Bankim Chandra Chatterjee: జాతీయోద్యమ చైతన్య జీవనాడి
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:53 AM
వందేమాతరం నినాదం లేని స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఊహించలేం. ఆనాడు బ్రిటిష్ వారు వెయ్యి ఫిరంగులు ఎత్తి పెడితే మన భారతీయులు వందేమాతరం నినాదంతో 1000 ఫిరంగులకు మించిన...
వందేమాతరం నినాదం లేని స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఊహించలేం. ఆనాడు బ్రిటిష్ వారు వెయ్యి ఫిరంగులు ఎత్తి పెడితే మన భారతీయులు వందేమాతరం నినాదంతో 1000 ఫిరంగులకు మించిన భయాన్ని బ్రిటిష్ వారిలో పుట్టించారు. ‘వందేమాతరం’ అని పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా నినదించారు. అంత గొప్ప స్ఫూర్తిని, ఉద్యమకాంక్షను రగిలించిన ఆ శక్తిమంతమైన గీతమే మన జాతీయ గీతం అయినది. నర నరాన దేశభక్తిని నింపిన వందేమాతర గీతంలో భారతదేశ గొప్పతనం తెలుస్తుంది. బ్రిటిష్ వారి మెడలు వంచిన సమరఘోషే వందేమాతరం. మన జాతీయ గీతం వందేమాతరం. దీన్ని 1875 నవంబరు 7న బంకించంద్ర ఛటర్జీ రాశారు. బ్రిటిష్ కొలువులో.. భారతీయ ఆత్మతో పనిచేసిన ఛటర్టీ (1838–94) బెంగాలీ కవి, వ్యాస రచయిత, సంపాదకుడు. ఆయన రాసిన ‘ఆనంద్ మఠ్’ అనే నవల నుంచి ఈ అజరామర వందేమాతరం గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవాన్ని నేడు దేశ ప్రజలంతా జరుపుకుంటున్నారు. నవంబర్ 7న ఒక నిర్ణీత సమయంలో దేశ ప్రజలందరూ ఈ గీతాలాపన చేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ‘ఆనంద్ మఠ్’ నవల 1882లో ప్రచురితమైంది. 1884 ఏప్రిల్ 8న బంకించంద్ర ఛటర్జీ మరణించాక, 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరకల్పన చేసి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. అక్కడి నుంచి వందేమాతరం అందరి నోళ్లలో నినాదంగా మారింది. 1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్‌ను విభజించడంతో ప్రజ్వరిల్లిన ఆందోళన వందేమాతర ఉద్యమంగా పరిణమించింది. ఇది బ్రిటిష్ వారికి శత్రు నినాదంగా మారిపోయింది. భారతదేశ చరిత్రలో వందేమాతర ఉద్యమం ఒక నూతన శకానికి నాంది పలికింది. బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతర గీతం స్వాతంత్ర్య పోరాటంలో ఉద్యమకారులకు ఎనలేని స్ఫూర్తినిచ్చింది. వందేమాతర ఉద్యమం బెంగాల్‌కు మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తమైంది. మొదట్లో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మితవాదుల నేతృత్వంలో జరిగినా క్రమంగా అతివాద, తీవ్రప్రభావ నాయకత్వానికి మరలింది. ఈ ఉద్యమాన్ని బెంగాల్ నుంచి దేశవాప్తంగా ప్రచారం చేయడంలో బిపిన్ చంద్రపాల్ ప్రముఖ పాత్ర పోషించారు. మద్రాస్, ఆంధ్ర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.
బెంగాల్‌లో బిపిల్ చంద్రపాల్, అరవింద ఘోష్; బరిసాల్‌లో అశ్వనీకుమార్; దత్త పంజాబ్, ఉత్తర భారత్‌లలో లాలా లజపతిరాయ్, అజిత్ సింగ్, హన్స్‌రాజ్; పశ్చిమ భారత్ (పూనా, ముంబయి)లో తిలక్, పరంజపే, మద్రాస్‌లలో చిదంబరం పిళ్లై, సుబ్రహ్మణ్య అయ్యర్, ఆనందాచార్యులు, టి.ఎం. నాయర్; ఆంధ్రలో గాడిచర్ల, పట్టాభి, అయ్యదేవర; ఢిల్లీ & జమ్మూలలో సయ్యద్ హైదర్ రాజా; యునైటెడ్ ప్రావిన్స్‌లలో మదన్‌మోహన్ మాలవ్యా, మోతీలాల్ నెహ్రూ; బెనారస్‌లో సుందర్‌లాల్ మొదలైనవారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ దేశభక్తులు అందరూ వందేమాతరంలో స్వాతంత్ర్య కాంక్షను చూశారు కానీ.. మతం కోణం చూడలేదు. ఈ గీతం భారతీయులలో స్వాతంత్ర్యకాంక్ష రగిల్చింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక, 1950 జనవరి 24న రాజ్యాంగ సభ ‘వందేమాతరం’ గీతాన్ని ‘జనగణమన’తో సమానంగా గౌరవిస్తూ జాతీయ గీతంగా అధికారికంగా స్వీకరించింది. భారత స్వాతంత్రోద్యమంలో వివిధ దశలలో జరిగిన ఉద్యమాలలో సామాన్యులు, స్వాతంత్ర్యోద్యమకారులు, తెల్లవాళ్ల చేతుల్లో బానిస జీవితాన్ని కొనసాగించిన ప్రతి భారతీయుడి చైతన్యంలో వందేమాతరం జీవనాడి అయింది.
-నర్సింగు కోటయ్య