Guardians of Public Intellect: ప్రజామేధావుల సంరక్షణ సమాజ బాధ్యత
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:42 AM
ప్రజాస్వామ్యం స్థిరంగా నిలవాలంటే అభిప్రాయ స్వేచ్ఛ తప్పనిసరి. ప్రశ్నించడం మేధావి ధర్మం. మేధావులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ..
ప్రజాస్వామ్యం స్థిరంగా నిలవాలంటే అభిప్రాయ స్వేచ్ఛ తప్పనిసరి. ప్రశ్నించడం మేధావి ధర్మం. మేధావులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. మేధావులు రెండు విధాలు. మొదటి తరగతి సాంప్రదాయ మేధావులు తాము సమాజం నుంచి విడివడి ఉన్నట్లుగా భావిస్తారు. వీరు వీరికి తెలియకుండానే ఉన్న వర్గవ్యవస్థను బలపరచే పాత్ర వహిస్తారు. వీరికి భిన్నంగా ఆర్గానిక్ మేధావులు ఉంటారని ఆంటోనియో గ్రాంస్కీ అనే ఇటాలియన్ మార్క్సిస్టు మేధావి భావన. ఇలాంటి వారు వర్గచైతన్యాన్ని పెంచడానికి పనిచేస్తారు. గ్రాంస్కీ సిద్ధాంతంలో మరో ప్రధాన భావన సాంస్కృతిక ఆధిపత్యం. దీనర్థం పాలకవర్గాల భావాలు బలప్రయోగం ద్వారా కాక, ఎక్కువగా ప్రజల అంగీకారాన్ని పొందడం ద్వారా పనిచేస్తాయి. పాలకవర్గాలు తమ విలువలు, ఆచారాలు, ఆలోచనా విధానాలను సామాన్య ప్రజలలో చొప్పించేందుకు ప్రయత్నిస్తాయి. ప్రజలు ఈ విలువలను స్వీకరించి, వాటిని స్వచ్ఛందంగా నమ్ముతారు. వాళ్లను బలవంతం చేయాల్సిన అవసరం ఉండదు. సినిమాలు, పాఠశాలలు, మతం, మీడియా వంటివన్నీ పాలకవర్గాల భావజాలాన్ని విస్తరించే పనిలో ఉంటాయి.
వీరికి భిన్నంగా ఆర్గానిక్ మేధావులు ప్రజల అభ్యుదయానికి పనిచేస్తూ, ఆధిపత్యాన్ని ప్రశ్నించి, ప్రజల చైతన్యాన్ని పెంచుతారు. ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలు, విద్యా వ్యవస్థ వంటివి ఉపయోగించి ఆధిపత్య వర్గాలు ప్రజల మనోభావాలను మలుస్తున్నారు. దీనిని అర్థం చేసుకొని, ప్రజలకు నిజమైన చైతన్యం కలిగించడమే ఆర్గానిక్ మేధావుల ప్రధాన పని. సాంస్కృతిక ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ప్రజా సంస్కృతి ఎలా అభివృద్ధి చెందాలీ అన్నదే సమాజాభివృద్ధికి ప్రధానం. ప్రజా సంస్కృతి ప్రజల అనుభవాల కేంద్రంగా రూపొందుతుంది. ప్రజల దైనందిన జీవితం, వారి కష్టసుఖాలు, ఆశయాలు, ఆలోచనల వంటివన్నీ ప్రజా సంస్కృతిలో ప్రతిఫలిస్తాయి. ఆధిపత్య వర్గాల ఒప్పించబడిన భావజాలం కాకుండా, ప్రజల స్వతంత్ర అవగాహన మీద ఆధారపడి ఇది ఉంటుంది. రైతు కవితలు, కార్మికుల గేయాల వంటివి ప్రజా సంస్కృతి రూపాలే. స్థానిక భాషలు, కళలు, సాంప్రదాయాలు ఈ సంస్కృతిలో భాగంగా ఉంటాయి. ఆధిపత్య వర్గాలు ‘‘సాంస్కృతిక ఏకీకరణ’’ జరిపి తమ విలువలను ప్రజలపై ప్రబలంగా ముద్రించడానికి ప్రయత్నిస్తాయి. నేడు మోదీ ప్రభుత్వం ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే జాతి వంటి నినాదాలివ్వడం ఇందులో భాగమే. దీనికి భిన్నంగా ప్రజా సంస్కృతి మాత్రం స్థానికత, వైవిధ్యత, భిన్నత్వాలను కాపాడుతుంది. ఆధిపత్య వర్గాలు చరిత్రను వక్రీకరిస్తాయి లేదా మరచిపోయేలా చేస్తాయి. నేడు పాఠ్యాంశాలలో చరిత్ర అంశాలను తొలగించడం ఇందులో భాగమే. ప్రజా సంస్కృతి ప్రజల అసలు చరిత్రను సజీవంగా ఉంచుతుంది. తమ గతాన్ని గుర్తించి, భవిష్యత్తును నిర్మించుకోవడంలో ప్రజలకు మార్గదర్శకత్వం చేస్తుంది. సమాజ పరిణామాలను శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించిన వర్గ సిద్ధాంత రూపకర్త కార్ల్ మార్క్స్, వలసబాధిత దేశాల ప్రజలకు మేధో మార్గదర్శనం ఇచ్చిన ఫ్రెంచ్ మేధావి ఫ్రాంట్జ్ ఫానన్, కార్మిక వర్గానికి ప్రజా మేధావిగా మారిన గ్రాంస్కీ, భారతదేశ స్వాతంత్ర్యానికై మేధస్సును త్యాగం చేసిన మహాత్మాగాంధీ, అణగారిన ప్రజల విముక్తికై పోరాడిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహిళా విద్యకై విశేష కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి వారంతా ప్రజల గుండె చప్పుడు విన్న మేధావులు.
