Gandhis Grandsons: చరితార్థుడైన చరిత్రకారుడు
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:42 AM
మహాత్మాగాంధీకి నలుగురు కుమారులు ఉన్నారు. ప్రథమ, ద్వితీయ పుత్రులు హరిలాల్, మణిలాల్‌ను ఆయన వేధించారు. మూడో
మహాత్మాగాంధీకి నలుగురు కుమారులు ఉన్నారు. ప్రథమ, ద్వితీయ పుత్రులు హరిలాల్, మణిలాల్‌ను ఆయన వేధించారు. మూడో తనయుడు రామ్‌దాస్ పట్ల ఆదరభావంతో ఉండేవారు. కనిష్ఠ కుమారుడు దేవదాస్ జన్మించేనాటికి బిడ్డల పట్ల మరింతగా ఆప్యాయతానురాగాలు చూపే తండ్రిగా పరిణతి పొందారు. చిన్నారి దేవో తల్లి కస్తూరిబాకు బాగా ప్రేమాస్పదుడైన బిడ్డ. మృదుస్వభావి అయిన దేవదాస్ ఆశ్రమ జీవితంలో బాగా ఒదిగిపోయారు. పెద్దవాడవుతున్న కొద్దీ తండ్రి చెప్పిన పనులన్నీ మారు మాట్లాడకుండా నిర్వర్తించేవారు. నూలు వడికేవారు, దక్షిణ భారతీయులకు హిందీ బోధించేవారు.
ఒక సందర్భంలో మాత్రం తండ్రిని దేవదాస్ ధిక్కరించారు. గాంధీ సన్నిహిత సహచరుడు, రాజాజీగా సుప్రసిద్ధుడైన సి.రాజగోపాలాచారి కుమార్తె లక్ష్మితో దేవదాస్ ప్రేమలో పడ్డారు. వారి ప్రేమను గాంధీ, రాజాజీ ఇరువురూ వ్యతిరేకించారు. బిడ్డల ప్రేమను పరీక్షించేందుకు ఐదు సంవత్సరాల పాటు పరస్పరం మాట్లాడుకోకూడదని, ఉత్తరాలు సైతం రాసుకోకూడదని దేవదాస్, లక్ష్మిలను వారి తండ్రులు ఆదేశించారు. యువ ప్రేమికులు ఐదేళ్ల పాటు తమ తండ్రుల ఆదేశాన్ని ఓర్పుతో పాటించారు. నిషిద్ధకాలం పూర్తయిన తరువాత వివాహం చేసుకున్నారు. హిందుస్థాన్ టైమ్స్‌లో పాత్రికేయుడుగా దేవదాస్ చేరారు. ఢిల్లీలో దేవదాస్, లక్ష్మి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ నగరంలోనే వారి నలుగురు బిడ్డలు జన్మించారు. 1934లో తార, 1935లో రాజ్‌మోహన్, 1937లో రామచంద్ర, 1945లో గోపాల్ కృష్ణ పుట్టారు. గాంధీ కుమారుడు రాజాజీ కుమార్తెను వివాహం చేసుకున్న వైనం నా మనసులో చిన్ననాటి నుంచీ నిలిచిపోయింది. దేవదాస్–లక్ష్మి ప్రేమ గాథ భారతదేశ మధ్యతరగతి ప్రజలలో విస్తృతంగా ప్రసిద్ధి పొందింది. వారి ప్రేమాయణం నా తల్లిదండ్రులకు కూడా స్ఫూర్తినిచ్చింది. నా తల్లిదండ్రులు సైతం తమ వివాహానికి ఇరువురి కుటుంబాల అనుమతికై ఐదేళ్లు వేచివున్నారు.
