The Rise of Fake News: పెచ్చరిల్లుతున్న ఫేక్ న్యూస్
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:03 AM
సోషల్ మీడియా వచ్చాక న్యూస్, సమాచారం క్షణాల్లో యూజర్‌కు చేరిపోతోంది. సోషల్ మీడియా ద్వారా వార్తల వినియోగం పెరిగింది. ఇదే అదనుగా యూట్యూబ్ చానెళ్లు, వెబ్ పోర్టళ్లు పుట్టగొడుగుల్లా...
సోషల్ మీడియా వచ్చాక న్యూస్, సమాచారం క్షణాల్లో యూజర్‌కు చేరిపోతోంది. సోషల్ మీడియా ద్వారా వార్తల వినియోగం పెరిగింది. ఇదే అదనుగా యూట్యూబ్ చానెళ్లు, వెబ్ పోర్టళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
వ్యూస్, డబ్బు కోసం యూట్యూబ్ చానెళ్లు పెడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఫేక్ న్యూస్, అశ్లీలత కంటెంట్‌తో వీడియోలు రూపొందిస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. దీనిపై ఎలాంటి నియంత్రణ, కంప్లైంట్ వ్యవస్థ లేకపోవడంతో వీరు చెలరేగిపోతున్నారు. క్రింజ్ వీడియోలు చేసే వారితో ఇంటర్వ్యూలు చేయడమేకాదు, ఆయా వీడియోల్లో అశ్లీలత, సమాజంలోని కొందరిపై విద్వేషం పెంచేలా వీడియోలు రూపొందించడం సర్వసాధారణమైపోయింది.
ఫేక్ న్యూస్ ఘటనలు కోకొల్లలు. ఈ మధ్య టాటా బైక్ విడుదలైనట్లు ఫొటోలు వైరల్ అయ్యాయి. అలాగే, ఓ పులి మనిషిని లాక్కుపోతున్న వీడియో కూడా. ఇదంతా ఫేక్ న్యూసే. పైరసీ పోర్టల్‌లో వచ్చే సినిమాలపై ఓ వెబ్ పోర్టల్ అప్డేట్స్ ఇస్తూ దానిని ప్రమోట్ చేస్తున్నది. ‘రూ. 56వేలు తగ్గిన బంగారం ధర!’ వంటి తప్పుడు వార్తల క్లిప్, బైట్ హెడ్‌లైన్స్ పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ‘మీ దగ్గర పాత నోట్లు ఉంటే రూ.30–40 లక్షలు సంపాదించవచ్చు’ అంటూ ఓ వెబ్ పోర్టల్ అదేపనిగా వార్తలను పబ్లిష్ చేసింది. వైరల్ వీడియోలను నమ్ముకుని, అది ఎంతవరకు నిజమనేది రూఢీ చేసుకోకుండానే కొన్ని వెబ్‌పోర్టళ్లు వాటిని ప్రచారం చేస్తున్నాయి. వెబ్ పోర్టళ్లు, యూట్యూబ్ చానెళ్లలో వచ్చే వార్తల్లో నిజమెంత? అని ఫ్యాక్ట్ చెక్ చేసుకునే అవకాశం సాధారణ ప్రజలకు లేదు. ఆ వార్తలు నిజమే అని నమ్మేవారి సంఖ్యే ఎక్కువ. ఫేక్ న్యూస్ వల్ల సమాజంలో గందరగోళం, ద్వేషం, అపనమ్మకం పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ప్రధాన మీడియాపై పడడం ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకర పరిణామం. మీడియా మీద నమ్మకం కోల్పోతే, ప్రజల్లో నిజాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. భారత రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణ ప్రకారం ‘వ్యక్తి స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు.’ కానీ తప్పుదారి పట్టించే సమాచారానికి అదే కవచం కాకూడదు. ఐటీ చట్టం 69A, 79వ సెక్షన్లు ఫేక్ న్యూస్, మిస్ లీడింగ్ కంటెంట్‌పై చర్యలు తీసుకునే అధికారం ఇస్తున్నప్పటికీ వాటి అమలు, ఫిర్యాదు వ్యవస్థలు అందుబాటులో లేవు. సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న ఈ తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించే యూట్యూబ్ చానెళ్లు, వెబ్ పోర్టళ్లపై మానిటరింగ్ వ్యవస్థ రావాలి. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై సులభంగా కంప్లైంట్ చేసేలా ఓ వ్యవస్థను రూపొందించాలి. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి.
సమాచారం శక్తిమంతమైనది. కానీ తప్పుడు సమాచారం విధ్వంసం సృష్టిస్తుంది. ప్రజలు నమ్మకంగా ఉండాలంటే, సోషల్ మీడియా బాధ్యతాయుతంగా ఉండాలి. వ్యూస్ కోసం ఫేక్ న్యూస్ ప్రసారం చేసే ఈ డిజిటల్ చానెళ్లను అరికట్టాలంటే ప్రభుత్వం, మీడియా, ప్రజలు ముగ్గురూ కలసి నడవాల్సిందే. నిజాలు తెలుసుకోవడం ప్రజల హక్కు. ఫేక్ న్యూస్ వల్ల వారు ఆ హక్కును కోల్పోకూడదు.
వంగరి రవిరాజు
ఇవి కూడా చదవండి
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!
లిక్కర్ స్కామ్‌లో.. జోగి రమేష్‌కు పోలీస్ కస్టడీ..