Caught Between Faiths: ఇరు మతాల మధ్య ఎటూ కాని మాలలు!
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:53 AM
భారతదేశంలో హిందూ మతం వదిలి క్రైస్తవ మతం స్వీకరించిన అంటరాని జాతులు ఎదుర్కొనబోయే పరిస్థితుల గురించి డా. అంబేడ్కర్ ‘అస్పృశ్యులకొక హెచ్చరిక’, ‘హిందువుల నుంచి దూరంగా...
భారతదేశంలో హిందూ మతం వదిలి క్రైస్తవ మతం స్వీకరించిన అంటరాని జాతులు ఎదుర్కొనబోయే పరిస్థితుల గురించి డా. అంబేడ్కర్ ‘అస్పృశ్యులకొక హెచ్చరిక’, ‘హిందువుల నుంచి దూరంగా’, ‘కులం – మతాంతీకరణ’, ‘మతం మార్చుకొన్న దళితుల పరిస్థితి’ మొదలైన వ్యాసాలలో విపులంగా చర్చించారు. ఆయన ఈ వ్యాసాలు రాసి దాదాపు వందేళ్ళవుతోంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక అంటరాని జాతుల ప్రజలను షెడ్యూల్డు కులాలు అని పిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా 35కోట్ల మంది అంటరాని జాతుల ప్రజలు నేటికీ హిందువులుగా ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో కన్వర్టెడ్ క్రిస్టియన్లు 2శాతం, హిందూ మాల, హిందూ మాదిగ కుల సర్టిఫికెట్లతో విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాలు పొందుతూ చర్చిలకు వెళ్ళే ప్రజలు 20శాతం ఉంటారు. 1928లో సైమన్ కమిషన్ దక్షిణ భారత పర్యటన సందర్భంగా... ఇక్కడి క్రైస్తవ వర్గాల వారు తమ స్థితిగతులపైన కుల సమస్యపైన సమర్పించిన వినతి పత్రంలో ‘‘మతాంతరీకరణ పొందిన దళిత క్రైస్తవుల జీవన స్థితిగతులు, మతమార్పిడి చెందని హిందూ దళిత వర్గాల జీవన స్థితిగతులు ఒకేరకంగా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. 2025లో కూడా ఇంకా ఈ పరిస్థితులే కొనసాగుతున్నాయి. నేడు క్రైస్తవంలో కూడా కులాధిపత్యం, మత వివక్ష తీవ్రంగా కొనసాగుతున్నాయి. కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, మాల, మాదిగ క్రైస్తవులు తమ కులాల క్రైస్తవులతో మాత్రమే సంబంధ బాంధవ్యాలు కలుపుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపిన కారంచేడు, చుండూరు ఉద్యమ ఫలాలను క్రైస్తవ సంస్థలు, ఎన్‌జీఓలు వందల కోట్ల నిధుల రూపంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి తెచ్చుకున్నాయి. దళిత ఉద్యమ ఫలితంగా ప్రభుత్వాలు స్పందించి విద్య, ఉపాధి, ఉద్యోగ, సంక్షేమ, పునరావాస పథకాలను బాధితులకు అందించాయి.
దళిత ఉద్యమ ఫలితంగానే యస్.సి, యస్.టి అత్యాచార చట్టం అమలులోకి వచ్చింది. క్రైస్తవ చర్చిలు, ఎన్‌జీఓలు మాత్రం రకరకాల దళిత ఉద్ధరణ ప్రాజెక్టుల ద్వారా వందల కోట్ల విదేశీ నిధులు తెచ్చుకొని బాధితులకు కానీ, దళిత క్రైస్తవులకు కానీ పైసా విదల్చలేదు. నేటికీ చర్చిలు, ఎన్‌జీఓలు దళిత ఉద్ధరణ పేరుతో విదేశీ నిధులు పొందుతూ విలాసవంతమైన సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 2 కోట్ల 80 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. వీరిలో 30 లక్షల మంది అగ్రకులస్థులు. 2 కోట్ల 50 లక్షల మంది హిందూ మతం వదలి క్రైస్తవ మతం స్వీకరించిన దళితులు. వీరంతా కన్వర్టెడ్ క్రిస్టియన్లు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అధికారికంగా క్రైస్తవం స్వీకరించిన వారు బీసీ(సీ)గా పరిగణించబడుతున్నారు. వీరు దళిత కులాల జనాభాలో 2శాతం. వీరు కాకుండా దళిత కులాలలో 20శాతం మంది హిందూ, మాల మాదిగ కులాలుగా ధ్రువీకరణ పత్రాలు పొంది విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, సంక్షేమ ఫలాలు పొందుతూ చర్చిలకు వెళుతున్నారు. హిందువులుగా కొనసాగుతున్న 80శాతం మంది మాలలకు ఎలాంటి అస్తిత్వం లేదు. కారణం హిందువులుగా కుల ధ్రువీకరణ పత్రాలు పొంది క్రైస్తవ మత విశ్వాసంలో ఉన్న మాలలే విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ముందున్నారు. హిందూ మాలలు 80శాతం మందిని హిందూ సమాజం దూరంగా నెట్టివేస్తే, అన్ని రంగాలలో ముందున్న క్రైస్తవ మాల సమాజం అన్యులుగా ముద్ర వేసి మరింత దూరం పెట్టింది. దళిత ఉద్యమ, పోరాటాల ఫలితంగా, విద్యా, ఉద్యోగ సంక్షేమ రంగాలలో ఎస్సీ, ఎస్టీల కోసం బడ్జెట్ కేటాయింపులు పెరిగి ఉచిత, విద్య, వైద్యం, హాస్టళ్ళు, ఫీజు రీయింబర్స్‌మెంటు వంటి అనేక ఆర్థికాభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. క్రైస్తవ మిషనరీలు పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలు ఆపివేసాయి. మిషనరీల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విద్యా సంస్థలు, హాస్పిటల్ సేవలు అన్నీ ఫీజులు చెల్లించి పొందాల్సిన పరిస్థితి దళిత క్రైస్తవులకు ఏర్పడింది.
