Jayaprakash Narayan: భారత ప్రజాస్వామ్య ఉద్ధారకుడు
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:03 AM
స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజకీయాలలో సుప్రసిద్ధ నాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జయప్రకాశ్ నారాయణ్ శ్రీవాస్తవ జనతా పార్టీని స్థాపించి..
స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజకీయాలలో సుప్రసిద్ధ నాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జయప్రకాశ్ నారాయణ్ శ్రీవాస్తవ ‘జనతా పార్టీ’ని స్థాపించి, 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించారు. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్రలోనే చెరగని ముద్ర వేశారు. జయప్రకాశ్ నారాయణ్ 1902 అక్టోబర్ 11న బిహార్–ఉత్తర ప్రదేశ్ సరిహద్దులలోని ఒక కుగ్రామంలో జన్మించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఓహియో యూనివర్సిటీలో విద్యను పూర్తి చేసుకొని స్వదేశానికి చేరుకునే సమయంలో దేశంలో నడుస్తున్న స్వాతంత్ర్యోద్యమం వైపు ఆకర్షితుడై అందులో పాల్గొని, గాంధేయవాదిగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని స్థాపించారు. క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌లో కీలకపాత్ర పోషించారు. స్వాతంత్య్రానంతరం భారత రాజకీయాల వైపు దృష్టి కేంద్రీకరించి, పలువురు నాయకులతో చర్చించేవారు. స్వార్థపూరిత రాజకీయాలను సహించేవారు కాదు. సామాన్యులకు సమ న్యాయం జరగాలన్నదే ఆయన ప్రధాన లక్ష్యం. సాధ్యమైనంతవరకు ప్రజలకు నిర్ణయాధికార హక్కులను ఇచ్చి, స్వచ్ఛమైన పరిపాలనను అందించాలన్నదే ఆయన వాదన. తాను ఏనాడూ పదవిని ఆశించలేదు. 1974 మార్చి 18న బిహార్‌లోని విద్యార్థులు ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని లేవనెత్తారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించవలసిందిగా జయప్రకాశ్ నారాయణ్‌ను కోరగా, అంగీకరించి ఆ ఉద్యమాన్ని విజయపథంలో నడిపారు. ఉత్తర భారతంలోని అన్ని రాష్ట్రాలకు ఈ ఉద్యమం విస్తరించి బిహార్ మూవ్‌మెంట్‌గా మారింది. అప్పుడే జయప్రకాశ్ నారాయణ్‌ను ‘జె.పి’గా పిలిచారు. జె.పి– 1975 ప్రారంభంలో ‘ఛాత్ర యువ సంఘర్ష వాహిని’ అనే ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. దీని కోసం పాట్నాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ‘సమగ్ర మార్పుల కోసం – సంపూర్ణ విప్లవం’ అన్న నినాదంతో పోరాటాన్ని నడిపించాలని పిలుపునిచ్చారు.
అయితే ఇది అహింసాయుతంగా ఉండాలని, ఇందులో సామాజిక న్యాయం, అవినీతి నిరోధం, అసాంఘిక రుగ్మతలను రూపుమాపడం లాంటివి ముఖ్యోద్దేశ్యాలై సాగాలని కోరారు. రోజురోజుకు ప్రజాదరణ పెరిగి ‘సంపూర్ణ క్రాంతి జబ్ నారాహై, భావీ ఇతిహాస్ హమారాహై’ అంటూ ఉద్యమం ఉధృత రూపు దాల్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ లోక్‌సభ ఎన్నికలలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్లు నిరూపితమై, ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. అందులో ఆమె లోక్‌సభ ఎన్నిక రద్దుతో పాటు, మరో ఆరేళ్ళ వరకు ఎన్నికలలో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. ఇందిరాగాంధీ సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళింది. 1975 జూన్ 25న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, తదుపరి చర్యలు చేపట్టేవరకు తన పదవిలో కొనసాగవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పును తట్టుకోలేని ఇందిరాగాంధీ, అదేరోజు రాత్రి భారత రాజ్యాంగంలోని 352(1) అధికరణాన్ని ఉపయోగించి దేశంలో అంతర్గత అలజడుల వలన హింసాత్మక సంఘటనలు చెలరేగే అవకాశం ఉందన్న సాకుతో నాటి దేశాధ్యక్షులు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేత అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటింపజేసింది. వెంటనే పౌరుల హక్కులను తొలగించింది. వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రాలను హరించింది. రాత్రికి రాత్రే ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేయించి, జైళ్ళలో వేయించింది. దాదాపు 21 నెలల పాటు ఈ దేశం నిరంకుశత్వాన్ని చవిచూసింది. ఈ ఎమర్జెన్సీ కాలంలోనే జె.పి. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా జనతా పార్టీ పుట్టింది. 1977లో జరిగిన ఎన్నికలలో కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీని ఓడించి, ఆ పార్టీ అధికారాన్ని చేపట్టింది. జె.పి గొప్ప ప్రజాస్వామ్య పోరాట యోధుడుగా గడిపి, కొంతకాలం తర్వాత ఆరోగ్యం క్షీణించి 1979 అక్టోబరు 8న పరమపదించారు. జయప్రకాశ్ నారాయణ్ సామాజిక సేవలను గుర్తించి 1965లో రామన్ మెగసెసె అవార్జు (ఏసియా నోబుల్ ప్రైజ్) వరించింది. 1980లో ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపును రిలీజ్ చేసింది. 1999లో భారత ప్రభుత్వం దేశ ప్రముఖులకు మరణానంతరం అందజేసే అత్యున్నత అవార్డు ‘భారతరత్న’ను ప్రకటించింది. జె.పి 113వ జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దినం’గా ప్రకటించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ సిద్ధాంత కర్తగా ఈ దేశంలో నిరంకుశ పాలనను నిర్మూలించడానికి ప్రయత్నించిన సాధకులుగా జె.పి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘లోక్‌నాయక్’గా చిరస్మరణీయులయ్యారు.
-రేమద్దుల దివాకర్‌రావు మాజీ కన్వీనర్,
ఛాత్ర యువసంఘర్ష వాహిని