Share News

Suravaram Sudhakar Reddy: ప్రజాగ్రహ గళం ఉద్యమాల దళం

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:21 AM

ఆదర్శం ఆచరణల సముచిత సమన్వయం కమ్యూనిజమే నిజమని చెదరని విశ్వాసం’గా జీవితాంతం అరుణపతాకం నీడ కింద జీవితాన్నీ, వ్యక్తిత్వాన్నీ తీర్చిదిద్దుకున్న ఆదర్శ కమ్యూనిస్టు సురవరం సుధాకరరెడ్డి.

Suravaram Sudhakar Reddy: ప్రజాగ్రహ గళం  ఉద్యమాల దళం

దర్శం ఆచరణల – సముచిత సమన్వయం/ కమ్యూనిజమే నిజమని – చెదరని విశ్వాసం’గా జీవితాంతం అరుణపతాకం నీడ కింద జీవితాన్నీ, వ్యక్తిత్వాన్నీ తీర్చిదిద్దుకున్న ఆదర్శ కమ్యూనిస్టు సురవరం సుధాకరరెడ్డి. 1942 మార్చి 25న అప్పటి మహబూబ్‌నగర్‌ జిల్లా కొండ్రావు పల్లెలో సురవరం వెంకట్రామరెడ్డి–ఈశ్వరమ్మ దంపతులకు పుట్టిన సుధాకరరెడ్డి పెదనాన్న సురవరం ప్రతాపరెడ్డి. పెదనాన్న నుంచి సంక్రమించిన సాహిత్యాభినివేశం, తండ్రి నుంచి లభించిన స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో బాల్యం నుంచి ఉద్యమ లక్షణాలు పుణికి పుచ్చుకున్న సుధాకరరెడ్డి పువ్వుపుట్టగానే పరిమళిస్తుందన్నట్లు పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే స్కూల్‌లో బ్లాక్‌బోర్డులు, చాక్‌పీసులు, పాఠ్యపుస్తకాలు కావాలంటూ 15 ఏళ్ళ ప్రాయంలోనే ఆందోళనకు నాయకత్వం వహించాడు. అది క్రమంగా జిల్లా వ్యాప్త ఆందోళనగా విస్తరించి, సమస్య పరిష్కారానికి దారితీసింది. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావజాలం ఆయనను ఆకర్షించింది.


1950లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య కర్నూలు పట్టణ కార్యదర్శిగా, తర్వాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాడు. 1964లో కర్నూలు కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1967లో ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయకళాశాల విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర బాధ్యతలు చేపట్టాడు. 1970లో అఖిల భారత విద్యార్థి సమాఖ్యకు, 1972లో అఖిల భారత యువజన సమాఖ్యకు జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించాడు. 2000లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి చరిత్రాత్మకమైన విద్యుత్‌ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. 1988లో, 2004లో నల్లగొండ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. నల్లగొండలో ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి కృషి చేశాడు. కేరళ యువనేత సి.కె.చంద్రప్పన్‌తో కలిసి 18 ఏళ్ళకే ఓటుహక్కు కోసం లోక్‌సభలో గళమెత్తి, తమ డిమాండ్‌ను సాధించాడు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పార్లమెంట్‌లో పీడిత ప్రజల పక్షాన, శ్రామిక జనం, రైతాంగం, మహిళల సమస్యలపై బలమైన గళగర్జనలు వినిపించాడు. ప్రజల న్యాయమైన హక్కుల సాధన కోసం అవిశ్రాంతంగా కృషి చేశాడు. ప్రభావవంతమైన వక్తగా మూడుతరాల విద్యార్థులను, యువజనులను, శ్రామికులను ప్రభావితం చేసిన సుధాకరరెడ్డి మూడు పర్యాయాలు (2012 నుంచి 2019 వరకు) సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాడు. చండ్ర రాజేశ్వరరావు తరువాత భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రెండవ తెలుగు నేత సురవరం కావడం విశేషం.


సుధాకరరెడ్డి నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ, జాతీయస్థాయిలోనూ అన్ని ప్రజాసంఘాలలో క్రియాశీలంగా పనిచేశాయి. వారి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే 2003లో హైదరాబాద్‌ నగరంలో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం జాతీయ మహాసభలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తొలిదశ ఉద్యమం (1969) సందర్భంగా ‘సమైక్యాంధ్ర’ నినాదం చేపట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సాధన తుదిదశ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు సంపూర్ణమైన మద్దతును ప్రకటించడం వెనుక సుధాకరరెడ్డి ప్రమేయం నిత్య స్మరణీయం. జీవితంలోనూ, ఉద్యమ ప్రస్థానంలోనూ ఎన్నో ఒడిదుడుకులనూ, జయాపజయాలనూ ఎదుర్కొంటూనే తాను నమ్ముకున్న కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం అంకితమై పురోగమించిన సురవరం సుధాకరరెడ్డి జీవితం, వ్యక్తిత్వం, సిద్ధాంతం నేటితరానికీ, రానున్న తరాలకూ స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం.

-ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ పూర్వ ఉపకులపతి,

తెలుగు విశ్వవిద్యాలయం

Updated Date - Aug 24 , 2025 | 12:21 AM