరువు మధుసూదన్‌రెడ్డి. బలహీన వర్గాలపై ప్రత్యేక ప్రేమతో మెలిగేవాడు. 1990వ దశకంలో తెలంగాణలోని దాదాపు అన్ని ఎయిడెడ్‌ కళాశాలల్లో ఆయన శిష్యులు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. గ్లోబలైజేషన్‌ ప్రారంభంతో ప్రయివేటు రంగంలో కళాశాలల ఏర్పాటుకు దారి ఏర్పడింది. ఈ దశలో తన శిష్యులను కళాశాలల స్థాపనకు ప్రోత్సహించి తనవంతు సహాయ సహకారాలు అందించాడు.


1988లో మధుసూదన్‌రెడ్డి ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులైనప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతా విద్యార్థి రాజకీయాలతో అట్టుడుకుతూ ఉండేది. ఒక వైపు రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఉద్యమాలు వైబ్రంట్‌గా ఉండేవి. మరోవైపు పీడీఎస్‌యూ, డీఎస్‌ఓ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ, క్రాంతి సంగ్రామ పరిషత్‌, తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ కార్యక్రమాలు విద్యార్థులను చైతన్యపరుస్తున్న కాలమది. ఒకరి మీద ఒకరు దాడులు కూడా చేసుకుంటున్న సందర్భమది. నిత్యం ఉద్రిక్తతల మధ్య క్లాసులు జరిగేవి. హాస్టల్‌ మెస్‌ మొదలు, పరీక్షలు, ఫీజులు ఇట్లా రోజూ ఆర్ట్స్‌ కాలేజి విద్యార్థుల ఉద్యమాలతో రణరంగంగా ఉండేది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఆర్ట్స్‌ కాలేజి మాత్రమే అనే విధంగా ఉండేది. ఆయన కాలంలోనే కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ శాఖకు కొత్త భవనాలు ఏర్పాటయ్యాయి.


విద్యార్థుల సమస్యలపై సత్వరమే స్పందించి తన శక్తిమేరకు మధుసూదన్‌రెడ్డి వాటిని పరిష్కరించేవాడు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కళాశాలల్లో ఎన్నికలు రద్దు చేసిండు. దీంతో విద్యార్థి ప్రతినిధులుగా ఎన్నికైన ఒక వర్గం అంటూ ఉండేది కాదు. ఎవరికి వారే నాయకులుగా నలుగురిని కూడగట్టుకొని ధర్నాలు చేసేవారు. పోస్టర్లు వేసేవారు. ఆర్ట్స్‌ కాలేజి లోపల ఒక బోర్డు మీద విద్యార్థులు ఈ పోస్టర్లను అతికించేవారు. ఇట్లా ఏ రోజు ఏ అతివాద, వామపక్ష వాళ్లు ఎలాంటి బెదిరింపు పోస్టర్లు వేస్తారో అనే భయం ఉండేది. ఈ దశలోనే ఎన్నికైన సంఘం లేకపోయినా ఆర్ట్స్‌ కాలేజి ఆవరణలో ఒక రూమ్‌ని ఏబీవీపీ ఆక్రమించుకొని రోజూ అక్కడ వారి సానుభూతిపరులు సమావేశమయ్యేవారు. మేము తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ తరఫున ప్రిన్సిపాల్‌ని కలిసి వారిని ఖాళీ చేయిస్తారా? మేము కూడా ఒక రూమ్‌ని ఆక్రమించుకోవాలా? అని హెచ్చరించాం. ఈ తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌లో రామానంద తీర్థ విశ్వవిద్యాలయం ప్రస్తుత చైర్మన్‌ కిశోర్‌రెడ్డి, రిటైర్డ్‌ రైల్వే పీఆర్‌వో బొజ్జ అనిల్‌కుమార్‌, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆచార్యులు వెంకటేశ్వర్లు, నేను, ఇంకొంత మంది చురుగ్గా ఉండేది. సార్‌ ఏబీవీపీ వారికి ఏమి నచ్చజెప్పిండో ఏమో గానీ తెల్లారే వరకు ఆ రూమ్‌ని ఏబీవీపీ ఖాళీ చేసింది. లైబ్రరీ సైన్స్‌ స్టాఫ్‌ రూమ్‌గా దాన్ని మార్చిండ్రు. ఉద్యోగాలు కల్పించే లైబ్రరీ సైన్స్‌, జర్నలిజం వంటి కోర్సులపై సారుకు ప్రత్యేక ప్రేమ ఉండేది. ఈ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు ఏమి కోరినా వాటిని వెంటనే సమకూర్చేందుకు చొరవ చూపేవారు. 1990వ దశకంలో ఆయన వద్ద శిష్యరికం చేయని విద్యార్థి నాయకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్‌ అప్పుడు ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా ఉన్నాడు. అట్లాగే మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, మెదక్‌ జిల్లాకు చెందిన శశిధర్‌రెడ్డి, నిజామాబాద్‌కు చెందిన మాల్తూమ్‌ శ్రీనివాస్‌ అంతా ఎన్‌ఎస్‌యూఐ నాయకులుగా ఉండేవారు. వీళ్ల కాలం నుంచే యూనివర్సిటీలో ఈ విద్యార్థి సంఘం పాదులూనుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దాసోజు శ్రవణ్‌ అప్పుడు ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా ఉండేవాడు.


మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆరంభంలో ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యులు మధుసూదన్‌రెడ్డి. మేము స్థాపించిన తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ తరఫున ఆర్ట్స్‌ కాలేజీ మీద నవంబర్‌ ఒకటి, 1991 నాడు పెద్ద నల్లజెండాను ఎగరేసి నిరసన వ్యక్తం జేసినం. ఈ జెండాను జూసి పోలీసులు ఆర్ట్స్‌ కాలేజికి వస్తే మీకు ఇక్కడ అనుమతి లేదు, రావాల్సిన అవసరం లేదు అని మధుసూదన్‌రెడ్డి హెచ్చరించి వాళ్లను వెనక్కి పంపించాడు. మా ఉద్యమాలకు అండగా ఉండేవాడు. అట్లాగే తెలంగాణకు సంబంధించి భావజాల వ్యాప్తిలో భాగంగా 1990ల్లోనే ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ ట్రస్ట్‌’ని స్థాపించిన వారిలో సారు ఒకరు. అంతేకాదు అమెరికా వెళ్లినా అక్కడ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి చెప్పేవారు. ఉద్యమ సమయంలో కె.చంద్రశేఖరరావుతో కలిసి అనేక సభల్లో ప్రసంగించారు. తెలంగాణ రాజకీయాలపైనే కాకుండా సామాజిక అంశాలపై, బహుజన కులాలు, బహుజన సంస్కృతిపై మధుసూదన్‌రెడ్డికి సంపూర్ణమైన అవగాహన ఉండింది. ఒకసారి విద్యార్థి నాయకులందరం వెళ్లి సంక్రాంతికి సెలవులు కావాలని డిమాండ్‌ చేస్తూ చాంబర్‌ని ముట్టడించాం. ఆయన విద్యార్థులందరినీ మాట్లాడనిచ్చి ‘తెలంగాణోళ్లకు సంక్రాంతి పండుగెట్లయితదయా, పీడ దినాలు గదా’ అని తనదైన శైలిలో ఒక్క దెబ్బతో అందరి నోళ్లు మూయించాడు. ఇట్లా స్పాంటేనియస్‌గా నిర్ణయాలు తీసుకోవడమే గాకుండా వాటిని అమలుచేసిన సాహసి మధుసూదన్‌రెడ్డి. తెలుగు సాహిత్యాన్ని క్షుణ్ణంగా ఔపోసన పట్టిన సారుకు, సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అంటే అభిమానం. ఆ అభిమానంతోనే నేను సంకలనం చేసిన ‘సురవరం కవిత్వం’ గ్రంథం ప్రచురణకు తోడ్పడ్డాడు.


ప్రాథమిక స్థాయి నుంచి హైదరాబాద్‌లోనే విద్యాభ్యాసం చేసిన మధుసూదన్‌రెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్న గూడెం. ఈయన తండ్రి చిన్న శివారెడ్డి భూదానోద్యమంలో వినోబా భావేకు కొంత భూమిని దానం చేసిన త్యాగశీలి. ఆ త్యాగశీలతే మధుసూదన్‌రెడ్డికి కూడా అబ్బింది. 1961లో లెక్చరర్‌గా ప్రస్థానం ప్రారంభించిన సారు, 1988–92 మధ్యన ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1991–95 మధ్య ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌) సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ కేంద్రానికి డైరెక్టర్‌గా పనిచేశాడు. పదవీ విరమణకు ముందూ తర్వాత కూడా పంజాబ్‌, బెనారస్‌, లక్నో, గౌహతి, నాగాలాండ్‌, మైసూరు, బొంబాయి, బెంగళూరు ఇట్లా ముప్పయికి పైగా విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా సేవలందించాడు. తెలంగాణ గర్వించే విధంగా 1983 మేలో రాజనీతి శాస్త్ర జాతీయ స్థాయి సదస్సు నిర్వహించాడు. పాలమూరు పీజీ సెంటర్‌ ఏర్పాటు చేయించిందీ కూడా సారే! మధుసూదన్‌రెడ్డి సారుని శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు గాను ఆయన స్మారకార్థం ఒక విశిష్ట పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం హక్కులు, ఉద్యమ రంగాల్లో పనిచేసే వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అవార్డు ఇస్తే సముచితంగా ఉంటుంది. అట్లాగే ఆయన డైరెక్టర్‌గా పనిచేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐసీఎస్‌ఎస్‌ఆర్‌కు మధుసూదన్‌రెడ్డి పేరు పెడితే బాగుంటుంది.

డా. సంగిశెట్టి శ్రీనివాస్‌

Updated Date - Jul 25 , 2025 | 02:00 AM