Generational Shift: తరాల మార్పుతోనే జాతికి నవోదయం
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:54 AM
దేశ రాజకీయాలలో మార్పులు ఎలా సాధ్యమవుతాయి? తరాల మార్పుతోనే జాతి ప్రస్థానంలో మేలు మలుపులు సంభవిస్తాయని అసంఖ్యాకులు సునిశ్చితంగా విశ్వసిస్తున్నారు.....
దేశ రాజకీయాలలో మార్పులు ఎలా సాధ్యమవుతాయి? తరాల మార్పుతోనే జాతి ప్రస్థానంలో మేలు మలుపులు సంభవిస్తాయని అసంఖ్యాకులు సునిశ్చితంగా విశ్వసిస్తున్నారు. మరి అటువంటి మార్పుల ఆగమన సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? దేశ పాలనా వ్యవహారాలను నిర్దేశిస్తున్న నాయకత్వంలో తరం మార్పును మనం చూడగలమా? 1960వ దశకం తొలినాళ్లలో దేశ నాయకత్వంలో ఒక కొత్త తరం రానున్నదని చాలా మంది భావించారు. ఆ భావనతోనే ‘నెహ్రూ తరువాత ఎవరు?’ అనే విషయమై మథనపడ్డారు. దేశానికి కొత్త నాయకత్వం ప్రభవించనున్నదన్న ఆశ, ప్రభవించాలన్న ఆకాంక్షలే ఆ మథనంలో అంతర్లీనంగా ఉన్నాయి. ‘కామరాజ్ ప్రణాళిక’ (1963) అటువంటి ఆశాభావానికి ఆలంబన అయింది. ఎస్‌కె పాటిల్, అతుల్య ఘోష్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి మొదలైన పాత కాంగ్రెస్ యోధుల నిష్క్రమణతో దేశ నాయకత్వంలో తరం మార్పు సంభవిస్తుందనే నిండు నమ్మకం ప్రజల్లో నెలకొన్నది. అయితే ఆ నమ్మకం వమ్ముకావడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘మరలి వచ్చిన ఎర్ర గులాబీ’గా కీర్తిహారతి నందుకున్న నెహ్రూ తనయ ఇందిరాగాంధీ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తన నాయకత్వాన్ని పటిష్ఠం చేసుకుని అధిష్ఠానవర్గ సంస్కృతిని కొనసాగించారు. ఈ యువ నాయకురాలు దేశానికి కొత్త ప్రజాస్వామిక నాయకత్వ వెలుగులను ఇవ్వలేకపోయారు.
దేశ పాలనా వ్యవహారాలు, ఎన్నికల రాజకీయాలలో ధోరణులను నేను చాలా కాలంగా విశ్లేషిస్తూ వస్తున్నాను. 1964లో జవహర్‌లాల్ నెహ్రూ కీర్తిశేషుడు అయిన నాటి నుంచి ప్రస్తుత దశకం దాకా దేశ నాయకత్వంలో తరాల మార్పుకు మంచి అవకాశాలు మూడుసార్లు తప్పిపోయాయని నా విశ్లేషణల్లో అవగతమయింది. ఐదేళ్ల వ్యవధిలో తరం మార్పు జరగడమనేది అసంభవం. అయితే ఒక దశాబ్ద కాలంలో అటువంటి మార్పుకు కనీసం సూచనలు తప్పక కనిపిస్తాయి. 1967 నుంచి 1987 మధ్య కాలంలో తరం మార్పుకు మొదటి మంచి అవకాశం తప్పిపోయింది. ప్రస్తావిత రెండు దశాబ్దాల కాలంలో కనీసం మూడుసార్లు తరం మారనున్నదనే సూచనలు మెరిశాయి. యువజనులు ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు మున్నెన్నడూ లేని విధంగా దేశ వ్యవహారాలలో తమ ఉనికిని బలంగా చాటారు. 1967లోనే 29 ఏళ్ల యువకుడు ఒకరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోగా మైనారిటీ మత వర్గానికి చెందిన ఆ యువకుడు మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఎమ్‌ఓహెచ్ ఫరూఖ్ (1937–2012) గురించి నేను ప్రస్తావిస్తున్నాను. 