దేవదాస్, లక్ష్మీ గాంధీల సంతానం నలుగురితోను పరిచయం కలగడం, స్నేహ బంధం ఏర్పడడం, నా మేధో వ్యాసంగాలను వారు ప్రభావితం చేయడం నా జీవిత మహద్భాగ్యంగా భావిస్తున్నాను. వీరిలో నాకు తొలుత పరిచయమయింది తాత్త్వికుడు రామచంద్ర గాంధీ. నా మేనమామలు చదివిన సెయింట్ స్టీఫెన్ కళాశాలలోనే ఆయన విద్యాభ్యాసం జరిగింది. అయితే నాకు బాగా పరిచితుడు, సన్నిహితుడు ఆ నలుగురిలో కడగొట్టు వాడయిన గోపాల్‌కృష్ణ. 1980ల్లో మేమిరువురమూ ఢిల్లీలో పనిచేస్తుండగా మా స్నేహం ప్రారంభమయింది. గోపాల్ గృహంలోనే ఆయన అక్క తారతో నేను మొదట సమావేశమయ్యాను. ఖాదీ వ్యవహారాలపై ఆమె సాధికారిక పరిశోధనలు నిర్వహించారు. తల్లిదండ్రుల మాతృభాషలతో పాటు హిందీ, బెంగాలీ, ఇటాలియన్, ఇంగ్లీష్ మొదలైన భాషలలో కూడా ఆమెకు అద్వితీయ పాండిత్యమున్నది. గోపాల్‌కృష్ణే తన పెద్ద సోదరుడు రాజ్‌మోహన్‌ను నాకు పరిచయం చేశారు. ఈ ఆగస్టు 7న రాజ్ 90వ వసంతంలోకి ప్రవేశించారు. ఈ ప్రశంసా వ్యాసానికి ఆయన పుట్టినరోజు ఒక సంతోషకరమైన సాకు. 1990లో నేను మొట్టమొదటసారి రాజ్‌మోహన్‌ను కలుసుకున్నప్పుడు ఆయన ఒక పార్లమెంటరీ ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. 1989లో అమేథీ లోక్‌సభా నియోజకవర్గంలో ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీపై ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాజ్‌మోహన్ పోటీ చేశారు. ఆ ఎన్నిక అస్లీ గాంధీ, నక్లీ గాంధీ మధ్య పోటీగా దేశవ్యాప్తంగా సుప్రసిద్ధమయింది. రాజ్‌మోహన్ మహాత్ముడికి స్వయాన మనవడు. రాజీవ్‌కు గాంధీ పేరు యాదృచ్ఛికంగా వచ్చింది (పార్సీ మతస్తుడు అయిన రాజీవ్ తండ్రి ఫిరోజ్‌గాంధీ పేరును వాస్తవంగా ‘ఘాండీ’ అని ఉచ్చరిస్తారు). సమున్నత నైతిక, మేధో వ్యక్తి వ్యక్తిత్వమున్న రాజ్‌మోహన్‌కు సిరిసంపదలు లేవు. సహజంగానే నెహ్రూ కుటుంబానికి కంచుకోట అయిన అమేథీలో ఆయన పరాజయం పాలయ్యారు. అయితే ఆ సార్వత్రక ఎన్నికల్లో రాజీవ్ పార్టీ ఓడిపోయింది. విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. రాజీవ్‌కు గట్టి పోటీనిచ్చినందుకుగాను రాజ్‌మోహన్‌కు రాజ్యసభ సభ్యత్వం లభించింది.
చూపరులను ఇట్టే ఆకట్టుకునే వ్యక్తి రాజ్‌మోహన్. చాలా నెమ్మదిగా, మృదువుగా జాగ్రత్తగా మాట్లాడతారు. అయితే సోదరుడు రామచంద్రకు ఉన్న వాగ్ధాటి ఆయనకు లేదు. తమ్ముడిలోని కొంటె హాస్యమూ అన్నలో తక్కువే. రాజ్‌మోహన్‌తో పరిచయమైన వెంటనే ఆయనలో అపారమైన ప్రభావశీలత ఉన్నదని నాకు అర్థమయింది. అప్పటికే నేను ఆయన రాసిన రాజాజీ, పటేల్‌ల జీవితచరిత్రలు చదివాను. వాటి మేధో నైశిత్యం, నిష్పాక్షికత నన్ను ప్రగాఢంగా ప్రభావితం చేశాయి. రాజ్‌మోహన్ తొలుత ‘హిమ్మత్’ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా ఉండేవారు. ఉదారవాద విలువలను నిర్భయంగా సమర్థించేవారు. ఎమర్జెన్సీలో అనేక ఒత్తిళ్లకు తట్టుకుని నిలబడిన ఆ పత్రిక ఆ తరవాత ఆర్థికవనరుల కొరతతో మూతపడింది. తదనంతర కాలంలో ప్రధానస్రవంతి మీడియాలో సుప్రసిద్ధులు అయిన పాత్రికేయులు, రచయితలు తొలుత రాజ్‌మోహన్ మార్గదర్శకత్వంలోనే శిక్షణ పొందారు.
