Vice President Of India: ధన్‌ఖడ్ ఉత్థాన పతనాలు
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:04 AM
జూలై 10, 2025న జగదీప్ ధన్‌ఖడ్ చాలా సంతోషంగా ప్రకటించారు
జూలై 10, 2025న జగదీప్ ధన్‌ఖడ్ చాలా సంతోషంగా ప్రకటించారు: ‘సరైన సమయం–ఆగస్టు 2027– లో నేను పదవీ విరమణ చేస్తాను’. ‘దైవిక జోక్యానికి లోబడి’ అని కూడా ఆయన అన్నారు. ధన్‌ఖడ్ భారత ఉపరాష్ట్రపతి. ఆ రాజ్యాంగ పదవి రీత్యా ఆయన రాజ్యసభకు చైర్మన్. జూలై 21న ఆయన ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేశారు. పర్యవసానంగా రాజ్యసభ చైర్మన్ బాధ్యతల నుంచి కూడా నిష్క్రమించారు. జూలై 10, జూలై 21 మధ్య సంభవించింది జీవితాన్ని వివరించ వీలులేని విషయంగా చేసేదే సుమా! జూలై 21న పార్లమెంటు ఉభయ సభలు సాధారణంగా ప్రారంభమయ్యాయి. అంతకు ముందు రోజు ప్రభుత్వం ఆనవాయితీ ప్రకారం ఉభయ సభలలోని సమస్త పార్టీల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సరే, అన్ని అంశాల పైన చర్చలకు, ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందేందుకు సహకరించాలని అధికారపక్షం వారు కోరడం, ప్రతిపక్షాల నేతలు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. విచారకరమైన విషయమేమిటంటే ఒక తక్షణ ప్రాధాన్యమున్న అంశంపై సభ ఎప్పుడు, ఎలా చర్చించాలి అన్న విషయమై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ప్రస్తుతం ఏకాభిప్రాయం లేదు. రాజ్యసభలో ప్రతిపక్షం సామాన్యంగా నిబంధన 267 కింద చర్చ జరగాలని పట్టుబడుతుంది. సభా కార్యక్రమాల జాబితాలోని అంశాలను వాయిదా వేసేందుకు ఉపకరించే ప్రత్యేక సాధనమే నిబంధన 267. సంబంధిత తీర్మానాన్ని ‘వాయిదా తీర్మానం’గా పేర్కొంటారు. నిబంధన 267 కింద చర్చను కోరడం చెడ్డ విషయమేమీ కాదు. అయితే ఇది ప్రభుత్వాన్ని ‘అభిశంసించడం’గా ఎన్డీఏ సర్కార్ పరిగణిస్తోంది (బహుశా, గతంలో కొన్ని ప్రభుత్వాలు కూడా ఇదే వైఖరి తీసుకుని ఉంటాయి). గత 11 సంవత్సరాలలో నిబంధన 267 కింద చర్చకు అధికారపక్షం చివరిసారి అంగీకరించింది నవంబర్ 2016లో ‘పెద్ద నోట్ల రద్దు’పై కావడం గమనార్హం. ధన్‌ఖడ్ రాజ్యసభ చైర్మన్ అయిన తరువాత నిబంధన 267 కింద ఎప్పుడూ ఎలాంటి చర్చను అనుమతించలేదు.
ఈ జూలై 21న కూడా భిన్నంగా ఏమీ జరగలేదు బీజేపీ సభ్యుడు ఒకరు నిబంధన 167 కింద పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు నోటీస్ ఇచ్చారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు అదే అంశంపై చర్చకు నిబంధన 267 కింద నోటీసులు ఇచ్చారు. బీజేపీ సభ్యుడి నోటీస్‌ను సభాధ్యక్షుడు స్వీకరించారు. ప్రతిపక్ష సభ్యుల నోటీసులను తిరస్కరించారు. అవి నిర్దేశిత విధానానికి అనుగుణంగా లేవని ఎప్పుడూ చెప్పే కారణాన్నే చెప్పారు. సభలో సహజంగానే గందరగోళం ఏర్పడింది. రాజ్యసభ చైర్మన్ సభా కార్యక్రమాల సలహా సంఘం (బీఏసీ) సమావేశాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించారు. ప్రభుత్వ ప్రతినిధులుగా జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరయ్యారు. కొంతసేపు చర్చ జరిగిన తరువాత ఆ సమావేశాన్ని సాయంత్రం 4.30 గంటలకు వాయిదా వేశారు. బీఏసీ మళ్లీ సమావేశమైనప్పుడు కేబినెట్ మంత్రులు ఇరువురూ హాజరు కాలేదు. చైర్మన్ ఆ సమావేశాన్ని మళ్లీ వాయిదా వేశారు. ఆ రాత్రి 9.35 గంటలకు ధన్‌ఖడ్ ‘వైద్యుల సలహా’ మేరకు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఏ పార్టీ కానీ, ఏ ఎంపీ కానీ రాజీనామాను ఉపసంహరించుకోవాలని ధన్‌ఖడ్‌ను కోరలేదు. జూలై 22న డిప్యూటీ చైర్మన్ ‘ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది’ అని క్లుప్తంగా ప్రకటించారు. ధన్‌ఖడ్‌కు గుడ్‌బై చెప్పేందుకు అధికార పక్షం నిర్ణయించుకున్నదని స్పష్టమయింది. ఆయనకు వీడ్కోలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా లేదు.