1970వ దశకం తొలినాళ్లలో గుజరాత్ విద్యార్థులు ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి వల్ల తమకు జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబాటు చేశారు. నవ నిర్మాణ్ సమితిగా సంఘటితమయ్యారు. ఆ విద్యార్థి ఉద్యమం బిహార్‌కు వ్యాపించింది. ఆ రాష్ట్రంలో అది లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవం ఉద్యమానికి భూమిక అయింది. ఈ ఉద్యమం నుంచి ప్రభవించిన పలువురు యువ నేతలు ఆ తరువాత దేశ ప్రధాన స్రవంతి రాజకీయాలలో అంతర్భాగమయ్యారు. 1977లో జాతీయ స్థాయిలో నాయకత్వం మార్పుకు అవకాశం వచ్చినప్పుడు ఆ యువ నాయకులలో ఏ ఒక్కరికీ అధికార అందలాలు దక్కలేదు. ఎనిమిది దశాబ్దాలకు పైగా వయసున్న ఒక వృద్ధనేత ప్రధానమంత్రి అయ్యారు. అయితే పట్టుమని రెండున్నర సంవత్సరాలు కూడా ఆయన ఆ పదవిలో కొనసాగలేకపోయారు. 1985లో ఈశాన్య భారతదేశంలో ఒక విద్యార్థి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
అదృష్టవశాత్తునో లేదా యాదృచ్ఛికంగానో ఆయనకు ఆ పదవి లభించలేదు. ఒక చరిత్రాత్మక విద్యార్థి ఉద్యమం కారణంగానే ఆ యువ నేతకు ఆ ఉన్నతి లభించింది. ఇదే కాలంలో, ఆ తరువాత ఎంతో మంది యువ నేతలకు స్ఫూర్తిగా వెలుగొందిన ఒక యువ నాయకురాలు దేశంలో ప్రప్రథమంగా అత్యంత చిన్న వయసులో రాష్ట్ర కేబినెట్ మంత్రి అయ్యారు. 25 సంవత్సరాల వయసులోనే మంత్రి అయిన సుష్మాస్వరాజ్ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. అప్పట్లో ఆమె పార్టీకి లోక్‌సభలో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉండేవారు. యువతరాన్ని తమ పార్టీ వైపు ఆకర్షించడంలో ఆ యువ నాయకురాలు విశేషంగా కృషి చేశారు. ఈ సందర్భాలు అన్నీ దేశ నాయకత్వంలో తరం మార్పుకు దోహదం చేసి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. దేశానికి అవసరమైన తరం మార్పుకు మంచి అవకాశాలు వ్యర్థమైపోయాయి. 1992–2004 సంవత్సరాల మధ్య కాలంలో కూడా తరాల మార్పుకు మరో అవకాశం తప్పిపోయింది. కేంద్రంలో అనిశ్చితి నెలకొని వున్న కాలమది. ఆ కాలంలో దీక్షాదక్షతలు ఉన్న ఒక యువ ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రధానమంత్రి పదవికి యోగ్యులైన నేతలను ఎంపిక చేయడంలో కీలక పాత్ర వహించారు. అయితే ఆ యువ ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో కీలక స్థానానికి రాలేకపోయారు. అలా జరిగి ఉన్నట్టయితే తరాల మార్పుకు అది ఆరంభమయి ఉండేది. తరాల మార్పునకు దోహదం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు దేశ పాలనకు సారథ్యం వహిస్తున్నారు. మార్పు కోసం ప్రజలు, స్థానిక సమాజాల నుంచి ఉద్యమం అనేది ఏదీ లేకుండా తరం మార్పుకు ఆస్కారమున్న అరుదైన అవకాశం ఇది. ఆ శక్తిమంతమైన వ్యక్తి సంకల్పాలు, నిర్ణయాలు ఎటువంటి మౌలిక మార్పులకు దారితీస్తాయో పార్లమెంటుకు కొత్త భవన నిర్మాణం, దేశ రాజధాని రూపురేఖల నవీకరణే తిరుగులేని నిదర్శనాలు.
