Pandit Devi Gopalacharya: ఆయుర్వేద కర్మయోగి
ABN , Publish Date - Oct 10 , 2025 | 03:08 AM
ఆయుర్వేద మార్తాండ, భిషఙ్మణి, బ్రిటన్ మహారాజు 5వ జార్జ్ నుంచి వైద్యరత్న బిరుదు అందుకున్న అపర ధన్వంతరి, వైద్యవిజ్ఞాన మణిదీపంగా...
ఆయుర్వేద మార్తాండ, భిషఙ్మణి, బ్రిటన్ మహారాజు 5వ జార్జ్ నుంచి ‘వైద్యరత్న’ బిరుదు అందుకున్న అపర ధన్వంతరి, వైద్యవిజ్ఞాన మణిదీపంగా తెలుగు జాతికి వెలుగునిచ్చిన మహోన్నతుడు పండిత దీవి గోపాలాచార్యులు. భారతదేశంలో ఆయుర్వేదానికి పూర్వ వైభవం తీసుకువచ్చిన మహానుభావుడు. ఆయుర్వేదాన్ని అణచివేయాలన్న బ్రిటిష్ ప్రభుత్వ కుట్రల మధ్య దాని శక్తిని చాటి, పరిరక్షించినవారు. ఈ వైద్యానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కర్మయోగి. 1872 అక్టోబరు 10న కృష్ణా జిల్లా దివిసీమ భావదేవరపల్లిలో గోపాలాచార్యులు జన్మించారు. తండ్రి రామకృష్ణమాచార్యులు వైఖానస పండితుడు, ప్రసిద్ధ వైద్యుడు. తల్లి రాజ్యలక్ష్మి సదాచార సంపన్న! మూడు శతాబ్దాలుగా గ్రామంలో రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణస్వామి ఆలయం అర్చకత్వం చేస్తున్న వంశం వారిది. తిరుపతి మహంతు పాఠశాలలో సంస్కృతాధ్యయనం చేసిన గోపాలాచార్యులు, మైసూరు మహారాజా ఓరియెంటల్ పాఠశాలలో ఆయుర్వేద విద్యను, దేశమంతా పర్యటించి ప్రఖ్యాత వైద్యుల వద్ద వివిధ వైద్య విధానాల రహస్యాలను అధ్యయనం చేశారు. 23వ ఏట అనిబిసెంట్ ఆహ్వానం మేరకు బెంగళూరులో దివ్యజ్ఞాన సమాజ ఉచిత వైద్యశాల ప్రధాన వైద్యునిగా చేరారు. మైసూరు రాజ్యంలో ప్లేగు మహమ్మారి విస్తరించిన సమయంలో మైసూరు మహారాజా ఆయనను ప్రత్యేక ప్లేగు మెడికల్ ఆఫీసర్‌గా నియమించారు. తక్కువ మోతాదులో, తక్కువ ఖర్చుతో, సులభంగా దొరికే మూలికలతో హైమాది పానకం, శతధౌత ఘృతం అనే రెండు మందులు తయారు చేసి ప్లేగు తీవ్రతను విజయవంతంగా అరికట్టారు. 1899లో దక్షిణ భారతదేశ ఆయుర్వేద మహాసభ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.
1901లో మద్రాసులో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఉచిత ఆసుపత్రి ప్రధాన వైద్యుడుగా చేరారు. అనంతరం వారితో ఆయుర్వేద వైద్యకళాశాల స్థాపింపచేసి, ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. బొంబాయి, గుజరాత్, యూపీ, పంజాబ్, సింహళం, ఆంధ్ర, తమిళ, కన్నడ, మలయాళ ప్రాంతాల నుంచి విద్యార్థులు చేరారు. యల్లాప్రగడ సుబ్బారావు సహా శాస్త్రవేత్తలు ఆచార్యులుగా సేవలందించారు. కన్యకాపరమేశ్వరి దేవస్థానం వారు కళాశాలను మూసివేయాలని నిర్ణయించగా, స్వయంగా ‘చెన్నపురి ఆయుర్వేద ప్రచారిణి సభ’ స్థాపించి, ఆయుర్వేద వైద్యకళాశాలను ప్రారంభించి విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా చూశారు. మద్రాసులో ఆయుర్వేదాశ్రమం ప్రామాణికత–నిర్మాణ పద్ధతుల నిర్ధారణ కోసం మద్రాసు ఆయుర్వేద లేబొరేటరీ స్థాపించారు. అనేకమంది వైద్య విద్వాంసులను పరిశోధకులుగా నియమించారు. 1907లో నాసిక్ నయాజీ ఆయుర్వేద విద్యాపీఠం వారు ‘ఆయుర్వేద మార్తాండ’, కలకత్తా ఆయుర్వేద సమ్మేళనం వారు ‘భిషఙ్మణి’ బిరుదులతో గోపాలాచార్యులను సత్కరించారు. 1911లో లాహోరు, 1917లో హరిద్వార్, పూణే, 1918లో తెనాలి, 1919లో తిరువనంతపురంలలో జరిగిన అఖిల భారత ఆయుర్వేద మహాసభలకు అధ్యక్షత వహించారు. 1919లో శ్రీ ధన్వంతరి మాసపత్రికను తన సంపాదకత్వంలో ప్రారంభించారు. లాహోరులోని డీఏవీ ఆయుర్వేద కళాశాలకు గోపాలాచార్యులవారి చేత లాలా లజపతిరాయ్ శంకుస్థాపన చేయించారు. 1917 నవంబర్‌లోనే బెజవాడలో ‘ఆయుర్వేద మహామండలి’ స్థాపించి, యావదాంధ్ర ఆయుర్వేద వైద్యుల్ని ఏకం చేశారు. వందలాది తాళపత్ర గ్రంథాలను సేకరించి, సంస్కరించి, వాటిలో 40 గ్రంథాలకు తెలుగులో వ్యాఖ్యానాలు రాశారు గోపాలాచార్యులు. భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ అభ్యర్థనపై బ్రిటన్ రాణికి విజయవంతంగా చికిత్స చేయటంతో పంచమ జార్జి చక్రవర్తి ఆయనను ‘వైద్యరత్న’ బిరుదుతో సత్కరించారు. జాతీయ నాయకుడు బాలగంగాధర్ తిలక్‌కు గోపాలాచార్యులు సన్నిహిత మిత్రుడు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. దేశీయ వైద్య ఉద్ధరణను జాతీయోద్యమంలో భాగం చేశారు. పూణేలో ప్లేగు వ్యాపించినప్పుడు తిలక్ అభ్యర్థన మేరకు వైద్యసేవలందించారు. తెలుగువారు గర్వించదగిన పుణ్యమూర్తి, తెలుగుదనం ఉట్టిపడే వేషధారణ, ఋషి మాదిరి జీవనశైలి వారిది. దేశీయ వైద్య పునరుద్ధరణకు బాటలు వేసిన పండిత దీవి గోపాలాచార్యులు సెప్టెంబర్ 29, 1920న కేవలం 48 ఏళ్ల వయసులో తనువు చాలించారు.
-మండలి బుద్ధ ప్రసాద్ శాసనసభ్యులు, అవనిగడ్డ