Dr A S Rao: అణు మహర్షి ఎ.ఎస్.రావు
ABN , Publish Date - Sep 20 , 2025 | 06:05 AM
దేశ అభివృద్ధికి, పురోగతికి శాస్త్ర, సాంకేతిక రంగాలు అత్యంత కీలకం. ఈ రంగాల్లో స్వావలంబన సాధించాలి. విదేశీ టెక్నాలజీపై ఆధారపడటం శ్రేయస్కరం కాదు....
దేశ అభివృద్ధికి, పురోగతికి శాస్త్ర, సాంకేతిక రంగాలు అత్యంత కీలకం. ఈ రంగాల్లో స్వావలంబన సాధించాలి. విదేశీ టెక్నాలజీపై ఆధారపడటం శ్రేయస్కరం కాదు’. ఇది భారతదేశం గర్వించదగిన ఒక అగ్రశ్రేణి ప్రభుత్వ అణుశాస్త్రవేత్త పద్మభూషణ్ డాక్టర్ అయ్యగారి సాంబశివరావు (ఎ.ఎస్.రావు) ఆకాంక్ష. దేశంలో జరిగే అణుప్రయోగాలు కేవలం అణ్వాయుధాల తయారీకే పరిమితం కాకుండా మానవ కళ్యాణానికి, వ్యవసాయ, ఔషధ రంగాలకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వానికి విలువైన సూచనలు చేసిన దార్శనికుడు ఆయన. భారతదేశంలోని అన్ని రంగాలకు అవసరమైన కీలక ఉత్పత్తులు, వైద్య రంగానికి అవసరమైన కీలక పరికరాలు, పార్లమెంట్, అసెంబ్లీ, విమానాశ్రయాలు, కీలక ప్రదేశాల్లో వాడే భద్రతా వస్తువులను రూపొందించడంలో ఎ.ఎస్.రావు ముఖ్య భూమిక నిర్వహించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో, అణుధార్మిక సంబంధిత కర్మాగారాల్లో కార్మికుల భద్రత, రక్షిత పరికరాల రూపకల్పనలో మంచి దిట్టగా పేరుగాంచారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్లు తయారు చేయడంలో, ప్రతిష్ఠాత్మక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తయారీలోనూ ఆయన శ్రమ ఇమిడి ఉంది. బుల్లితెర బొమ్మ అందాలు చూపిన తొలి రోజుల్లో రూపొందించిన ఈసీ టీవీ ఆయన ముద్దుబిడ్డే. ఈసీఐఎల్ ప్రగతిలో అణువణువునా ఎ.ఎస్.రావు కృషి ఉంది. 1955లో హోమీజె బాబాతో కలిసి రూపొందించిన తొలి అణు రియాక్టర్ ‘అప్సర’ ఎ.ఎస్.రావు సారథ్యంలో శాస్త్రవేత్తలు రూపొందించినదే. ఆ తర్వాత ‘సైరస్’, ‘జెరైన్’ వంటి న్యూక్లియర్ రియాక్టర్ల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అల్లూరి సీతారామరాజు జన్మించిన పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు గ్రామంలోనే సెప్టెంబర్ 20, 1914న డాక్టర్ ఎ.ఎస్.రావు జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ (ఫిజిక్స్) పూర్తి చేశారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి 1947లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో డాక్టర్ రావు కృషికి గాను 1960లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. 1972లో పద్మభూషణ్, తర్వాత నాయుడమ్మ మెమోరియల్ స్వర్ణపతకంతో పాటు పలు అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని ఒప్పించి హైదరాబాద్‌లో ఈసీఐఎల్ స్థాపించడంలో ఎ.ఎస్.రావు పట్టుదలతో కూడిన కృషే కారణం. అనేక అత్యున్నత పదవులు, బాధ్యతలు నిర్వహించినా, ప్రపంచ ప్రఖ్యాతి పొందినా ఆయనలో గర్వం అణుమాత్రం కూడా ఉండేది కాదు. నమ్మిన ఆదర్శాలకే కట్టుబడ్డారు. ఉత్తమ సంస్కారిగా నిలబడ్డారు. సైన్సు నాలుగు గోడల మధ్య బోధించే ప్రక్రియ కాదు, పరిసరాలను నిర్దేశించి, నియమాలను శోధించడమే సైన్సు లక్ష్యమని బలంగా విశ్వసించిన శాస్త్రవేత్త ఎ.ఎస్.రావు. మూఢ నమ్మకాల జాడ్యం పోవాలంటే సైన్సు జనాదరణ పొంది అన్ని రంగాల్లోనూ ప్రవేశించాలి. సామాజిక, రాజకీయ, ఆర్థిక విప్లవాలకు సైన్సు మూలాధారం, దాని బీజాలు పాఠశాలల్లోనే వేయాలి అంటారు డాక్టర్ రావు. తన జీవితంలో శాస్త్ర, సాంకేతిక ప్రగతి కోసం కృషి చేసి, కొత్తతరం శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆయన 2003 అక్టోబర్ 31న కనుమూశారు. అవనిపై అణుశాస్త్ర విజ్ఞానంలో విప్లవం సృష్టించి, న్యూక్లియర్ ఎనర్జీతో శాంతి సాధించవచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పిన ఎ.ఎస్.రావు ‘అణు మహర్షి’ అయినారు.
– పెన్మత్స శ్రీహరిరాజు