Share News

Telugu literature: విప్లవ కవితా జ్వాల

ABN , Publish Date - Dec 13 , 2025 | 04:25 AM

జనం కవి జ్వాలాముఖి మనకు భౌతికంగా దూరమై నేటికి 17 సంవత్సరాలు గడిచిపోయాయి. 1938 ఏప్రిల్‌ 12న హైదరాబాద్ సీతారాంబాగ్‌లో జన్మించిన వీరవల్లి....

Telugu literature: విప్లవ కవితా జ్వాల

‘‘మబ్బుల కారణంగా కొన్నిసార్లు సూర్యోదయం ఆలస్యం కావొచ్చు కానీ.. కాకుండా పోదు’’

జనం కవి జ్వాలాముఖి మనకు భౌతికంగా దూరమై నేటికి 17 సంవత్సరాలు గడిచిపోయాయి. 1938 ఏప్రిల్‌ 12న హైదరాబాద్ సీతారాంబాగ్‌లో జన్మించిన వీరవల్లి రాఘవాచారి– 1965 నుంచి దిగంబరకవి జ్వాలాముఖిగా ప్రసిద్ధుడయ్యారు. వృత్తిరీత్యా 12 సంవత్సరాలు హైస్కూల్ ఉపాధ్యాయునిగా, 24 సంవత్సరాలు కళాశాల లెక్చరర్‌గా ఉన్నారు. కవిగా, మహావక్తగా, విరసం, జనసాహితి వ్యవస్థాపక నాయకులలో ఒకరిగా, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, గ్రామీణ పేదల సంఘంలో చురుకైన కార్యశీలిగా, భారత్‌–చైనా మిత్రమండలి కేంద్ర నాయకునిగా చిర ప్రతిష్ఠను పొందారు.

ఆయన పేరు, ఆ కవితాస్ఫూర్తి, ఆ విప్లవ వాగ్వైభవం ఇప్పటికీ సజీవంగా జ్వలిస్తూ, చైతన్యాన్ని రగిలిస్తూనే ఉన్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ, పరిస్థితులు మరింత దిగజారుతూ ఆయన రచనలు, భావాలు మరింత ఎక్కువ ప్రాసంగికతను సంతరించుకుంటున్నాయి. ఆయన కవిత్వాన్ని లోతుగా పరిశీలించవలసిన ఆవశ్యకత, వాటికి తిరిగి ప్రాచుర్యం కలిగించవలసిన అవసరం అధికమవుతున్నది. జన విప్లవ విజయం పట్ల విశ్వాసం, మంచి భవిష్యత్తును నిర్మించుకోగలమనే అపారమైన నమ్మకం ఆయన సాహిత్యానికి ఆయువు పట్టు. ఒక రకమైన నిర్వేదం, నిరాశ సమాజాన్ని కమ్ముకుంటున్న వేళ ఆయన సాహిత్యాన్ని తిరిగి చదువుకోవటం మనలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఉద్యమాల తప్పిదాలను సరిచేసుకునే దృష్టిని కలిగిస్తుంది. అందుకే ఈనాడు ఆయన కవితల ప్రస్తావన విప్లవాభిమానుల తలపులలోకొస్తున్నది.


జ్వాల తన కవితాయానపు తొలి రోజుల్లో (1958) రాసిన ‘మనిషీ’ దీర్ఘకవితకు పెద్దల ప్రశంసలు లభించాయి. ‘‘నీ కవిత్వం మానవత్వంలో నవత్వం/ నీ నవత్వం మానవత్వంలో కవిత్వం/ ఫలిస్తుంది బాలమునీ నీ తపస్సు’’ అని కరుణశ్రీ తన ఆశీస్సులు అందజేశారు. దాశరథి ‘‘శ్రీ వీరవెల్లి రాఘవాచార్యుల గేయాలు చూశాను. అభ్యాసంతో బాగా మెరుగెక్కగలవిగా కనిపిస్తున్నాయి. ఈ గేయాల్లో విద్యున్మాలలు ఉన్నాయి’’ అని ప్రోత్సహించారు. ఆ సమయంలో ‘వీరా’ పేరుతో ఆయన కొన్ని పాటలు, మహా ప్రభాత గేయాలు రాశారు. 1957లోనే ‘‘రాకపోతుందా– ఆకలి ఆర్భటిలో కూటికి ప్రాకులాడే కూలీ యుగము రాకపోతుందా’’, ‘‘రక్త కొలనులో మానవత్వపు సహస్రదళ సౌగంధిక సురభిళ పుష్పం వికసించకపోతుందా?’’ అని మరో దీర్ఘకవిత రాశారు. ఆ దశలోని ఆలోచనా ధోరణికి ప్రతీకగా మనం మనిషీ కావ్యాన్ని గ్రహించవచ్చు.

ఆ తరువాత దిగంబర కవుల మూడు సంపుటాలు (దిక్కులు), ‘ఓటమి తిరుగుబాటు’ కవితాసంపుటి; ఆటవిక న్యాయాన్ని తలపించే ఉరిశిక్షకు ఆధునిక కాలంలో స్థానం ఉండకూడదని, అది రద్దుకావాలని కోరుకునే మానవీయ మకరంద భావాల స్వరం ‘వేలాడిన మందారం’ నవల; ‘కాళ్ళు చేతులు ఆడిస్తే ఒడ్డుకు వస్తవు, తలవంచితే మునిగిపోతవు. ఈత ఎట్లా తెగించి నేర్చుకున్నవో గట్లనే బతుకు నేర్చుకో’ అన్న జీవన చలనసూత్రాలను నేర్పించే జ్వాల కథల సంకలనం ‘కథాజ్వాల’; మత విద్వేష కల్లోలంలో ఎగిసిన రసార్ద్ర జ్వాల, శోషిత స్వప్నాల విచలిత దుఃఖగానం భస్మ సింహాసనం (మూడు దీర్ఘకవితల సంకలనం); వైరుధ్యాల మధ్య సంఘర్షణల ద్వారా పొందిన భావ పరిణామ వికాస ప్రతిఫలనం, జ్వాలాముఖి సుదీర్ఘ కవితాయానం కవితాజ్వాల; ‘‘అన్ని పరిణామాలకు కర్తలు, భర్తలు భారత శ్రామికులు. వాళ్ళు రాజకీయ విప్లవాలకెలా నాయకులో విప్లవ సాహిత్యానికి కూడా అలానే నాయకులు’’ అని గుర్తించి, వారు సృష్టించిన ఎర్రని మైలురాళ్లకు ప్రతిధ్వనిగా వినిపించిన కొన్ని ఉపన్యాసాల, వ్యాసాల సంకలనం వ్యాస జ్వాల, ఈవరకే తెలుగు సాహిత్యంలో మేలు ఆనవాళ్లుగా నిలిచాయి. ఆయన అనువాదం చేసిన ‘దేశదిమ్మరి ప్రవక్త శరత్‌బాబు, రాంగేయ రాఘవ జీవిత చరిత్ర’లను కేంద్ర సాహిత్య అకాడమి గతంలో ప్రచురించింది.

జ్వాల జీవన సహచరి శ్రీమతి సీతాదేవి ఈ ఏడాది సెప్టెంబర్‌ 15న కన్నుమూశారు. ఆమె జ్వాలాముఖికి ఎంతో వెన్నుదన్నుగా, అక్షరాల సహచరిగా చరించారు. ఆ దంపతుల స్మృతికి నీరాజనంగా జ్వాల కవితా సంకలనమైన ‘కవితా జ్వాల’ను జ్వాల ప్రచురణలు మరోమారు ముద్రించి కొత్తతరం పాఠకులకు అందిస్తున్నది.

డాక్టర్ యస్.జతిన్‌కుమార్

Updated Date - Dec 13 , 2025 | 04:25 AM