Share News

కమ్యూనిస్టుల ఐక్యతే ప్రత్యామ్నాయం

ABN , Publish Date - Mar 13 , 2025 | 03:21 AM

భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి నూరేళ్లకు పైగా చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి ముందు, తరువాత అనేక సమరశీల పోరాటాలకు నేతృత్వం వహించింది. 1925లో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం తరువాత...

కమ్యూనిస్టుల ఐక్యతే ప్రత్యామ్నాయం

భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి నూరేళ్లకు పైగా చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి ముందు, తరువాత అనేక సమరశీల పోరాటాలకు నేతృత్వం వహించింది. 1925లో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం తరువాత అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, రష్యా సోషలిస్టు విప్లవం స్ఫూర్తితో తిరువాన్కూర్‌ సంస్థాన విముక్తి, తెలంగాణ నిజాం సంస్థాన విముక్తి సాయుధ పోరాటాలను పార్టీ నిర్వహించింది. అశేష త్యాగాలు చేసింది. వేలాది పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రాణాలు అర్పించారు. ప్రస్తుతం దేశ పరిస్థితులు కమ్యూనిస్టుల ఐక్యతను వాంఛిస్తున్నాయి. కానీ చీలిక నాటి పిడివాదం నేటికీ కొనసాగుతున్నది. 1964లో చీలికకు కారణమైన వారు నేడు ఐక్యతను నిరాకరిస్తున్నారు. భారత ఉపఖండంలోని శ్రీలంక, నేపాల్‌ వంటి దేశాలలో ఐక్యత ద్వారా రాజ్యాధికారం ప్రజాస్వామ్యయుతంగా సాధించిన అనుభవం కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా కమ్యూనిస్టు పార్టీల ఐక్యతను గుడ్డిగా నిరాకరిస్తున్నారు. నేడు దేశంలో ఫాసిస్టు శక్తులు విజృంభించి మత కలహాలను సృష్టించి స్వార్థ రాజకీయ ప్రయోజనాలను సాధించుకుంటున్నా కమ్యూనిస్టులు ఐక్యత గురించి ఆలోచించడం లేదు. పశ్చిమ బెంగాల్‌, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వామపక్షాలు అధికారం కోల్పోయి, పార్టీలు బలహీనపడుతున్నా ఐక్యతకు చొరవ చూపడం లేదు. పార్టీ శ్రేణుల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరిస్తూ రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ, సైద్ధాంతికంగా ఏకాభిప్రాయం ఉన్న సీపీఐ, సీపీఐ(ఎం)లు ఐక్యతా దిశగా పయనిస్తే, విప్లవ పార్టీలు, మావోయిస్టు పార్టీల మధ్య ఐక్యత సాధించటం పెద్ద సమస్య కాదు.

ప్రస్తుత పరిస్థితులలో మావోయిస్టు విప్లవకారుల వ్యూహం ఎత్తుగడలలో లోపం కనిపిస్తున్నది. చరిత్ర నుంచి పాఠాలు తీసుకోవడంలో వారు విఫలమవుతున్నారు. అడవులలో వారికి ప్రజాదరణ తగ్గింది. నేడు ప్రజాకోర్టులు లేవు. రాజ్యహింస పెరిగిపోయింది. మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంతో సైన్యం ఆధునిక యుద్ధతంత్రాన్ని అడవులలో అమలు చేస్తున్నది. వందలాది మంది కార్యకర్తలను, నాయకులను నిర్దాక్షిణ్యంగా మట్టుబెడుతున్నారు. నూతన పరిస్థితులకు అనుగుణంగా నూతన సైద్ధాంతిక ఆలోచన, ఆచరణ లేకుండా పాత పోరాట మార్గంలో వెళ్లటం భారీ నష్టాలను కలిగిస్తున్నది. లౌక్యం లోపించడం వల్ల దండకారణ్యం రక్తపంకిలం అవుతున్నది.


నేడు దోపిడీ కొత్త రూపాలను సంతరించుకుంది. నూతన పోరాట రూపాలను మనం ఎంచుకోవలసి ఉంది. ప్రజాస్వామ్య క్రమంలో ప్రజాక్షేత్రంలో పోరాటాలు నిర్వహించాలి. ఎన్ని లోటుపాట్లు ఉన్నా ప్రజలు ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిధిలో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం వహిస్తున్నారు. మావోయిస్టులు కాదన్నా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న గిరిజనులు, ప్రజలు నేడు దూరంగా జరిగిపోయారు. అయినా సాయుధ పోరాటమే శరణ్యం అనడం ‘నేల విడిచి సాము చేయటమే’ అవుతుంది. నేడు దేశంలో ప్రజలు సాయుధ పోరాట అవసరాన్ని గుర్తించటం లేదు. రాజ్యహింస పెచ్చుమీరుతున్న దశలో ఇకనైనా కమ్యూనిస్టు శ్రేణులు దేశ, ప్రజా ప్రయోజనాల రీత్యా పునః పరిశీలన చేయాలి. తమ విధానాలను పునః సమీక్షించాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు రక్షణగా నిలవాలి. భేషజాలకు, ఆధిపత్య ధోరణులకు స్వస్తి చెప్పి ఐక్యతా చర్చలకు తెరతీయాలి. లేని పక్షంలో కమ్యూనిస్టులను చరిత్ర క్షమించదు.

చలసాని వెంకటరామారావు

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 13 , 2025 | 03:21 AM