మతం మార్చుకొని, క్రైస్తవ జీవన విధానంలో ఉన్న అంటరాని వారి సామాజిక స్థాయిని క్రైస్తవం పెంచగలిగిందా అంటే అదీ లేదు. దళిత క్రైస్తవ విద్యావంతులకు తమ కుల సమస్యల పట్ల స్పందించి పోరాడే గుణం లేదు. హిందూ మతం దళితులను అంటరాని వారిగా సమాజానికి దూరంగా తరిమివేసింది. క్రైస్తవ మతం మాల మాదిగ పల్లెలను కేథలిక్కులు, ప్రొటస్టెంట్లు, బాప్టిస్టులు, బ్రదరన్ గ్రూపు, యెహోవా సాక్షులు... ఇలా ముక్కలు చెక్కలుగా దళితుల సంఘటిత శక్తిని నిర్వీర్యం చేసింది. దళిత విద్యావంతులు, రిజర్వుడు ఉద్యోగులు తమ దళిత సోదరుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయకుండా, అంతా ప్రభువే చూసుకుంటాడు అని శుష్క పలుకులు పలుకుతున్నారు. హిందువులుగా ఉన్న 80 శాతం మాలలు హిందూ సమాజం నుంచి, తమ పొరుగున ఉన్న దళిత క్రైస్తవ సమాజం నుంచి కూడా తిరస్కారం పొందుతున్నారు. వారు అగ్రకుల హిందువులకు, దళిత క్రైస్తవులకు మధ్య నలిగి అస్తిత్వాన్ని కోల్పోయారు. హిందువులుగా ఉన్న మాలలు ఆచరిస్తున్నది నేడు సమాజంలో ఉన్న కులాధిపత్య, నిచ్చెనమెట్ల, ఛాందస బ్రాహ్మణ, మనువాద, సనాతన హిందూ ధర్మం కాదు. భారత దేశాన్ని నిర్మించి, పాలించిన, సింధూ నాగరికత, వ్యవసాయ సంస్కృతి, సహోదరత్వం, సకల జనుల క్షేమం పునాదిగా ఉన్న మాతృస్వామిక పురాతన హిందూ ధర్మాన్ని వారు ఆచరిస్తున్నారు. బేతాళ పురాణం, మాల చెన్నయ్య కథ, జాంబపురాణం, కాకతీయ సామ్రాజ్య సేనాధిపతి యుగంధురుడు, పల్నాటి సర్వసైన్యాధ్యక్షుడు మాలకన్నమనీడు, మాలమాస్టీన్‌లు, వీరవిద్యావంతులు, హరిదాసులు, గతించిన నాగరాజ్యాలు, గణాలు, ఉరుముల కథకులు, కాటిపాపరులు, పోలేరమ్మ, గొంతేలమ్మ, గంగమ్మ, అంకాలమ్మ, పోచమ్మ జాతరులు, దేవర స్థలాలు... ఇవన్నీ నేటికీ మనుగడలో ఉండి హిందూ మాలల సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. సర్వమానవాళి శ్రేయస్సును కాంక్షించే పురాతన హిందూ ధర్మాన్ని నేటికీ ఆచరిస్తున్న మాల హిందువులు క్రైస్తవ సంస్థల ఉన్మాదం, వివక్ష, దోపిడీతో పాటు అన్ని రకాల మతోన్మాదాలను సమైక్యంగా తిప్పికొట్టి, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి.
-మల్లెల వెంకట్రావు మాలమహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు