The Bundle of Life: బ్రతుకు మూట
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:04 AM
జాతర ఏదో జరుగుతున్నట్టు దేవతాభరణాలు ఏవో మోసుకొస్తున్నట్టు వీధుల వెంట తిరిగే ఊరేగింపు చూడడానికి చిన్నదే అయినా...
జాతర ఏదో జరుగుతున్నట్టు
దేవతాభరణాలు ఏవో మోసుకొస్తున్నట్టు
వీధుల వెంట తిరిగే ఊరేగింపు
చూడడానికి చిన్నదే అయినా
మూట విప్పితే
ఇంద్రజాలం ఏదో చూసినట్టు
రాజూ రాణీ వస్త్రాలు ఏవో ప్రదర్శనకు పెట్టినట్టు
వాకిలి నిండా పరుచుకునే బట్టల దుకాణం
చిన్న రాయుడు పెద్ద రాయుడు లుంగీలంటూ
రంభ రమ్యకృష్ణ చీరలు అంటూ
వాడు ఎన్నెన్ని కలలు మూటగట్టుకుని వస్తాడో
ఒక ధర చెప్తాడు
మనము వద్దు అంటాము
వాడు ఒక మాట అంటాడు
మనము ఇంకో మాట అంటాము
వాడొక మెట్టు దిగి
కూలీ గిట్టిన బేరం కుదిరినట్టు
కళ్ళలో నవ్వులు పూయిస్తాడు
ఉద్దెరకు ఊ కొడుతాడు
ఎంతసేపు బేరమాడినా
నుదుటిపై విసుగు బొమ్మ అగుపడనీయడు
పొద్దు తిరుగుడు పువ్వులా
ఆ సందూ ఈ సందూ తిరిగి
సాయంత్రానికి మూట దులిపి
జేబు నిండిన సంబరం
వెంటబెట్టుకుని వెళ్తాడు
కాలం ఉత్తగ ఉండనే ఉండదు కదా
కుడిచేత్తో తోలిన గాలిని
ఎడమ చేత్తో మళ్ళగొడుతున్నది
వాని ఉపాయం కాపీ కొట్టి
నడూళ్ళో వెలసిన షాపింగ్ మాల్
వాని పొట్టగొడుతూ
బ్రతుకు మీద ప్రళయ తాండవమాడుతున్నది
వడగండ్లకు రాలిపోయిన వరి గొలుసులా
ఎక్కడో
పీక తెగుతున్నది.
గజ్జెల రామకృష్ణ
89774 12795