సమాజానికి ప్రజా మేధావులు కావాలి. అయితే నేటి సమాజంలో అలాంటి వారు మనుగడ సాగించడం అత్యంత కష్టతరం. ఎందుకంటే సాంస్కృతిక ఆధిపత్యం బలమైనది. అధికార వర్గాలు ప్రజల మనస్సుల్లో తమ భావజాలాన్ని గాఢంగా నాటుతాయి. ప్రజలు తమ దోపిడీని, కష్టాలను కూడా సహజంగానే భావించే స్థితిలో ఉంటారు. ప్రజలలో మార్పు సాధించాలంటే, మేధావి ఈ గాఢమైన ‘సహజ జ్ఞానా’న్ని మార్చగలగాలి. ‘‘బానిస తన గొలుసును ఆభరణంగా భావించినప్పుడు విముక్తి కష్టం.’’ పేద ప్రజలు ఆకలి, అనిశ్చితి, భయం వంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నపుడు వారిలో చైతన్యాన్ని సృష్టించడం సులభం కాదు. పాలక వర్గాలు మతం, జాతి, భాష, ప్రాంత భేదాల ఆధారంగా ప్రజలను చీల్చి, దారి మళ్లిస్తాయి. మేధావి ప్రజలను ఒకతాటిపై తీసుకురావాలంటే, ఈ విభజనల చీకటి మబ్బుల్ని తొలగించాలి. ప్రజామేధావి చైతన్యం పెంచే ప్రయత్నం చేస్తే అతనిపై దేశద్రోహి అనే ముద్ర వేస్తారు. చేయని నేరం మోపుతారు, వేటాడతారు. అవమానాల్ని, ఒత్తిడిని తట్టుకోవడం, సత్యం చెప్పడంలో వెనుకడుగు వేయకపోవడం, గెలుపు ఆలస్యం అయినా దారి మళ్లకుండా ఉండటం వంటి లక్షణాలు కలిగి, ఒకవైపు మేధస్సు, మరోవైపు నిబద్ధతతో ప్రజామేధావి నిరంతర పోరాటం చేస్తూ ఉండాలి. మోదీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే ప్రజా మేధావి వర్గాన్ని, ప్రశ్నించే వారిని లక్ష్యంగా ఎంచుకుంది. గౌరీలంకేశ్, ప్రబీర్ పురకాయస్త, ప్రొఫెసర్ సాయిబాబా, ప్రొఫెసర్ అలీ ఖాన్, సుధా భారద్వాజ్, స్టాన్ స్వామి వంటి అనేకమందిపై హత్యాయత్నాలు, హత్యలు, అక్రమ అరెస్టులు జరిగాయి. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేసే పత్రికలూ నాయకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనుషుల్ని చంపగలరేమో గానీ, వారిచ్చిన జ్ఞానాన్ని చంపలేరు కదా! ప్రజామేధావులు లేని ఏ సమాజమైనా సృజనాత్మకంగా ముందుకుపోవడంలో విఫలమవుతుంది. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థల్లో అస్తవ్యస్థలు, వివక్షలు, పరిష్కారాలు లేకపోవడం వంటి అనేక నష్టాలను సమాజం ఎదుర్కొంటుంది. ‘‘తుఫానొస్తే కొండ మీద చెట్లు కదులుతాయి కానీ, కొండ కదలదు కదా!’’ అన్నారు రావి శాస్త్రి. అలాగే మన ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని స్థిరంగా, బలంగా నిలబడింది. అందులో ప్రజామేధావుల పాత్రను మరువలేం. అందుకే నేటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ తరహా మేధావులను ప్రోత్సహించడం పౌర సమాజం బాధ్యత.
-ఎ. అజశర్మ ప్రధాన కార్యదర్శి,
ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక