The Outdated Jagan Format: కాలం చెల్లిన జగన్ ఫార్మాట్
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:56 AM
టెస్ట్ మ్యాచ్, వన్ డే మ్యాచ్, ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అంటూ క్రికెట్‌లో రకరకాల ఫార్మాట్లు ఉన్నట్టుగానే, రాజకీయాల్లో కూడా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఫార్మాట్‌తో ప్రజల ముందుకు వస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీలో అయితే, సోనియా...
టెస్ట్ మ్యాచ్, వన్ డే మ్యాచ్, ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అంటూ క్రికెట్‌లో రకరకాల ఫార్మాట్లు ఉన్నట్టుగానే, రాజకీయాల్లో కూడా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఫార్మాట్‌తో ప్రజల ముందుకు వస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీలో అయితే, సోనియా...రాహుల్... ప్రియాంక.... నిత్య నామస్మరణ తప్పనిసరి. రోజుకోసారి అయినా ఆ పేర్లు స్మరించుకోకుండా కాంగ్రెస్ వాదులు రాజకీయాలలో మనలేరు. ఆ పార్టీ ఫార్మాట్ అది. బీజేపీలో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా కీర్తనలతో కూడిన బృందగానంతో నేతలు కథ నడిపిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు’ అనే పునాది టాగ్‌లైన్‌తో మొదలై; ఇప్పుడు ఎన్టీరామారావు స్మరణతో కార్యకర్తలకు పెద్దపీట అంటూ చంద్రబాబు, లోకేశ్ నేతృత్వంలో రాజకీయం సాగిస్తున్నది. ఇలా, ఎవరి ఫార్మాట్ వారిది.
ఇక, జగనే కర్త, కర్మ, క్రియగా సాగుతోంది వైసీపీ. ఈ పార్టీకి రాజకీయ సిద్ధాంతం ఏమీ ఉన్నట్టు కనపడదు. ‘‘తిట్టు.... కొట్టు... కనబడింది కనపడినట్టు బొక్కేయ్... తినేయ్... నొక్కగలిగినంత నొక్కేయ్... అడ్డం వస్తే లేపేయ్... కుమ్మేయ్... కుదరకపోతే లోపలేయించేయ్... ఇలాంటి బురద మొత్తం చంద్రబాబు నెత్తిమీద కుమ్మరించేయ్... లోకేశ్‌ను అపహాస్యం చేసేయ్’’ అనేది ఆ వైసీపీ రాజకీయ ఫార్మాటా అన్న అనుమానం కలగడం సహజం 2019–2024 మధ్య వారి రాజకీయ పోకళ్ళు చూస్తే. అప్పుడు వైసీపీ నిర్వాకం చూసిన జనానికి ఇంతకు మించిన ప్రపంచం దానికి ఉన్న భావన కలగలేదు. కాకినాడలో అనంతబాబును, ఆయన రాజకీయ గురువు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని, గుడివాడ, ఏలూరు, బందరులో ముగ్గురు నానీలను, సత్తెనపల్లిలో అంబటి రాంబాబును, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరులో కాకాణి గోవర్ధనరెడ్డిని, తిరుపతిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డిని... వీళ్లందరికీ రాజగురువుతో సమానుడు, అత్యంత సౌమ్యంగా... వినయంగా మాట్లాడే విజయసాయిరెడ్డిని చూసినా, ఇటువంటి వారు నియోజకవర్గానికి ఓ డజనుకు తక్కువ లేకుండా ‘ప్రజా సేవ’ చేస్తున్న వారి పనులను చూసినా... రాజకీయాలపై గానీ, రాజకీయ నాయకులపై గానీ గౌరవభావం కలగడం కష్టం. వీరందరూ ఉన్న వైసీపీ ‘పొలిటికల్ ఫార్మాట్’ ఇలా ఉంటుందని 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లకు తెలియదు. కలలో కూడా ఊహించలేదు.
రాష్ట్రంలో అసంఖ్యాక జనానికి అత్యంత ప్రీతిపాత్రుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృత్యువుపాలు కావడంతో పాటు, సాక్షాత్తు ఆయన ఏకైక కుమారుడే ఈ వైసీపీకి అధినేత కావడంతో; వారి పట్ల ప్రజల సద్భావనలతో కూడిన అంచనాలు వైసీపీ పట్ల... శ్రీహరికోట ఇస్రోలో రాకెట్లు నింగిలోకి దూసుకుపోయినట్టు దూసుకుపోయాయి. రాజన్న తనయుడు తెలుగు ప్రజలకు ‘సకల సద్గుణాభిరాముడు’లా కనిపించాడు. అసలు 2014 లోనే ఎందుకు ఆయనను గెలిపించుకోలేకపోయామా అని నాలిక్కరుచుకున్నారు. అందుకే 2014లో గెలిచిన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు ఏమి చేసినా, ఏమి మాట్లాడినా తెలుగు ప్రజలకు ఘోరాపరాధంగా కనిపించింది. 2019 ఎన్నికలకు ముందు ‘వైసీపీ ఫార్మాట్’ ఏమిటో జనానికి తెలియకపోవడం కూడా చంద్రబాబుపై వ్యతిరేకత పెరగడానికి ఒక కారణం. అప్పుడే ఫ్రిజ్ లోంచి బయటకు తీసిన ఐస్‌క్రీమ్ లాగా ఫ్రెష్‌గా నిగనిగలాడుతూ జగన్ కనపడ్డారు. పచ్చని పైర్ల మీద వాలడానికి తరుముకు వచ్చే మిడతల దండు లాగా వస్తున్న వైసీపీని చంద్రబాబు తేలిగ్గా తీసుకోవడం కూడా ఒక కారణం. (ఇప్పుడూ అలాగే చూస్తున్నారన్న భావం ఉంది.) దానితో, 2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ అధికార పీఠంపై ‘వైసీపీ ఫార్మాట్’ పరివేష్టితమై; తన రంగు, రుచి, వాసనను ప్రజలకు రుచి చూపించడం మొదలుపెట్టింది. పొలం గట్ల కలుగుల్లో అచేతనంగా... తిండీ తిప్పలు లేక, ఎండిపోయి ఉన్న కప్పలు... ఒక భారీ వర్షానికి బెక బెక మంటూ వందలు, వేలుగా బయటకు వచ్చి జనాలను హడలెత్తించినట్టుగా... మొత్తం అరాచక, సంఘవ్యతిరేక శక్తులన్నీ ఒక్కటిగా రాష్ట్రం మీద, జనం మీద, ప్రకృతి వనరుల మీదా పడిపోయాయా? అన్న భావం ప్రజలకు కలిగేటట్టుగా వైసీపీలో అధికులు వ్యవహరించారు.
ఏ రాజకీయ పార్టీలో అయినా... ఎక్కడో, ఎవరో కొద్దిమంది చట్టాన్ని ఉల్లంఘించి, ఏదో కక్కుర్తిపడడం వేరు. కానీ, గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు వైసీపీ చక్రాంకితులైన వారిలో స్థానిక సంస్థల ప్రతినిధులా, శాసనసభ్యులా, మంత్రులా, ఎంపీలా అనే తేడా లేకుండా అధికులు సాగించిన, ఎక్కడ ఏది దొరికితే దానిని దోపిడీ చేసే తీరు చూసి, తెలుగు ప్రజలు భీతావహులైపోయారు. గత డెబ్భై ఏళ్ళలో ఈ తరహా రాజకీయాలను తెలుగు సమాజం కనీ, వినీ ఎరుగదు. వైసీపీలో అధికులు గుంటూరులో రౌడీ షీటర్‌గా ముద్రపడిన బోరుగడ్డ అనిల్‌కు ఒక బెత్తెడు అటూ ఇటూగా జనానికి తమ విశ్వరూపం చూపించారు. దీంతో జింకను వేటాడే పులి వేచి ఉన్నట్టు పోలింగ్ తేదీ వరకు జనం ఓపిక పట్టి... ఈవీఎంలో బటన్ నొక్కవలసిన సమయం వచ్చినప్పుడు, బ్రహ్మకు సైతం ఉప్పు అందకుండా నొక్కేసి... నిశ్శబ్దంగా ఇళ్లకు వెళ్లిపోయారు. వైసీపీ నేతలు – పై నుంచి కింది వరకు – చంద్రబాబు ప్రభుత్వం ఘోరాలు చేసేస్తున్నదంటూ పెడబొబ్బలు, శాపనార్థాలు, తిట్లు.... చూసేవారికి వారిపట్ల చీత్కారభావం కలిగేట్టుగా మాట్లాడడం చూస్తుంటే, 2019లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 2024లో 11 సీట్లే ఎందుకు ఇచ్చారో ఆత్మావలోకనం చేసుకున్నట్టు కనపడదు. ఇక, ఆ ‘మైండ్ సెట్’తో మరోసారి వైసీపీ అధికారంలోకి రాలేదు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థలకు ‘ఎన్నికలు’ నిర్వహించినట్టుగా పులివెందుల, ఒంటిమిట్టలో నిర్వహించుకోవడం కుదరలేదనే ఉక్రోషం వైసీపీ నేతల మాటల్లో, చేతల్లో వ్యక్తమైంది. హుందాతనం పూర్తిగా లోపించింది. వారి ప్రచార సాధనాల్లో, వారి ఆస్థాన విశ్లేషకాచార్యుల వ్యాఖ్యల్లో కూడా వైసీపీ మైండ్‌సెట్టే ప్రతిఫలించింది. దక్షిణ కొరియాపై, తన సరిహద్దు లౌడ్ స్పీకర్ల ద్వారా ఉత్తర కొరియా సాగించే దుష్ప్రచారం స్థాయిలో... కూటమి నేతలు, పోలీసులపై వైసీపీ గొంతులు దుమ్మెత్తి పోశాయి. పోలీసుల మీద చేయడానికి వీలున్న అన్ని ఆరోపణలూ చేశారు.
ప్రజా జీవితంలో కొనసాగాలని వైసీపీ భావిస్తున్నట్టయితే... అరాచకవాదులు, దౌర్జన్యకారులు, కబ్జాకోరులు, దోపిడీదారులు, హంతకులు, విధ్వంసకారులు, సంఘ వ్యతిరేక శక్తులు అంటూ సమాజంలో ఉన్న బలమైన ముద్రను సంపూర్ణంగా తొలగించుకోవడానికి ఏమి చేయాలో... వైసీపీ అధినేత అది చేయాలి. ఆ పని చేయకుండా, తమ సర్వ అవలక్షణాలన్నింటినీ కూటమికి (అంటే చంద్రబాబు, లోకేశ్‌కు) ఆపాదిస్తూ దుమ్మెత్తి పోయడం, లేకి ప్రచార సాధనాలతో పోయించడం, పేటీఎం విశ్లేషకాచార్యులతో మాట్లాడించడం వంటి చర్యలు.... చెక్క గుర్రంపై కూర్చుని ఊగడం వంటివే. కూటమి ప్రభుత్వంపై జనంలో అసంతృప్తి ఎన్నికల నాటికి వ్యక్తమయ్యే పరిస్థితులు వస్తాయని వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్నప్పటికీ; ఇప్పటి మైండ్‌సెట్, ఇప్పటి ఫార్మాట్‌తో... ఆ పార్టీ వైపు ప్రజలు కన్నెత్తి చూడరు. బలమైన కేసులు ఒక్కొక్క అడుగే ముందుకు జరుగుతూ జగన్ పరివారాన్ని మెల్లగా చుట్టుముడుతున్నాయి. వివేకా దారుణ హత్య ఘటనలో నిందితులకు ఉరిశిక్ష విధించే అవకాశం ఉన్నదని సీబీఐ న్యాయవాది సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే అన్నారంటే... తాను, తన పరివారం ఏ స్థాయి నేరారోపణాల్లో ఇరుక్కుపోయి ఉన్నారో జగన్ గమనించాలి. లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడిగా అన్ని వేళ్లూ జగన్ వైపు చూస్తున్న వైనం ప్రజల్లోకి బలంగా వెళ్లిన విషయం కూడా వైసీపీయులు గమనించుకోవాలి. ‘ప్రభుత్వం’ పేరిట చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ చేసే అవకతవకలు తమను 2019లో లాగా అధికారం ోకి తీసుకువస్తాయని పగటి కలలు కంటూ ఉంటే; వాటి అర్థం ఏమిటని ప్రవచనకారుల్ని అడిగితే... వారు బాగా విడమరచి చెబుతారు.
-భోగాది వేంకటరాయుడు