Share News

The Power of Poetic Devices : కవిత్వ బలానికి కళా సాధనాలు

ABN , Publish Date - Nov 10 , 2025 | 05:58 AM

కవిత్వమంటే మనసులో ఉప్పొంగే భావాలను ఉద్వేగంగా చెప్పడమే కాదు, దానికి మించిన అర్థం, శబ్దం, భావోద్వేగాల కలయిక. కవిలో కలిగే అంతర్ బహిర్ సంఘర్షణలకు ప్రతిరూపమైన కవిత్వానికి..

The Power of Poetic Devices : కవిత్వ బలానికి కళా సాధనాలు

కవిత్వమంటే మనసులో ఉప్పొంగే భావాలను ఉద్వేగంగా చెప్పడమే కాదు, దానికి మించిన అర్థం, శబ్దం, భావోద్వేగాల కలయిక. కవిలో కలిగే అంతర్ బహిర్ సంఘర్షణలకు ప్రతిరూపమైన కవిత్వానికి ప్రాణం పోసే కళా సాధనాలు అనేకం ఉన్నాయి. ఈ సాధనాలు లేకుండా కవిత్వం ఒక ఆత్మ లేని దేహం.

గొప్ప కవులు తమ కవిత్వంలో ఒక వాతావరణాన్ని సృష్టించడానికి, శబ్దం ద్వారా మాధుర్యాన్ని ఇవ్వడానికి, ఉత్కృష్ట దృశ్యాలను ఆవిష్కరించడానికి, భావోద్వేగాలను లోతుగానూ స్పష్టంగానూ వ్యక్తీకరించడానికి, చెప్పదలచుకున్న అర్థాన్ని పొరలు పొరలుగా ప్రవేశపెట్టడానికి ఈ సాహిత్య కళా సాధనాలను ఉపయోగిస్తారు. ఫలానా సాధనాన్ని వాడుతున్నామని ప్రత్యేకంగా కవులు అనుకోరు కాని వారి కవిత్వాన్ని పరిశీలిస్తే ఇవి కనిపిస్తాయి.

వీటిలో ముఖ్యమైనవాటిని పరిశీలిద్దాం. కవిత్వంలో ‘ప్రతిబింబాలు’ (Imagery) చదువరి మనసుకి ఆనందాన్ని కలిగించే చిత్రణని ఇస్తాయి. ఉదాహరణగా చెప్పుకుంటే ‘‘ఆకాశం తేనెలా ఒలుకుతోంది.’’. ‘ఉప మానం’ (Simile) అంటే ‘‘వంటి’’ లేదా ‘‘లాగా’’ ఇలాంటి పదాలతో పోలికను సృశించడం. ‘రూపకం’ (Metaphor) అంటే నేరుగా పోలిక చేయడం. ‘జీవీకరణ’ (Personification) కవిత్వంలో నిర్జీవ వస్తువులకు మానవ లక్షణాలని ఆపాదించటం. ‘అను ప్రాస’ (Alliteration) కవితలోని పదాల ఆరంభాలలో ఒకే ధ్వనుల్ని పునరావృత్తి చేయడం.

ఇక ‘యమకం’ (Rhyme) అంటే సమాంతరంగా పద అంత్యాలలో ధ్వనుల పునరావృత్తి. ‘ఛందస్సు’ (Rhythm/ Meter) ఇది కవిత్వంలో తాళం, ఉచ్చారణ ధోరణికి ఉదాహరణ. ‘ఏంజాంబ్మెంట్’ (Enjambment) అంటే కవితలో పంక్తి ముగిసిన తర్వాత, ఆ పంక్తిలోని భావం ఆగకుండా తదుపరి పంక్తికి కొనసాగడం. ఇక ‘ముగింపు పంక్తి’ (End-stopped line) అంటే పంక్తి చివర విరామ చిహ్నాన్ని ప్రకటించడం, మరొక సాధనం ‘పునరావృత్తి’ (Repetition) కవితలో పదాలను, పదబంధాలను మళ్లీ మళ్లీ వాడడం. కవిత్వంలో ‘సంకేతం’ (Symbol) అత్యంత ప్రధానంగా కనిపించే సాధనం, అది ఒక మామూలు వస్తువు ద్వారా లోతైన భావాన్ని చెప్పడం. ‘Irony’ అంటే వాక్యంలో ఒకటి అంటూనే, దానికి విరుద్ధమైన అర్థాన్ని స్ఫురింపచేయటం. ఇది మాటల్లో ద్వంద్వార్థం ద్వారా హాస్యం, వ్యంగ్యం, లేదా ఆకస్మిక మలుపును చూపించడానికి వాడతారు.


Onomatopoeia అనేది ధ్వన్యనుకరణ శబ్దాల అలంకారం. అంటే, ఏదైనా వస్తువు లేదా చర్య పలికించే సహజమైన శబ్దాన్ని దాన్ని సూచించే పదం కూడా అనుకరించడం అన్నమాట. ఈ శబ్దం చదువరికి మానసికంగా కూడా అనుభూతిని కలిగిస్తాయి. ‘అతిశయోక్తి’ అంటే, ఏదైనా విషయాన్ని ఉద్దేశపూర్వకంగా అతిశయంగా, చాలా ఎక్కువగా చెప్పడం అన్నమాట. ఇక ‘విరోధాభాసం’ (Paradox) అనేది బయటకు తేలికగా అర్థం చేసుకున్నప్పుడు తప్పుగా అనిపించవచ్చు కానీ లోతుగా ఆలోచిస్తే అది నిజం అయ్యే వాక్యం లేదా భావన. ఇక Oxymoron అనేది వ్యతిరేక భావాలు కలిగిన రెండు పదాలను ఒకే చోట కలిపే శైలీ అలంకారం.

‘అనిశ్చితి’, ‘అస్పష్టత’ (Ambiguity) అనేది ఒక పదం, లేదా వాక్యం, లేదా భావానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు కలిగి ఉండే స్థితి. ‘ప్రత్యక్ష సంబోధన’ (Direct Address) శైలిలో రాసిన కవితలో కవి నేరుగా ఒక వ్యక్తి, వస్తువు, లేదా భావనను సంబోధిస్తూ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. Refrain అనేది ‘పునరావృత పదబంధం’. ఇందులో ఒకే పదబంధం లేదా వాక్యం ఆ కవితలో, పాటలో, లేదా ప్రసంగంలో పునరావృతంగా వస్తుంది. ‘ఇంద్రియ మిశ్రమం’ (Synaesthesia) అనేది ఒక ప్రత్యేకమైన అలంకార శైలి. ఇందులో ఒక ఇంద్రియ అనుభూతిని మరొక ఇంద్రియ ద్వారా వ్యక్తీకరిస్తారు (ఉదా: ‘‘నీ మాటలు తేనెలా మధురంగా ఉన్నాయి’’ – అంటే శబ్దాన్ని రుచిగా అనుభవించడం, రంగును మోగుతుందనిపించడం, గంధాన్ని చూడగలిగినట్లు చెప్పడం.)

ఇలా కవిత్వంలోని సాహిత్య కళా సాధనాలు కవితను కేవలం మామూలు పదాల సమాహారంగా కాకుండా, లోతైన అనుభూతి ప్రయాణంగా మార్చుతాయి. ఎవరు రాసినా కవితలు శబ్దాన్ని వినిపించాలి, చిత్రాన్ని చూపించాలి, హృదయాన్ని స్పృశించాలి. ఈ మూడింటినీ కలిపే మంత్రం కవిత్వంలోని ఈ కళా సాధనాలల్లో దాగి ఉంది. మనం రాసిన కవిత్వం బలపడాలంటే కవిత్వంలోని సాహిత్య కళా సాధనాలు మనకు మార్గదర్శకాలు.

వారాల ఆనంద్

94405 01281

ఇవి కూడా చదవండి..

కర్ణాటకలో నాయకత్వ పోరుపై బీజేపీ పేరడీ వీడియో

హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్

Updated Date - Nov 10 , 2025 | 05:58 AM