దేశ నాయకత్వం తరం మార్పులో ఉందని ఎప్పుడు చెప్పగలుగుతాము? ఈ పరివర్తన ప్రక్రియకు నాలుగు అంశాలు దోహదం చేస్తాయి. అత్యున్నత పదవులలో ఉన్నవారి వయసు, విద్యార్హతలు దేశ పాలనా ప్రాథమ్యాలు, అభివృద్ధి అజెండాను నిర్ణయించడంలో కీలక పాత్ర వహిస్తాయి. అలాగే వారి కుటుంబ నేపథ్యం, జట్టు స్ఫూర్తి అనేవి కూడా తరం మార్పు ప్రక్రియను విశేషంగా ప్రభావితం చేస్తాయి. కొత్తతరం ప్రజాప్రతినిధులు, నాయకులు ఉమ్మడి చైతన్యంతో కలిసికట్టుగా దేశ సమస్యల పరిష్కారానికి కృషి చేయవలసి ఉన్నది. ఓటుహక్కుకు అర్హత పొందే వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు చట్టసభలలో యువజనులకు మరింత ప్రాతినిధ్యం తప్పక పెరుగుతుందని అందరూ భావించారు. అయితే మూడు దశాబ్దాలు గడిచిపోయి, ఆరు సార్వత్రక ఎన్నికల అనంతరం కూడా ఆ మెరుగుదల పెద్దగా కనిపించడం లేదు. ప్రజాప్రతినిధుల, మంత్రుల విద్యార్హతల స్థాయి కూడా అసంతృప్తికి తావిచ్చేవిగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కేబినెట్ మంత్రులలో 15 నుంచి 48 శాతం వారి విద్యార్హతలు ఉన్నత పాఠశాల స్థాయికి మించి లేవు. ‘జెన్ జడ్’ ఉద్యమం కారణంగా నేపాల్ గత నెలలో ఓటుహక్కు వయసును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించింది. ప్రజాప్రతినిధులు, మంత్రులలో చాలా మంది ఆస్తిపరులు, రాజకీయ కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. డబ్బు, పలుకుబడితోనే వారు పదవులు పొందగలుగుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం పంచాయతీరాజ్ వ్యవస్థల్లో మహిళలకు తప్పనిసరిగా మరింత ప్రాతినిధ్యం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ జరిగింది. అయినప్పటికీ చట్టసభలలో మహిళా ప్రాతినిధ్యం ఏమంతగా పెరగనే లేదు. 75 సంవత్సరాల వయసు పైబడినా ప్రజాజీవితం నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్న నాయకులు సైతం చాలా అరుదుగా మాత్రమే ఉన్నారు. ఈ సందర్భంగా నానాజీ దేశ్‌ముఖ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. మూడు దశాబ్దాల క్రితం ఆయన అన్ని పదవులనూ త్యజించి రాజకీయ జీవితం నుంచి సన్యాసాశ్రమంలోకి వెళ్లారు. సాంఘిక సేవా కార్యక్రమాలకే పూర్తిగా అంకితమయ్యారు. చట్టసభలలో ‘ప్రాతినిధ్య స్వభావాన్ని’ మెరుగుపరిచేందుకు తక్షణమే తగు చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
తరం మార్పును సాధించే విధంగా ఆ చర్యలు ఉండి తీరాలి. తొలుత శాసనసభలు, పార్లమెంటులో యువజనుల, మహిళల ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు సంకల్పించాలి. అవినీతి ఆరోపణల నెదుర్కొంటున్నవారికి ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వబోమని అన్ని రాజకీయ పార్టీల నాయకులు బహిరంగంగా ప్రకటించి ఆ మాటకు నిబద్ధమై ఉండాలి. మన చట్టసభలలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారు వందల సంఖ్యలో ఉన్నారన్నది పచ్చి నిజం. కోర్టు కేసుల నెదుర్కొంటున్నవారు ఎన్నికలలో మరోసారి పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలి. 2029 సార్వత్రక ఎన్నికల నాటికి ఈ ప్రక్షాళన ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలు కావాలి. అలా జరగని పక్షంలో స్వాతంత్ర్య శతాబ్ది (2047) నాటికి దేశ రాజకీయ నాయకత్వంలో తరం మార్పు సంభవించడం జరగదు. అది ఎప్పటికీ సాకారమవ్వని స్వప్నంగానే మిగిలిపోతుంది.
-నాగులాపల్లి భాస్కరరావు
సీఎంఎస్ అధినేత, సామాజిక విధాన పరిశోధకుడు