రాజ్‌మోహన్‌కు నన్ను గోపాల్ పరిచయం చేసిన తరువాత నేను నేరుగా ఆయనను కలిసి మాటా మంతీ జరపడం ప్రారంభించాను. రాజ్‌తో ప్రతి సమావేశమూ మన దేశ చరిత్రపై నాకు కొత్త అంతర్ దృష్టులను సమకూర్చింది. ముఖ్యంగా స్వాతంత్ర్యోద్యమంపై నా పరిజ్ఞానాన్ని ప్రగాఢమూ విస్తృతమూ చేసింది. భారత్ ప్రజాస్వామ్య, బహుళత్వ భవిష్యత్తు గురించి మేము కలతచెందేవాళ్లం. అనేక సంవత్సరాలుగా నేను ఆయనతో ఢిల్లీ, బెంగళూరు, పంచగని, ఈస్ట్ లాన్సింగ్ (మిషిగాన్)లో వివిధ విషయాలపై విస్తృతంగా సంభాషణలు జరుపుతున్నాను. రాజ్ పుస్తకాలు, వ్యాసాలు శద్ధగా చదువుతున్నాను. అవి నాలో కొత్త ఆలోచనలను పురిగొల్పాయి. ఇన్ని సంవత్సరాల మా స్నేహంలో నేను ఆయనతో ఒకే ఒక్కసారి విభేదించాను. ఇప్పుడు దాని గురించి ప్రస్తావించనవసరంలేని చాలా చిన్న విషయమది. మహాత్మాగాంధీ కంటే జవహర్‌లాల్ నెహ్రూను అమితంగా అభిమానించే కుటుంబంలో నేను పెరిగాను. భారతీయ పర్యావరణవాదంపై యువ పరిశోధకుడుగా నెహ్రూ పట్ల ఒక నిర్దిష్ట విమర్శనాత్మక దృక్పథం నాలో ఏర్పడింది. ఆయన ప్రభుత్వం అనుసరించిన ఆర్థికాభివృద్ధి నమూనా దేశ పర్యావరణ సుస్థిరతకు హానికరంగా పరిణమించడమే నెహ్రూపై నా వైఖరిని ప్రభావితం చేసింది. పర్యావరణవాదులు అయిన ఆ నాటి నా స్నేహితులు పలువురు మన మొదటి ప్రధానమంత్రిని తీవ్రంగా విమర్శిస్తుండేవారు. రాజ్‌మోహన్ ప్రభావం లేకపోతే నేనూ వారితో ఏకీభవించి ఉండేవాడినేమో? ఆర్థిక విధానం విషయమై గాంధీతో నెహ్రూ మౌలికంగా విభేదించినప్పటికీ మహాత్ముడికి న్యాయసమ్మతమైన వారసుడు నెహ్రూనే అని రాజ్‌మోహన్ తన పుస్తకం ‘The Good Boatman’లో సహేతుకంగా వాదించారు. మహాత్ముని అనుయాయులు అందరిలోనూ నెహ్రూ మాత్రమే గాంధీ సమ్మిళిత దృక్పథాన్ని బాగా అర్థం చేసుకుని అమలుపరిచారని రాజ్ పేర్కొన్నారు. మహాత్ముడి వలే నెహ్రూ కూడా ముస్లింల విశ్వాసం పొందిన హిందువు, స్త్రీలకు సమానహక్కుల కోసం పోరాడిన నాయకుడు, దక్షిణ భారతావనిలో సమస్త ప్రజల గౌరవాదరాలను పొందిన ఉత్తర భారతావని నాయకుడు. నెహ్రూకు ఉన్న ఇటువంటి విశిష్టత మహాత్ముని ఇతర ఆంతరంగికుల– రాజాజీ, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, కృపలానీ, సర్దార్ పటేల్ –లో ఎవరికీ లేదు. అరుదైన నైతిక, రాజకీయ లక్షణాలు మూర్తీభవించిన నేత నెహ్రూ మాత్రమే. గాంధీ హత్యతో హతాశులైన నెహ్రూ, పటేల్‌లు తమ వ్యక్తిగత, తాత్త్విక దృక్పథాలలో విభేదాలను విస్మరించి భారత్ ఏకీకరణకు, భారతీయుల సమైక్యతకు ఎలా కృషిచేశారో రాజ్‌మోహన్ తన పుస్తకంలో విపులంగా వివరించారు.
రాజ్‌మోహన్, రామచంద్రగాంధీ ఇరువురూ మహాత్ముడికి మనవళ్లే కాకుండా గాంధీ విద్వజ్ఞులు. ముఖాముఖి సంభాషణల్లోను, సభల్లో శ్రోతగాను రాము మాటలు వినడం ఒక మేధో నిమగ్న అనుభవం. ఋషితుల్యుడైన భారతీయ దార్శనికుడులా మౌఖిక సంప్రదాయంలో ఆయన వాణి వివేకవంతమైన ఆలోచనలను పురిగొల్పుతుంది. ఆయన సోదరుడు రాజ్‌మోహన్ రచనల్లో ఎటువంటి హాస్యోక్తులూ ఉండవు. అయితే అనుభావిక వివరాలు పుష్కలంగా ఉంటాయి. నిశితమైన అభిప్రాయాలు ఉంటాయి. విడివిడిగాను, సంయుక్తంగానూ ఈ సోదరులిరువురూ గాంధీ గురించి, భారతదేశం గురించీ నాకు చాలా విలువైన విషయాలు బోధించారు.
చివరగా రాజ్‌మోహన్‌కు సంబంధించిన, బహుశా, ఆయనకూ తెలియని ఒక చిన్న విలువైన విషయంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. భారతదేశ ఆదివాసులపై సాధికారిక పరిశోధనలు జరిపిన మానవ శాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్ వ్యక్తిగత పత్రాల నుంచి నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను. భారతీయ పౌరసత్వం స్వీకరించిన ఈ ఆంగ్లేయ విద్వజ్ఞుడు గాంధీ, నెహ్రూలకు కూడా బాగా సుపరిచితుడు. నేను తొలుతనే పేర్కొన్నట్లు రాజ్‌మోహన్ తల్లిదండ్రులు వివాహం చేసుకునేందుకు తమ పెద్దల అనుమతికి సుదీర్ఘకాలం వేచి ఉన్నారు. దేవదాస్, లక్ష్మిల వివాహం జూన్ 1933లో పూణేలో జరిగింది. అప్పట్లో గాంధీ, కాంగ్రెస్‌లు మరో దేశవ్యాప్త సత్యాగ్రహోద్యమానికి సమాయత్తమవుతున్నారన్న విషయమై వార్తలు వెలువడుతుండేవి. ఆ సందర్భంలో పూణేలో గాంధీ అనుయాయుల బృందం నొకదానితో సమావేశమైన ఎల్విన్, వారెవరూ మరొకసారి జైలుకు వెళ్లేందుకు సంసిద్ధంగా లేరన్న విషయాన్ని గ్రహించాడు. ‘ఆ బృందంలో చాలా సంతోషంగా ఉన్నది దేవదాస్, సౌందర్యవతి అయిన ఆయన భార్య లక్ష్మి మాత్రమే. ఆనందోత్సాహాలలో ఉన్న ఆ దంపతులు జైలుకు వెళ్లకూడదనే దృఢ నిశ్చయంతో ఉన్నారు’ అని తన స్నేహితుడు ఒకరికి రాసిన లేఖలో ఎల్విన్ పేర్కొన్నాడు. అంతిమంగా ప్రతిపాదిత సత్యాగ్రహం ప్రారంభమవలేదు. జైలుకు వెళ్లాలని దేవదాస్‌ను ఆయన తండ్రి ఆదేశించలేదు. దేవదాస్, లక్ష్మి ఢిల్లీకి వెళ్లి తమ సంసార జీవితాన్ని ప్రారంభించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనేక విధాలుగా ప్రశస్త ప్రతిభావంతులు అయిన నలుగురు బిడ్డలకు జన్మనిచ్చి, వారిని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు.
-రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)