ధన్‌ఖడ్‌కు ఎన్డీఏ ప్రభుత్వం చాలా రుణపడి ఉన్నదని చెప్పక తప్పదు. ప్రతిపక్షాలను అదుపులో ఉంచడంలో ఆయన అద్వితీయంగా వ్యవహరించారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విషయమై ఆరెస్సెస్ / బీజేపీ వైఖరిని ఆయన పూర్తిగా సమర్థించారు. రాజ్యాంగ మున్నుడిలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్ ’ అనే పదాలను తొలగించాల్సిందేనని కూడా ధన్‌ఖడ్ డిమాండ్ చేశారు. కేశవానంద భారతి కేసులో మౌలిక నిర్మాణం సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు ప్రతిపాదించడాన్ని ఆయన విమర్శించారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాలపై న్యాయసమీక్ష సిద్ధాంతాన్ని ధన్‌ఖడ్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే హక్కు ప్రభుత్వానికి ఉందని ఆయన సమర్థించారు. ఈ నియామకాలలో న్యాయవ్యవస్థ నిర్ణయాలకు ప్రాధాన్యముందన్న ప్రతిపాదనను ధన్‌ఖడ్ కొట్టివేశారు. చట్టసభలు ఆమోదించిన బిల్లులను మూడు నెలలలోగా ఆమోదించాలని అధికరణ 142 కింద గవర్నర్లు, రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించడం సరికాదని ఆయన గర్హించారు. అధికరణ 105కు విరుద్ధంగా సభ్యులు తమ ప్రసంగాలలో ఉటంకించే సమాచారం, గణాంకాలను ధ్రువీకరించాలని ఆదేశించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను ఘనంగా ప్రస్తుతించారు. వివిధ అంశాలపై ఆయన వైఖరులు కరడుగట్టిన మితవాదుల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండేవి. సహజంగానే అవి బీజేపీకి సంతృప్తి కలిగించే విధంగా ఉండేవి.
ధన్‌ఖడ్ తన రాజకీయ జీవితంలో జనతాదళ్, చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని సమాజ్‌వాది జనతా పార్టీ, కాంగ్రెస్, బీజేపీలలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ధన్‌ఖడ్ నియమితుడవడంతో ఆయన రాజకీయ జీవితం పునరుత్థానమయింది. గవర్నర్‌గా ఆయన వ్యవహరించిన తీరు, మమతా బెనర్జీ ప్రభుత్వంతో కలహించడం ఆయన బీజేపీ అనుకూల వైఖరిని స్పష్టం చేశాయి. గవర్నర్ పదవి గౌరవాన్ని ఆయన ఏ విధంగానూ పెంపొందించలేదు. అయినప్పటికీ ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌కు పదోన్నతి లభించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజ్యసభ కార్యక్రమాలను ఆయన నిర్వహించిన తీరుకు విసిగిపోయిన ప్రతిపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవలసిన మొదటి రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడే కావడం విశేషం.
ధన్‌ఖడ్, ఆరెస్సెస్ / బీజేపీ మధ్య సుహృద్భావ సంబంధాలు ఎందుకు విచ్ఛిన్నమయ్యాయి? జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచన జూలై 15న కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ బృందం సమావేశంలో అంకురించింది. 63 మంది సభ్యులు సంబంధిత తీర్మానంపై సంతకాలు చేశారు. ఈ కారణంగా జూలై 21న ఆ తీర్మానాన్ని ఆమోదించడం ధన్‌ఖడ్‌కు తప్పనిసరి అయింది (అదే రోజున లోక్‌సభలో ప్రభుత్వం స్వయంగా అటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది). ఈ తీర్మానం మూలంగా జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన తీర్మానంపై కూడా ధన్‌ఖడ్ నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది. ఆయన గత ఏడు నెలలుగా ఈ అభిశంసన తీర్మానాన్ని స్వీకరించేందుకు ఆమోదించలేదు. ఈ రెండు అభిశంసన తీర్మానాలపై ధన్‌ఖడ్ నిర్ణయాలే ఆయన రాజీనామాకు దారితీశాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నేను ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నాను. ఆయన రాజీనామా వెనుక ‘ప్రస్తుతానికి తెలియని కారణాలు’ ఉన్నాయని నేను భావిస్తున్నాను. జీవితం ఒక రహస్యం, అది కొన్నిసార్లు అమర్యాదకరంగా ఉంటుంది.
-పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)